logo

రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్‌

కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Published : 19 Apr 2024 06:22 IST

 సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి జానారెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి, తదితరులు
కోదాడ, న్యూస్‌టుడే: కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలతో ఉన్న అనుబంధం రాజకీయ సంబంధం కాదని, కుటుంబ సంబంధమన్నారు. ఎన్నికల తర్వాత భారాస పార్టీ కనుమరుగు అవుతుందని జోస్యం చెప్పారు. ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నల్గొండ జిల్లా ముందు ఉందన్నారు. దేశంలో మొదటిసారి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ అందించిందని, ఈ జిల్లాకు ఘనమైన రాజకీయ చరిత్ర ఉందన్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ అందించి మరోసారి ఈ జిల్లా పేరు దేశ రాజకీయాల్లో చర్చకు తీసుకురావాలన్నారు. ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తనను ఎలా గెలిపించారో, కుందూరు రఘువీర్‌రెడ్డిని అదే విధంగా గెలిపించాలన్నారు. ఎన్నిక జరిగే వరకు ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పని చేయాలని ఆమె కోరారు.

 విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

 కోదాడ పట్టణం: విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లా కార్యవర్గ సమావేశంలో భాగంగా గురువారం  విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డిని సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య కార్డులతో నూరు శాతం వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించే విధంగా కృషి చేస్తామన్నారు.  ఎన్నికల అనంతరం సీఎంతో, విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర నాయకత్వంతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య మాట్లాడుతూ.. రఘువీర్‌రెడ్డికి సంఘం తరఫున పూర్తి మద్దతునిస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే పద్మావతి, నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి, సాగర్‌ ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, విశ్రాంత ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు, కోదాడ యూనిట్‌ అధ్యక్షుడు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని