logo

భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్‌రావు

ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్‌ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్‌ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

Published : 25 Apr 2024 03:02 IST

ఖమ్మంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్‌రావు, చిత్రంలో భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు,
పువ్వాడ అజయ్‌, ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు

ఈటీవీ, ఖమ్మం: ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్‌ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్‌ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఖమ్మం లోక్‌సభ స్థానానికి భారాస అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామపత్రాలు దాఖలు చేసిన సందర్భంగా ఖమ్మంలో బుధవారం నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. భారాస హయాంలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు రెండు వైద్య కళాశాలలు కేటాయించామన్నారు. సాగుభూములను సస్యశ్యామలం చేసేందుకు సీతారామప్రాజెక్టు నిర్మాణం చేపట్టామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రితోపాటు రహదారులను మెరుగుపరిచామని తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలో ఖమ్మంలో మంచినీటి సరఫరా సక్రమంగా జరగటం లేదన్నారు. గ్రానైట్‌ పరిశ్రమకు 40 శాతం రాయల్టీ రద్దయ్యిందని చెప్పారు. సాగునీటి కోసం రైతులు పాలేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తుకోవాల్సి వచ్చిందన్నారు. జిల్లాలో పంటలు ఎండిపోయి వేలాది మంది రైతులు నష్టపోయారని తెలిపారు.

మార్పు అంటే ముగ్గురు నాయకులకు ఉద్యోగాలొచ్చాయి తప్పితే.. ప్రజలకు తాగునీరు,  సాగునీరు రావటం లేదన్నారు. ఖమ్మం ఎంపీగా నామా గెలుపుతోనే కాంగ్రెస్‌కు కనువిప్పు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజలు మళ్లీ కేసీఆర్‌ వైపు చూస్తున్నారని.. ఈ ఎన్నికల్లో ప్రతి గడపను తట్టి భారాసను గెలిపించేందుకు కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్‌ మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. కేరళ ముఖ్యమంత్రి అవినీతిపరుడని, మోదీ ఏజెంట్‌ అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించినా కమ్యూనిస్టులు ఎందుకు కాంగ్రెస్‌కు ఊడిగం చేస్తున్నారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కేసీఆర్‌, భారాస మాత్రమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలను వంచించిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో  గుణపాఠం చెప్పాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ఖమ్మం నుంచే కాంగ్రెస్‌ పతనం మొదలవుతుందన్నారు. సమావేశం అనంతరం ముఖ్యనేతలతో హరీశ్‌రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నామా గెలుపు కోసం నేతలంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజు, ఖమ్మం మేయర్‌ పునుకొల్లు నీరజ, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, నాయకులు ఆర్జేసీ కృష్ణ, వెంకటరమణ, నాగరాజు, బచ్చు విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని