logo

కొత్త గనులపై సింగరేణి దృష్టి

డిమాండ్‌కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.

Published : 18 May 2024 05:51 IST

బొగ్గు ఉత్పత్తి పెంపే లక్ష్యం

న్యూస్‌టుడే, గోదావరిఖని: డిమాండ్‌కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది. అందుకు కొత్త గనుల ఏర్పాటుపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులకు వేలం వేస్తుండటంతో గత భారాస సర్కారు పాల్గొన వద్దని సూచించింది. అయితే రాష్ట్రంలో ఇటీవల ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం దీనిపై సానుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో కొత్త చట్టం ప్రకారం వేలంలో పాల్గొనాలా.. రాయల్టీ చెల్లించి దక్కించుకోవాలా అనే విధానంపై సంస్థ చర్చలు జరుపుతుంది. అయితే గనులు నేరుగా దక్కించుకుంటే రాయల్టీ ద్వారా ఎక్కువ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. టెండర్‌లో వివిధ సంస్థలతో పోటీ పడాలి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సంస్థ ముందుకు వెళ్లనుంది. రానున్న కాలంలో 100 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళికలు వేసుకున్న సింగరేణికి కొత్త గనులు ఏర్పాటు తప్పనిసరిగా మారింది. వేలంలో శ్రావణ్‌పల్లి, సత్తుపల్లి ఓసీపీ-3 బ్లాకులతో పాటు కేకే-6 భూగర్భ గనులను ముందుగా దక్కించుకోవాలని ఆలోచిస్తుంది. వీటి ద్వారా కనీసం ఏటా 10 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి పెంచుకోవచ్చని భావిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచి గనులు కేటాయించాలని సింగరేణి కోరనుంది. దానికి అవసరమైన ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. కేంద్రం 2021లో గనులు ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టం కింద మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ డెవలప్‌మెంట్‌ రెగ్యులేషన్‌ బిల్లును తీసుకువచ్చింది. ఈ చట్ట ప్రకారం దేశంలో ఎక్కడ బొగ్గు గనులు ఏర్పాటు చేయాలన్నా ప్రభుత్వం నిర్వహించే వేలంలో పాల్గొనాల్సిందే. ఇది సింగరేణికి ప్రతిబంధకంగా మారింది. అంతకుముందు ఎక్కడ బొగ్గు నిక్షేపాలున్నా తవ్వుకోడానికి అవకాశం ఉండేది. కేవలం పర్యావరణ, గని ఏర్పాటుకు మాత్రమే కేంద్రం నుంచి అనుమతులు పొందేది. ఈ చట్టం తీసుకువచ్చిన తర్వాత ఇతర సంస్థలతో పాటు వేలంలో పోటీ పడి టెండర్‌లో దక్కించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత భారాస ప్రభుత్వం వేలం లేకుండా సింగరేణికే గనులు కేటాయించాలని డిమాండ్‌ చేసిన ఫలితం లేదు. ఇప్పటికే సింగరేణి ప్రాంతంలోని కోయగూడెం ఓసీపీని వేలంలో ఓ సంస్థ దక్కించుకుంది. మరోసారి టెండర్ల ప్రక్రియ సిద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు వేలంలో పాల్గొనాలా? లేదంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాయల్టీ చెల్లించి గనులను దక్కించుకోవాలా అనే అంశాలపై చర్చిస్తున్నారు. వేలంలో దక్కించుకుంటే కేవలం 4.5 శాతం మాత్రమే రాయల్టీ చెల్లించాలి. నేరుగా అయితే 14 శాతం చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై సింగరేణి వెనుకడుగు వేస్తోంది. 14 శాతం చెల్లిస్తే బొగ్గు ధర పెంచుకోవాల్సి వస్తుంది. మార్కెట్‌లో ఎక్కువ ధరకు బొగ్గు కొనుగోలు చేసే అవకాశం లేదు. ఇప్పటికే విదేశాల నుంచి తక్కువ ధరకు బొగ్గు అందుబాటులోకి వస్తున్న క్రమంలో దీనిపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ప్రణాళికల్లోనే గనులు

సంస్థ భవిష్యత్తులో ప్రారంభించాలనుకునే గనులపై ప్రణాళికలు వేసుకుంది. భూగర్భ అన్వేషణతో పాటు ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసుకుంది. అందులో ఉన్న బొగ్గు నిక్షేపాలు, ఎంత లోతుల్లో ఉన్నాయి అన్న వివరాలతో ప్రణాళికలు రూపొందించుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వ కొత్త చట్టం వాటి ప్రారంభానికి అడ్డంకిగా మారింది. కొత్తగా రాంపూర్, పుణుకుడుచిలక, కాచనపల్లి, కొత్తగూడెంలో వీకే కోల్‌మైన్స్, బెల్లంపల్లి ఏరియాలో గోలేటీ ఓసీపీ, ఎంవీకే ఓసీపీ, వీటితో పాటు రామగుండంలో మెగా ఓసీపీకి ప్రణాళికలు ఉన్నాయి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ముందుకు వెళ్లనుంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని