logo

అక్షరంతో సహవాసం.. వ్యక్తిత్వ వికాసం

వ్యక్తి వికాసానికి, సమాజ చైతన్యానికి పుస్తకాలే ఆధారం. గతించిన కాలాన్ని భవిష్యత్‌ తరాలకు తెలియజేసే సాధనం పుస్తకం. పుస్తకాలను స్నేహితులుగా భావిస్తారు.

Updated : 23 Apr 2024 06:01 IST

నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం

కోదాడ పట్టణం, న్యూస్‌టుడే: వ్యక్తి వికాసానికి, సమాజ చైతన్యానికి పుస్తకాలే ఆధారం. గతించిన కాలాన్ని భవిష్యత్‌ తరాలకు తెలియజేసే సాధనం పుస్తకం. పుస్తకాలను స్నేహితులుగా భావిస్తారు. సరస్వతీదేవిగా పూజిస్తారు. చరిత్రాత్మక ఉద్యమాలకు నాడు పుస్తకాలు ఆయుధాలుగా నిలిచాయి. పుస్తక పఠనమే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి పునాది అయినా పాశ్చాత్య సంస్కృతి, సాంకేతిక పరిజ్ఞానంతో జనం చరవాణులకు బానిసలవుతూ పుస్తక పఠనంపై ఆసక్తి కోల్పోతున్నారు.


మనిషిని చదివినట్లే:

హనుమంతరావు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు

కొత్త పుస్తకం చదివితే కొత్త మనిషిని చదివినట్లే. పుస్తకాన్ని రాసిన వ్యక్తి జీవితానుభవసారం మొత్తం మనకు ఆ పుస్తకాన్ని చదివితే తెలుస్తుంది. అది జ్ఞానంగా మారుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పుస్తకాలు లేనిదే మానవ అభివృద్ధి లేదు.


విచక్షణతో ఎంపిక చేసుకోవాలి:

పుప్పాల కృష్ణమూర్తి, కథా రచయిత

మంచి పుస్తకాలు చదివి మహాత్ములైనవారు ఉన్నారు. నేటి డిజిటల్‌ యుగంలో పుస్తక పఠనం తగ్గిపోయింది. అయినా పుస్తకాలను మంచి స్నేహితులుగా భావించి పుస్తక పఠనాన్ని పెంచుకోవాలి. మనిషికి క్రాంతిని, శాంతిని ఇవ్వగలిగేది పుస్తకమే.


ఏకాగ్రత పెరుగుతుంది:

మంత్రిప్రగడ భరతారావు, సాహితీవేత్త

పుస్తక పఠనంతోనే ఏకాగ్రత పెరుగుతుంది. ప్రజ్ఞావంతుడైన వ్యక్తులు తన తదనంతరం కూడా ఆలోచనలు సజీవంగా ఉండాలని పుస్తకాలు రాస్తారు. ఆ పుస్తకాలు చదువుతున్నంత కాలం అతడు భౌతికంగా లేకపోయినా అతని పేరు సజీవంగా ఉంటుంది.


పుస్తకం హస్తభూషణం:

బచ్చలకూరి జార్జి, పుస్తక రచయిత

పుస్తకం ఒక వ్యక్తి జీవితాన్ని మారిస్తే.. గ్రంథాలయం ఒక తరాన్ని ప్రభావితం చేస్తుంది. పుస్తకాలు విజ్ఞానం, వినోదం, మనోవికాసాన్ని కలిగిస్తాయి. అంబేడ్కర్‌ పీహెచ్‌డీలో సమర్పించిన పరిశోధన పత్రం ప్రపంచ మేధావులను ఆకర్షించింది. ఒక పుస్తకం హస్తభూషణమై గృహాలంకారంగా ఉంటుంది. పుస్తకాలతోనే విజ్ఞానాన్ని పొందవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని