logo

ఇంటర్‌లో అమ్మాయిలదే పైచేయి

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్‌ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది.

Updated : 25 Apr 2024 06:22 IST

ప్రథమంలో 27.. ద్వితీయంలో 29వ స్థానం
ఏటేటా ఫలితాల్లో వెనుకబడుతున్న జిల్లా
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ విద్యావిభాగం

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్‌ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. ఫలితాల్లో ఈ సారి కూడా బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 28న ప్రారంభం కాగా మార్చి 14న ప్రధాన, మార్చి 19న వృత్తివిద్య పరీక్షలు ముగిశాయి. ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో 14,974 మంది, వృత్తివిద్యలో 2399 మంది పరీక్షలు రాయగా, ద్వితీయ జనరల్‌ విభాగంలో 13,988, ప్రైవేటులో 1,804, వృత్తివిద్య విభాగంలో 2,192 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మూల్యాంకన ప్రక్రియ మార్చి 2న ప్రారంభించిన అధికారులు 20 రోజుల క్రితమే పూర్తి చేశారు. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం తగ్గడం, రాష్ట్రస్థాయిలో ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఇందూరు ఏటా వెనుకబడుతుండటం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతోంది. బోధనలో నాణ్యత పెంచాల్సిన అవసరముందని విద్యానిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మే 24 నుంచి అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ

బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో అనుత్తీర్ణులైన వారితో పాటు మార్కులు పెంచుకోవాలనుకునే వారి కోసం విద్యాశాఖ రీకౌంటింగ్‌, రీ వాల్యుయేషన్‌కి ఈ నెల 25 నుంచి మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రతి పేపర్‌కు రీ వెరిఫికేషన్‌ చేయించుకోవాలనే విద్యార్థులు రూ.100 చొప్పున, రీకౌంటింగ్‌తో పాటు పరీక్ష జవాబు పత్రాల జిరాక్స్‌ పత్రాలు పొందడానికి రూ.600 చొప్పున ఆన్‌లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఆందోళన వద్దు.. ఆలోచనతో ముందుకు..

రవికుమార్‌, డీఐఈవో

అనుత్తీర్ణులైన వారు ఆందోళన చెందొద్దు. వెంటనే నిర్వహించనున్న అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు ఆలోచనతో ముందడుగు వేయాలి. విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నట్లు గమనిస్తే తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలి. ఇంకా ఏమైనా అనుమనాలుంటే టెలిమానస్‌, 14416 టోల్‌ఫ్రీ నెంబర్లను సంప్రదించాలి. ఫలితాల్లో తప్పులు గుర్తిస్తే helpdeskie@telangana.gov.in ను సంప్రదించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని