
బెంగళూరులో ఓ ఆరోగ్య కేంద్రం వద్ద టీకా వేయించుకునేందుకు జనం వరుస
బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : కరోనా సెగ ఒకింత పెరగడంతో కర్ణాటక అప్రమత్తమైంది. మొన్నటి వరకు రెండొందల మార్కు దాటని వైరస్ పీడితులు.. ఒక్కసారిగా పెరిగారు. శనివారం ఈ సంఖ్య 322కి చేరుకుంది. చికిత్స అనంతరం 176 మంది ఇళ్లకు తిరిగి వెళ్లారు. చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. పాజిటివిటీ 0.34 శాతం, మరణాలు 0.93 శాతంగా నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3.48 లక్షల మంది టీకా వేయించుకున్నారు. టీకా వేయించుకునేందుకు ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు ఎక్కువగా ముందుకు వస్తున్నారు. కేసుల సంఖ్య పెరగడం, కొత్త రకం వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో 94,651 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేపట్టారు. కేరళ, మహరాష్ట్ర సరిహద్దులు, ధార్వాడ, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఈ పరీక్షలను ముమ్మరం చేయాలని ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు. కార్యాలయాలు, మాల్స్‌లో పని చేసే వారు రెండు డోసులను వేయించుకునేలా ఆ సంస్థల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.