logo

మహిళాభ్యున్నతికి బాటలు

మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే.

Published : 17 May 2024 02:38 IST

పొదుపు సంఘాలకు రుణ లక్ష్యాలు ఖరారు
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

హిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. బ్యాంకు రుణాలు తీసుకుంటూ మహిళలు పేదరికం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వయం ఉపాధి దిశగా పలువురు అడుగులు వేస్తూ కుటుంబ ఉన్నతిలో భాగస్వాములవుతున్నారు. బ్యాంకు రుణాల సద్వినియోగంపై అధికారులు చైతన్యం తీసుకురావడంతో నెలవారీ వాయిదాలు సక్రమంగా చెల్లిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మహిళా సంఘాలకు రుణ లక్ష్యాలు ఖరారు చేశారు.

1.90 లక్షల మంది సభ్యులు

జిల్లాలో 692 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలు 18,795. ఆయా సంఘాల్లో 1.90లక్షల మంది సభ్యులు ఉన్నారు. అర్హత గల వారందరినీ మహిళా సంఘాల్లో చేర్పించేందుకు కొత్త సంఘాలను ఏర్పాటు చేసే కార్యక్రమం సైతం కొనసాగుతోంది.

ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే..

ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏదైనా బ్యాంకు పరిధిలో లింకేజీ తక్కువగా ఉంటే సంబంధిత బ్యాంకు అధికారులతో మాట్లాడి రుణాల పంపిణీ వేగవంతమయ్యేలా చూసేందుకు ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయించాలని భావిస్తున్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతూ ఏ నెలకు సంబంధించిన లక్ష్యాలు అదే నెలలో అధిగమించేందుకు వీలుగా క్షేత్రస్థాయి సిబ్బందిని సమాయత్తం చేస్తున్నారు.


లక్ష్యం రూ.927.37 కోట్లు

ఈ ఆర్థిక సంవత్సరం మహిళా సంఘాలకు రుణాల పంపిణీ లక్ష్యాన్ని రూ.927.37 కోట్లుగా నిర్దేశించారు. 15,097 సంఘాలకు రుణాలు అందించనున్నారు. సమష్టిగా ముందుకు సాగితే లక్ష్యాలను చేరుకోవడం సులభమే. గత ఆర్థిక సంవత్సరం లక్ష్యానికి మించి రుణాలు పంపిణీ చేశారు. రుణ వాయిదాలు సక్రమంగా చెల్లిస్తుండటంతో మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సైతం పోటీపడుతున్నాయి. జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి 14,040 మహిళా సంఘాలకు రూ.769.60 కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉండగా లక్ష్యాన్ని అధిగమించారు. రూ.840.60 కోట్లు పంపిణీ చేయడం విశేషం.  


సమన్వయంతో ముందుకు..

మహిళా సంఘాలకు రుణాల పంపిణీ లక్ష్యాలను గత ఆర్థిక సంవత్సరం గడువుకు ముందే అధిగమించాం. ఈ ఆర్థిక సంవత్సరమూ అదే ఒరవడిని కొనసాగిస్తాం. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతాం.  రుణాల పంపిణీపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ లక్ష్యాల సాధనపై సిబ్బందిని అప్రమత్తం చేస్తాం. బ్యాంకు రుణాల పంపిణీతోపాటు సద్వినియోగంపై సంఘాల సభ్యులకు అవగాహన పెంపొందిస్తాం. -జంగారెడ్డి, జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని