logo

Assistant collector: అనుమానాస్పద స్థితిలో సహాయ కలెక్టర్‌ మృతి

రవుర్కెలా అదనపు కలెక్టర్‌ కార్యాలయంలో సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సస్మిత మింజ్‌ (35) మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 22 Sep 2023 10:11 IST

సస్మిత మింజ్‌ (పాతచిత్రం)

కటక్‌, న్యూస్‌టుడే: రవుర్కెలా అదనపు కలెక్టర్‌ కార్యాలయంలో సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సస్మిత మింజ్‌ (35) మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదనపు కలెక్టర్‌ కార్యాలయంలో కొంతమంది అధికారులు ఆమెను మానసికంగా వేధించడం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటుందని లేదా హతమార్చి జలాశయంలో విసిరేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నెల 15న సస్మిత విధులకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. 17వ తేదీన ఆమె నగరంలో ఒక హోటల్లో ఉన్నట్లు తెలిసింది. తల్లి, సోదరుడు హోటల్‌కి వెళ్లి ఆమెను కలవాలని ప్రయత్నించినా నిరాకరించారు. కార్యాలయంలో ఒత్తిడి ఎక్కువగా ఉందని, తనకు విశ్రాంతి కావాలని, తాను ఎవరినీ కలుసుకోనని తెలిపారు.

అనంతరం మంగళవారం పట్టణంలో ఉన్న సెంచరీ పార్కు ప్రాంగణంలోని జలాశయంలో ఆమె మృతదేహం కనిపించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... మంగళవారం సాయంత్రం పార్కులో ఉన్న జలాశయంలో మహిళ మృతదేహం తేలుతూ కనిపించడంతో సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అగ్నిమాపక సిబ్బందిని తీసుకుని వచ్చి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మృతదేహం సహాయ కలెక్టర్‌ది అని గుర్తించారు. జలాశయం తీరంలో ఆమె హ్యాండ్‌బ్యాగ్‌, జోళ్ళు లభించాయి. మృతదేహాన్ని పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. సస్మిత మింజ్‌ రాజగంగపూర్‌ ప్రాంతానికి చెందిన మహిళ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని