నెత్తురోడిన రహదారి
వాహనాలు ఢీకొని తండ్రీకొడుకులు దుర్మరణం
మెదక్-చేగుంట దారిపై రాస్తారోకో చేస్తున్న గ్రామస్థులు, కుటుంబ సభ్యులు
చిన్నశంకరంపేట, న్యూస్టుడే: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండలం అంబాజిపేట గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకుంది. రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్, ఎస్ఐ గౌస్ తెలిపిన వివరాలు.. కొర్విపల్లి గ్రామానికి చెందిన పోచయ్య, తల్లిదండ్రులు రాజవ్వ, బీరయ్య ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంపై చిన్నశంకరంపేటలో బుధవారం నిర్వహించే వార సంతకు వెళ్తున్నారు. చేగుంట నుంచి మెదక్ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. అక్కడికక్కడే పోచయ్య(35) మరణించాడు. తల్లి రాజవ్వకు స్వల్పగాలయ్యాయి. తండ్రి బీరయ్య(55)ను మెదక్ ఆసుపత్రికి, తర్వాత హైదరాబాదుకు చికిత్స కోసం తరలించగా మార్గమధ్యలో మరణించాడు. పోచయ్యకు బార్య, ఐదేళ్ల లోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కారు చోదకుడు కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంత నుంచి చిన్నారులకు కావాల్సిన వస్తువులు తెస్తామని చెప్పిన తాత, తండ్రి మృతి చెందడంతో బోరున విలపిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి వచ్చి మెదక్-చేగుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాత్రయినా కొనసాగిస్తున్నారు. రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.