logo

యథేచ్ఛగా మట్టి దందా

నార్కట్‌పల్లి మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. గోపలాయపల్లి, యల్లారెడ్డిగూడెంలోని చెరువులు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్‌ కాల్వల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నారు.

Published : 20 Apr 2024 04:54 IST

యల్లారెడ్డిగూడెంలో సోమ సముద్రం చెరువు నుంచి జేసీబీ సహాయంతో మట్టిని తరలిస్తున్న చిత్రం

నార్కట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: నార్కట్‌పల్లి మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. గోపలాయపల్లి, యల్లారెడ్డిగూడెంలోని చెరువులు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్‌ కాల్వల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నారు. మట్టి తవ్వకాలతో ఏర్పడిన పెద్దగుంతలు ప్రమాదకరంగా మారాయి. దీనికితోడు గ్రామాల్లో బోర్లు, బావులు సైతం భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. కొందరు ఎలాంటి అనుమతి లేకుండా జేసీబీల సహాయంతో మట్టి తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కి రూ.750 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. అక్రమంగా తీసుకొచ్చిన మట్టిని కట్టంగూర్‌, నార్కట్‌పల్లి, నల్గొండ, చిట్యాలలోని ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నట్లు సమాచారం. మట్టిని తరలించాలంటే మైనింగ్‌, ఐబీ అధికారుల నుంచి అనుమతి పొందాలి. ఎలాంటి అనుమతులు లేకుండానే రాత్రింబవళ్లు మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. దుమ్ము, ధూళితో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు మట్టి తవ్వకాలతో ఏర్పడుతున్న గుంతలతో ప్రమాదం జరిగే అవకాశముంది. సంబంధిత అధికారులు మట్టి దందాను అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.


అనుమతి ఇవ్వలేదు

రమా, ఐబీ ఏఈ

ఆ గ్రామాల్లో చెరువులు, కాల్వ నుంచి మట్టి, మొరం తరలించేందుకు ఎవరికి అనుమతి ఇవ్వలేదు. అనుమతి లేకుండా మట్టి తీసుకెళ్లవద్దు. ఈ విషయం మా దృష్టికి రాలేదు. వెంటనే పరిశీలించి మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని