logo

మరో విడత మోదీ రాక

బెంగళూరు అంతర్జాతీయ వస్తు ప్రదర్శన కేంద్రంలో ఇండియా ఎనర్జీ వీక్‌-2023 కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఉద్యాననగరికి రానున్నారు

Published : 05 Feb 2023 06:51 IST

బెంగళూరు, తుమకూరులో చకచకా ఏర్పాట్లు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : బెంగళూరు అంతర్జాతీయ వస్తు ప్రదర్శన కేంద్రంలో ఇండియా ఎనర్జీ వీక్‌-2023 కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఉద్యాననగరికి రానున్నారు. ఇందులో భాగంగా ఉదయం 11.30కి ఇథనాల్‌ మిశ్రమ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇ-20 ఇంధన ఉపక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30కి బెంగళూరు నుంచి తుమకూరు చేరుకుని హెచ్‌ఏఎల్‌ పరిశ్రమను ప్రారంభిస్తారు. భారత్‌లో తయారీ నినాదానికి అనుగుణంగా రక్షణ శాఖ చేపట్టిన చర్యల ఫలితంగా తుమకూరులో హెచ్‌ఏల్‌ హెలికాఫ్టర్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసింది. తుమకూరు పారిశ్రామికవాడ, పట్టణంలో రెండు జలజీవన్‌ అభియాన్‌ పథకాలకు కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మోదీ 2016లో తుమకూరులో హెలికాఫ్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. హరిత వలయంలో 615 ఎకరాల విస్తీర్ణంలో వస్తున్న ఈ పరిశ్రమ ఏర్పాటుతో హెచ్‌ఏఎల్‌ తన సామర్థ్యాన్ని పెంచుకోవడం, రక్షణ శాఖ అవసరాలకు కావలసిన హెలికాఫ్టర్లను అందించడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుకానున్నాయి. పర్యావరణ స్నేహి హెలికాఫ్టర్ల నిర్మాణంలో ఇది ఆసియా ఖండంలోనే అతి పెద్ద తయారీ పరిశ్రమ కానుంది. ప్రారంభంలో తేలికపాటి హెలికాఫ్టర్లను తయారు చేయనున్నారు. మూడు టన్నుల శ్రేణిలో, ఒకే ఇంజినుతో వివిధ అవసరాలకు వినియోగించుకునే లోహ విహంగాలను ఇక్కడ తయారు చేసేందుకు అనువుగా హెచ్‌ఏఎల్‌ ఇక్కడ పరిశ్రమను నెలకొల్పింది. తదుపరి దశలలో తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్లు (ఎల్‌సీహెచ్‌), ప్రజా రవాణాకు ఉపయోగపడే లోహ విహంగాలు, ఇతర మోడళ్ల హెలికాఫ్టర్లను తయారు చేస్తారు. భారత్‌లో తయారీ నినాదానికి మరింత మద్దతు, ఊతం ఇచ్చేలా ఈ పరిశ్రమను హెచ్‌ఏఎల్‌ సిద్ధం చేసింది. ఇండస్ట్రీ-4.0 నినాదం, కొలమానాలకు అనుగుణంగా రానున్న 20 ఏళ్లలో తుమకూరులో హెచ్‌ఏఎల్‌ సంస్థ 3 నుంచి 15 టన్నుల సామర్థ్యం ఉన్న వెయ్యికి పైగా హెలికాఫ్టర్లను తయారు చేయాలనేది లక్ష్యం. ఈ పరిశ్రమ ద్వారా ఆరు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తుమకూరు పారిశ్రామికవాడ నిర్మాణానికి మోదీ శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. జాతీయ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తుమకూరులో మూడు దశలలో 8484 ఎకరాలలో ఈ పారిశ్రామికవాడను అభివృద్ధి చేయనున్నారు. ఇది బెంగళూరు- చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగం కానుంది. తుమకూరు జిల్లా చిక్కనాయనహళ్లి, తిపటూరులో జల్‌ జీవన్‌ అభియాన్‌ పథకాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. తిపటూరులో రూ.430 కోట్లు, చిక్కనాయనకహళ్లిలో రూ.115 కోట్లతో స్థానికులకు తాగునీటి సదుపాయాలను కల్పించేందుకు ఈ ప్రాజెక్టు పనులు చేపట్టనున్నారు.

ఉపయుక్తంగా ఇంధన వేదిక

ఇండియా ఎనర్జీ వీక్‌ సమావేశాలు 6-8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. భారతదేశంలో ఇంధన వినియోగంలో వస్తున్న మార్పులు, ఇంధన ఆదాకు ఉపయుక్తమైన పరికరాలపై నిపుణులు ఈ సమావేశాలలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. సంప్రదాయక, సంప్రదాయేతర విధానాలలో ఇంధన ఉత్పత్తి, ఎదురవుతున్న సవాళ్లపై దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చిస్తారు. సుమారు 30 దేశాలకు చెందిన మంత్రులు, 30 వేల మంది ప్రతినిధులు, ఒక వెయ్యి స్టాళ్లు, 500కు పైగా నిపుణుల ప్రసంగాలు, ఇంధనంగా ఇథనాల్‌ వినియోగం తదితర అంశాలపై సమావేశం, సదస్సులు, చర్చాగోష్ఠులు ఉంటాయి. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు రూ.54 వేల కోట్ల రూపాయల విదేశీ వినియమ ద్రవ్యాన్ని ఆదా చేసే అంశమై నిపుణులు ప్రసంగిస్తారు. పెట్రోలులో 20 శాతం ఇథనాల్‌ను కలిపి (ఇ-20) వినియోగించే చర్యలను మోదీ ప్రారంభిస్తారు. ప్రారంభంలో 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇ-20 ఇంధనం 2025 నాటికి అన్ని రాష్ట్రాలకు విస్తరించే లక్ష్యాన్ని కలిగి ఉంది. హరిత రవాణా వ్యవస్థను కూడా ప్రధాని రేపు ప్రారంభిస్తారు. ఒకసారి మాత్రమే వాడి పడేసే ప్లాస్టిక్‌ను నియంత్రించేందుకు తీసుకోవలసిన చర్యలపై ప్రధాని నిపుణులతో సమావేశం అవుతారు. కార్యక్రమంలో భాగంగా భారతీయ చమురు మండలి సిద్ధం చేసిన సౌర శక్తితో వంట చేసే విధానాలను, పరికరాలను ఆవిష్కరించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని