అక్కడ గడ్డకట్టుకుపోయా!

కనుచూపుమేర ఎటుచూసినా నీలి సముద్రం. ఎప్పుడెలా మారుతుందో తెలియని వాతావరణం ... బలమైన ఈదురు గాలులు... ఎగసిపడే కెరటాలు... అందుకే సెయిలింగ్‌ అంటే మగవాళ్లే వెనకడుగు వేస్తారు. కానీ ఆ క్రీడతోనే ఆమె ప్రేమలో పడింది.

Updated : 02 May 2024 10:05 IST

కనుచూపుమేర ఎటుచూసినా నీలి సముద్రం. ఎప్పుడెలా మారుతుందో తెలియని వాతావరణం ... బలమైన ఈదురు గాలులు... ఎగసిపడే కెరటాలు... అందుకే సెయిలింగ్‌ అంటే మగవాళ్లే వెనకడుగు వేస్తారు. కానీ ఆ క్రీడతోనే ఆమె ప్రేమలో పడింది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో పతకాలు సాధించింది. 2020 ఒలింపిక్స్‌కు ఎంపికైన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తాజాగా 2024 పారిస్‌ సమ్మర్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన 26 ఏళ్ల నేత్ర కుమనన్‌ను ‘వసుంధర’ పలకరించింది.

మాది చెన్నై. నాన్న వీసీ కుమనన్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ నిర్వహిస్తారు. అమ్మ శ్రీజ. చదువుతోపాటు ప్రతి దాంట్లోనూ ప్రవేశం ఉండాలని వేసవి సెలవుల్లో నన్ను, తమ్ముడు నవీన్‌ను క్యాంప్స్‌లో చేర్చేవారు. అలా ఆర్ట్స్‌, క్రీడలు, యుద్ధకళ కళరిపయట్టు వంటివన్నీ నేర్చుకున్నా. 2011లో తమిళనాడు సెయిలింగ్‌ అసోసియేషన్‌ వాళ్ల సమ్మర్‌ క్యాంప్‌లో చేరా. అదే నా జీవితంలో కీలక మలుపు.

నెదర్లాండ్స్‌లో...

సెయిలింగ్‌ శిక్షణలో మరచిపోలేని అనుభవాలెన్నో. మొదటిసారి నెదర్లాండ్స్‌లో సముద్రంలోకి దిగిన వెంటనే చలికి బిగుసుకుపోయా. ఒకరకంగా గడ్డకట్టుకుపోయాననే అనుకున్నా. తిరిగి సాధారణస్థితికి రావడానికి గంటకు పైగా పట్టింది. శిక్షణప్పుడూ, తరవాత పోటీల్లోనూ పొరబాట్లు చేసేదాన్ని. క్రమంగా వాటి నుంచి కొత్తపాఠాలు నేర్చుకొన్నా. తొలినాళ్లలో సెయిలింగ్‌లాంటి సాహసోపేతమైన క్రీడ మరొకటి ఉండదు అనిపించేది. ఎందుకంటే గంటలసేపు ఉప్పు నీళ్లలోనే మునిగితేలాలి. దీంతో ఒళ్లంతా జిగురుగా అయిపోతుంటుంది. కానీ సముద్రంతో అలా సయ్యాటలాడటం చెప్పలేనంత థ్రిల్లింగ్‌గానూ ఉండేది. దీనికితోడు అమ్మానాన్నల ప్రోత్సాహం, తమిళనాడు ప్రభుత్వం ఆర్థిక చేయూత నన్ను ముందుకు
నడిపించాయి.

గాలినీ నీటినీ జయిస్తేనే..!

పోటీ తరవాత వచ్చే ప్రశంసలతో కష్టాన్ని మర్చిపోతాం. కానీ సెయిలింగ్‌లో శిక్షణ చాలా క్లిష్టతరం. రోజుకి మూడు గంటలు సెయిలింగ్‌, మరో మూడు గంటలు వ్యాయామాలు, మరోగంట తరగతిలో పాఠాలుంటాయి. నీటిలోకి వెళ్లిన వెంటనే ప్రశాంతంగా అనిపిస్తుంది. దాన్ని ఆస్వాదిస్తూ కాస్త ముందుకెళ్లామో లేదో... పోటెత్తే అలలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఇక, నడి సముద్రంలోకి వెళ్లేసరికి ఉన్నట్టుండి కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతుంటాయి. ఉప్పుగాలి వేగంగా వీస్తూ ఈడ్చి కొడుతుంటుంది. ఒళ్లంతా సూదులతో గుచ్చినట్లే ఉంటుంది. వాతావరణం ఎప్పుడెలా మారుతుందో చెప్పలేం. నిర్దేశించిన మార్గంలో వేగాన్ని ఓ పట్టాన అందుకోలేం. మొత్తం మీద ఈ క్రీడలో సముద్రం, గాలి, ఉష్ణోగ్రత, ఆటుపోట్లు ప్రతీదీ మన ఓపికని పరీక్షిస్తుంటాయి. వీటిని ఎదుర్కొనేందుకు శారీరక, మానసిక సామర్థ్యం ఉండాలి. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. వీచే గాలినీ ఎగ(సిపడే అలల్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలం. సెయిలింగ్‌ చేయడమంటే కెరటాలపై స్వారీ చేయడమే. అయితేనేం... ఆ నీలిసంద్రంలో ఒక్కరమే ఉన్నప్పుడు సువిశాల ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం కలిగేది. ఎంతో స్వేచ్ఛగా అనిపించేది. దాంతో ఎంత కష్టమైనా ఇదే జీవితం అనుకున్నా. పట్టుదలతో సాధన చేశా. ప్రతిగా శిక్షణ తీసుకున్న మూడేళ్లకే చెన్నైలో జరిగిన ఆల్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ రెగట్టా ఈవెంట్‌లో అవకాశం వచ్చింది. తరవాత దేశం తరఫున రెండుసార్లు ఆసియా క్రీడల్లో పాల్గొన్నా. అమెరికాలోని మియామిలో జరిగిన ‘హెంపెల్‌ సెయిలింగ్‌ ప్రపంచకప్‌ సిరీస్‌’లో కాంస్య పతకాన్ని గెలిచిన తొలి భారతీయ మహిళగా నిలవడం నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఒమన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొని ఇండియా తరఫున టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి ఇండియన్‌గానే కాదు, ఆసియన్‌గానూ నిలవడంతో నామీద నాకు మరింత నమ్మకం పెరిగింది. జాతీయ, అంతర్జాతీయ సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌లలో 20కి పైగా పతకాలు గెలుచుకున్నా. ఇప్పుడు రెండోసారి 2024లో సమ్మర్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం గర్వంగా ఉంది. ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న పోటీలో విజేతగా నిలవడం నా లక్ష్యం. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివా. ఎంబీఏ చేస్తున్నా. అమ్మాయిలూ ఈ రంగంలోకి రావాలి. పట్టుదల, సహనం ఉంటే ఎంతటి సాహస క్రీడలోనైనా పాల్గొని విజయాన్ని అందుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్