logo
Published : 28 Nov 2021 00:54 IST

కొత్త వైరస్‌ నియంత్రణకు కసరత్తు

అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా

అధికారుల సమావేశంలో సీఎం ఆదేశం

అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు : కరోనా కొత్త రూపం ‘ఒమిక్రాన్‌ వేరియంట్‌’ నియంత్రించేందుకు కర్ణాటక సర్కారు సర్వ సన్నాహాలూ మొదలుపెట్టింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కొత్త వైరస్‌ వెలుగుచూడకపోయినా.. అలాంటి సమస్య తలెత్తకుండా ఆరోగ్య, హోం, రెవెన్యూ శాఖలను అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శనివారం సాయంత్రం బీబీఎంపీ, బెంగళూరు గ్రామీణ, ధార్వాడ, దక్షిణ కన్నడ, ఉడుపి, చామరాజనగర, కొడగు, మైసూరు జిల్లా పాలన అధికారులతో వీడియో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్త వైరస్‌ నియంత్రణకు కొత్త మార్గదర్శకాలు ప్రకటించారు.

కరోనా కేసులు వేగంగా విస్తరించే కేరళ, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పాలన యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ జిల్లాల్లో అధికారులు మూడు విడతలుగా పని చేయాలని సూచించారు. జాతీయ రహదారుల వాహనాల తనిఖీ, కేరళ, మహారాష్ట్రల నుంచి వచ్చే వారికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష తప్పనిసరి చేయాలన్నారు. పక్షం రోజుల కిందట కేరళ నుంచి వచ్చిన విద్యార్థులకు మరోమారు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు, వసతి నిలయాల్లో ఉండే విద్యార్థులకు నెగటివ్‌ నివేదికలు వచ్చినా వారం తర్వాత మళ్లీ పరీక్షలు చేపట్టాలని ఆదేశించారు. హోటల్‌, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, ఈత కొలనులు, గ్రంథాలయాలు, జంతు ప్రదర్శనశాల, ఉద్యానవనాలు, వైద్య, నర్సింగ్‌ కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, మాల్స్‌లో పని చేసే వారు తప్పనిసరిగా రెండు డోసుల టీకా వేసుకుని ఉండాలి. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పరీక్ష వ్యవస్థలను కట్టుదిట్టం చేయాలన్నారు.

మళ్లీ నిబంధనలు

పాఠశాలలు, కళాశాలల్లో సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలను వాయిదా వేయాలని త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని రెవెన్యూ మంత్రి ఆర్‌.అశోక్‌ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం కొత్త వైరస్‌ రాష్ట్రంలో వెలుగు చూడకున్నా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొత్త వైరస్‌ కేసులు లేదా కరోనా కేసులు పెరిగితే మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తామన్నారు. క్రిస్మస్‌, కొత్త సంవత్సరం వేడుకల నిర్వహణపై త్వరలో ముఖ్యమంత్రి నేతృత్వంలో సమావేశం నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. బూస్టర్‌ డోసుల కోసం కేంద్ర సర్కారు అనుమతి కోసం ఎదురుచూస్తుండగా, కరోనా యోధులకు ప్రాధాన్యక్రమంలో అది అందిస్తామని చెప్పారు.

రెండో డోసుకు అర్హత ఉన్న 44 లక్షల మంది ఆసక్తి చూపడం లేదని ఆరోగ్యమంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 90శాతం మంది కనీసం ఒక డోసు టీకా వేసుకోగా, రెండు డోసులను 57 శాతం మంది వేసుకున్నారు. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో ఎక్కువ మందికి టీకా వేసినట్లు ఆయన చెప్పారు. విమానాశ్రయాల్లో ఆరోగ్య సిబ్బందిని నియమించి, నెగటివ్‌ నివేదిక వచ్చినా కనీసం వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతామన్నారు. ధార్వాడలో మరో 1500 మంది పరీక్ష నివేదికలు రావాల్సి ఉండగా, వీరికి జన్యు రూపాంతర పరీక్షలు చేపడతామన్నారు. కరోనా వైరస్‌ దాదాపు 25 రకాల జన్యు మార్పులు చెందే అవకాశం ఉండటంతో నిత్యం వీటితో పోరాడక తప్పదన్నారు. ఆస్పత్రుల్లో ఔషధాల కోసం సర్కారు రూ.35 కోట్లను కేటాయించగా రానున్న రోజుల్లో ఔషధ కొరత లేకుండా చూస్తామన్నారు.

తనిఖీలు కట్టుదిట్టం

బావలి చెక్‌పోస్ట్‌ వద్ద బందోబస్తు

మైసూరు, న్యూస్‌టుడే : రాష్ట్రం నుంచి కేరళకు వెళ్లే మార్గంలోని బావలి చెక్‌పోస్ట్‌ వద్ద ఆంక్షల్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ఒమిక్రాన్‌ వైరస్‌ పీడిస్తున్న నేపథ్యంతో పాటు కేరళలో నోరో వైరస్‌ సోకినట్లుగా చెబుతున్నందున ఆ రాష్ట్రం నుంచి కర్ణాటకలోకి ప్రవేశించేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. ఒకవైపు వర్షం కురుస్తున్నా వైద్య సిబ్బందితో కలిసి తనిఖీల్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని