logo

పెట్టుబడిదారులకే మోదీ ఊతం

రైతుల రుణాలు మాఫీˆ చేయడం కన్నా, శ్రీమంతులు, పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేయడంపైనే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆసక్తి ఎక్కువని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు.

Published : 27 Apr 2024 04:59 IST

విజయపుర సభలో సిద్ధరామయ్య

విజయపుర సభలో ప్రసంగిస్తున్న  సిద్ధరామయ్య

విజయపుర, న్యూస్‌టుడే : రైతుల రుణాలు మాఫీˆ చేయడం కన్నా, శ్రీమంతులు, పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేయడంపైనే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆసక్తి ఎక్కువని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. రాజ్యాంగమంటే భాజపాకు గౌరవం లేదన్నారు. విజయపురలో తమ పార్టీ అభ్యర్థి రాజు హలగూరుకు మద్దతుగా శుక్రవారం నిర్వహించి ప్రజాధ్వని-2లో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ స్వాతంత్య్రం దక్కినప్పుడు మాత్రమే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. గరీబీ హఠావో, భూ సంస్కరణల చట్టం, చాకిరీ వ్యవస్థ రద్దు, మలాన్ని చేతులతో ఎత్తిపోసే విధానాన్ని రద్దు చేయడం.. ఇవన్నీ కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే వచ్చాయని తెలిపారు. భారత్‌ వెలిగిపోతోంది.. (ఇండియా షైనింగ్‌) అంటూ ఎన్నికలకు వెళ్లిన ఏబీ వాజ్‌పేయీ 2004లో ఓడిపోయారని, 2047కు వికసిత భారత్‌ అంటూ ప్రచారం చేసుకుంటున్న భాజపా ఈసారి ఓడిపోతుందని జోస్యం చెప్పారు. తమకు కనీసం 400 సీట్లు వస్తాయని ప్రచారం చేసుకుంటూ మేకపోతు ధైర్యాన్ని ప్రదర్శిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజల మధ్య అసమానతలు ఉంటేనే భాజపాకు ఇష్టమని ఆరోపించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను కర్ణాటక ప్రభుత్వం తొలగించలేదని స్పష్టం చేశారు. ఏఐసీసీ నాయకుడు రాహుల్‌గాంధీ ఈ కార్యక్రమానికి ఆలస్యంగా హాజరయ్యారు. విజయపురలో కార్యక్రమాన్ని ముగించుకుని వారు నేరుగా బళ్లారికి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని