logo

ధర లేక రైతన్న దిగాలు

యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు.

Published : 24 Apr 2024 03:15 IST

సన్నధాన్యానికి లభించని గిట్టుబాటు

 న్యూస్‌టుడే, చేగుంట: యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. సాధారణంగా యాసంగిలో సన్నధాన్యం పండించేందుకు రైతులు ఆసక్తి చూపరు. దానికి కారణం ఎక్కువగా నూకలు అవుతుంటాయి. అయినా ఈసారి మాత్రం జిల్లా వ్యాప్తంగా చాలా మంది సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత ధర లేకపోవటంతో ఇబ్బంది పడుతున్నారు.

 75 వేల ఎకరాల్లో సాగు : జిల్లా వ్యాప్తంగా 2,60,933 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. చేగుంట, పాపన్నపేట, చిన్నశంకరంపేట, హవేలిఘనపూర్‌, రామాయంపేట, నిజాంపేట, శివ్వంపేట, మెదక్‌, కొల్చారం, నర్సాపూర్‌, నార్సింగి, కౌడిపల్లి, చిలప్‌చెడ్‌, తూప్రాన్‌ మండలాల్లో రైతులు వరి సాగుచేశారు. ఇందులో రికార్డు స్థాయిలో సుమారు 75 వేల ఎకరాల్లో సన్న ధాన్యం పండించారు. గతంలో ఎప్పుడు కూడా ఇన్ని వేల ఎకరాల్లో సాగు చేయలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో సన్నబియ్యం ధర ఆకాశాన్ని అంటుతోంది. రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ధర ఉంది. గత ఐదు నెలల నుంచి ధర రోజురోజుకు పెరుగుతూ పోతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని రైతులు సాగుచేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పంట చేతికి వస్తోంది.

వ్యాపారులు చెప్పినంత..: సన్నధాన్యానికి క్వింటాలుకు రూ.2,500 వరకు వస్తుందని రైతులు ఆశపడ్డారు. కానీ ప్రైవేటుగా రైస్‌మిల్లర్లు, వ్యాపారస్థులు క్వింటాలుకు రూ.2,350 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు రూ.2,203 ఇస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువగా వస్తున్నా ఆశించిన మేర లేక నష్టపోవాల్సి వస్తోందని రైతులు తెలిపారు. దొడ్డు ధాన్యం కంటే సన్నధాన్యం దిగుబడి తక్కువగా వస్తుంది. ఎకరాకు దొడ్డురకం ధాన్యం 32 క్వింటాళ్ల వరకు వస్తుంది. అదే సన్నరకం ధాన్యం 28-30 క్వింటాళ్ల మధ్యలో వస్తుంది. ఈసారి పంటకు చీడలు ఎక్కువగా వచ్చాయి. దానివల్ల పురుగుమందులకు ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. కనీసం బియ్యంగా మార్చి విక్రయించాలని అనుకున్నా నూకలు ఎక్కువగా అయి నష్టపోవాల్సి వస్తుంది. అలాగే యాసంగి బియ్యంను నేరుగా రైతుల నుంచి ఎవరూ కొనుగోలు చేయరు. అందువల్ల ధర తక్కువైనా ప్రైవేటుగా విక్రయించుకుంటున్నారు. వ్యాపారస్థులు ధర ఎంత చెబితే అంతకు అమ్ముకుంటున్నారు. అలాగే వ్యాపారస్థులు తాలు పేరుతో క్వింటాలుకు ఐదు కిలోల వరకు తరుగు తీస్తున్నారు. ఎంతో ఆశతో సన్నరకం సాగు చేసినా ఫలితంలేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. అదే వానాకాలంలో సాగు చేస్తే ఎంతో లాభం ఉండేదని అన్నదాతలు పేర్కొంటున్నారు. వీటిని నిల్వ ఉంచుకున్నా ఉపయోగంలో ఉండదు. అందువల్ల ధర తక్కువగా వచ్చినా విక్రయించుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని