logo

కావలి సమీపంలో ఘోర ప్రమాదం

వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్‌ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు.

Published : 25 Apr 2024 03:05 IST

ముగ్గురి మృతి.. ఇద్దరికి గాయాలు

మృతులు సిరి, కల్యాణి.. ప్రమాదంలో దెబ్బతిన్న కారు

కావలి, కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్‌ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి శివారులోని టోల్‌ప్లాజా వద్ద బుధవారం వేకువజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఏలూరు జిల్లా కొయ్యలగూడేనికి చెందిన తిరణాతి కల్యాణి గ్రామంలో ఫ్యాన్సీ దుకాణం నిర్వహిస్తున్నారు. ఈమె భర్తతో విడిపోయి ఏలూరుకు చెందిన ఎర్రాబత్తిన సిరి అనే హిజ్రాతో సహజీవనం చేస్తోంది. వీరిద్దరితో పాటు వంగల కుమారి, కుమార్‌లు వన్‌గ్రామ్‌ ఆభరణాలను టోకున కొనుగోలు చేసేందుకు ఈ నెల 22న చెన్నైకి కారులో వెళ్లారు. మంగళవారం రాత్రి పొద్దుపోయాక తిరుగు ప్రయాణమయ్యారు. కావలికి వచ్చే సరికి వేకువజాము అయ్యింది. టోల్‌ప్లాజా సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. దీంతో కారులో ఉన్న ఎర్రాబత్తిన సిరి(34), తిరణాతి కల్యాణి (21), వంగల కుమార్‌ (53) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు నడుపుతున్న డ్రైవర్‌ షేక్‌ జిలానీతో పాటు కుమారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు కావలి ప్రాంతీయాసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి, నెల్లూరుకు తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. మృతదేహాలు, క్షతగాత్రులను బయటకు తీసేందుకు అంబులెన్స్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. పరీక్షల అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. సంఘటనా స్థలాన్ని కావలి డీఎస్పీ ఎం.వెంకటరమణ సందర్శించారు. కావలి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బోరున విలపించిన కుటుంబ సభ్యులు..  కొయ్యలగూడెం నుంచి ప్రమాదస్థలానికి చేరుకున్న కల్యాణి కుటుంబసభ్యులు బోరున విలపించారు. సుమారు పది నెలల కిందట స్థానికంగా ఫ్యాన్సీ దుకాణం ప్రారంభించిన ఆమె.. వ్యాపార వృద్ధి కోసం నాలుగు రోజుల కిందట ప్రధాన రహదారికి సమీపంలోకి మకాం మార్చారు. వస్తువుల కొనుగోలు కోసం స్నేహితుడైన సిరి, మరో ఇద్దరితో కలిసి కారులో చెన్నై వెళ్లి వస్తూ ప్రమాదానికి గురై చనిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని