logo

పోలింగ్‌.. శాంతియుతం

చెదురుమదురు ఘటనలు మినహా 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాంతియుతంగా ముగిసింది.

Published : 27 Apr 2024 05:04 IST

అక్కడక్కడ చిరు సంఘటనలు

బెంగళూరు గ్రామీణ పరిధిలో సాయంత్ర వేళ పోలింగ్‌ బూత్‌ల వద్ద రద్దీ

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : చెదురుమదురు ఘటనలు మినహా 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాంతియుతంగా ముగిసింది. చామరాజనగర నియోజకవర్గం హనూరు తాలూకా మలెమహదేశ్వర బెట్ట సమీప ఇండిగనత్త గ్రామంలో స్థానికులు ఎన్నికలను బహిష్కరించారు. ఎన్నికలు వద్దన్నా బూత్‌ను ఏర్పాటు చేయడంతో ఈవీఎం, వీవీ ప్యాట్, పీఠోపకరణాలను గ్రామస్థులు ధ్వంసం చేశారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ప్రతిగా గ్రామస్థులు రాళ్లతో ఎదురుదాడికి దిగారు. కోలారు జిల్లా మాలూరు తాలూకా తోరనహళ్లి పరిధిలో కొన్ని గ్రామాల ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు.

  • చామరాజనగర లోక్‌సభ నియోజకవర్గం సంతేమరహళ్లిలో చేతన్‌ అనే యువకుడు పెళ్లి దుస్తుల్లోనే ఓటు వేసేందుకు వచ్చారు. తన వివాహం ఉదయం తొమ్మిది గంటలకు కాగా, కుటుంబ సభ్యులతో కలిసి ఏడు గంటలకే బూత్‌కు వచ్చి ఓటు వేసి వెళ్లారు. చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా కుందూరు గ్రామంలో సుమిక్ష అనే యువతి వివాహం చేసుకునేందుకు కల్యాణ మండపానికి వెళ్లేందుకు ముందుగా ఓటు వేసి వెళ్లారు. మైసూరు జిల్లా హుణసూరు తాలూకా తిప్పూరు గ్రామానికి చెందిన పుట్టమ్మ (90) ఓటు వేశారు. పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు వస్తూ కుప్పకూలిపోయారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేలోగా మరణించారు. మంగళూరు, ఉడుపి పరిధిలో అరేబియా సముద్రంలోని చిన్న ద్వీపాలలో ఉంటున్న వారు బోట్లలో తీరానికి వచ్చి ఓటు వేసి వెళ్లారు.
  • విశ్రాంత ఎయిర్‌ మార్షల్‌ పీవీ అయ్యర్‌ (94) చక్రాల కుర్చీలో వచ్చి బెంగళూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హొళెనరసీపుర పరిధి మేళగోడు గ్రామంలో బోరమ్మ (101) ఓటు హక్కు వినియోగించుకుని, యువత కూడా పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు రావాలని పిలుపునిచ్చారు. దొడ్డబళ్లాపురలో శతాయుషి వెంకటమ్మ పోలింగ్‌ కేంద్రానికి ఉత్సాహంగా కదలివచ్చారు. కోలారు శివార్లలోని బసవనత్త గ్రామానికి చెందిన ముని వెంకటప్ప (107) ఎవరి సహాయం లేకుండా వచ్చి తన హక్కు వినియోగించుకున్నారు. మైసూరులో భాజపా అభ్యర్థి యదువీర్‌ కృష్ణదత్త ఒడెయరు, భార్య త్రిషికా దేవి, తల్లి ప్రమోదా దేవితో కలసి ఓటు వేసి వెళ్లారు. బెంగళూరు సదాశివనగరలో రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, ఆయన భార్య మంగళ, నిర్మాత అశ్విని పునీత్‌ రాజ్‌కుమార్‌ ఓటు హక్కు వినియోగించుకోగా, మల్లేశ్వరంలో రాజ్యసభ సభ్యుడు జగ్గేశ్‌, తుమకూరులో హోం మంత్రి పరమేశ్వర్‌, బెంగళూరు ఉత్తర లోక్‌సభ పరిధిలో డీవీ సదానందగౌడ, సప్తమిగౌడ, ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వేశారు. మండ్య లోక్‌సభ సభ్యురాలు, సీనియరు నటి సుమలత మద్దూరు తాలూకా దొడ్డరసినకెరె గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిక్కమగళూరు-ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థిరంగా పోలింగ్‌ కొనసాగింది.

చామరాజనగర పరిధిలో ఓటర్ల ఆగ్రహానికి ధ్వంసమైన ఓ పోలింగ్‌ బూత్‌

నిరసన బాట : బెంగళూరులో ఓ పోలింగ్‌ బూత్‌ వద్ద ఖాళీ సిలిండర్‌, చెంబులతో యువజన కాంగ్రెస్‌ ప్రతినిధులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని