logo

ఎవరి ప్రయోజనాల కోసం రెండుచోట్ల పోటీ?

ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మళ్లీ రెండుచోట్ల పోటీకి సిద్ధమయ్యారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమిటని? ఈ పోటీ ఎవరి ప్రయోజనాల కోసమని? సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక, వ్యయప్రయాసలు మినహా సాధించేదేమిటని విమర్శలు వినిపిస్తున్నాయి.

Published : 19 Apr 2024 01:18 IST

 ప్రజలకు ఒరిగేదేమిటి?

దుయ్యబట్టిన విపక్ష నేతలు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మళ్లీ రెండుచోట్ల పోటీకి సిద్ధమయ్యారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమిటని? ఈ పోటీ ఎవరి ప్రయోజనాల కోసమని? సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక, వ్యయప్రయాసలు మినహా సాధించేదేమిటని విమర్శలు వినిపిస్తున్నాయి.

గతసారీ హామీలిచ్చారు

నవీన్‌కు కలిసొచ్చిన స్థానం హింజిలిజ గంజాం జిల్లాలోని ఈ స్థానం నుంచి ఆయన వరుసగా అయిదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆరోసారి (ఈసారి) మళ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. సీఎం తరచూ రాకపోయినా ఓటర్లు ఆయనకు పట్టం కడుతున్నారు. గతసారి రాజకీయ ఎత్తుగడలో భాగంగా పశ్చిమ ఒడిశాలోని బరగఢ్‌ జిల్లా బిజెపూర్‌ నుంచి కూడా పోటీ చేశారు. భాజపా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికే ఈ పోటీ అని అప్పట్లో బిజద వర్గాలు చెప్పుకున్నాయి. ఆ సమయంలో సీఎం ఎన్నో హామీలిచ్చారు. దీంతో బిజెపూర్‌ వాసులు నవీన్‌ను గెలిపించారు. పోటీ చేసిన రెండు సీట్లు నిలబెట్టుకున్న సీఎం బిజెపూర్‌ను వదులుకున్నారు. అక్కడి ప్రజలకు తానిచ్చిన హామీలు మాత్రం విస్మరించబోనని చెప్పుకున్నారు. ఇందులో కీలకమైనది పదంపూర్‌ సబ్‌ డివిజన్‌కు జిల్లా హోదా. అయిదేళ్లయినా ఈ హామీ నెరవేరలేదు. తర్వాత ముఖం చాటేశారన్న అసంతృప్తి ప్రబలింది.

ఈసారి కంటాబంజి

ఈసారి నవీన్‌ హింజిలితోపాటు పశ్చిమ ఒడిశాలోని కంటాబంజి నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ స్థానానికి పార్టీ నుంచి ఆశావహులు ఎక్కువగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రధాని మోదీకి అనుకూల పవనాలు వీస్తున్నాయన్న వార్తలు షికార్లు చేస్తున్న నేపథ్యంలో భాజపా దూకుడుకు పశ్చిమ ఒడిశాలో కళ్లెం వేయాలంటే తాను స్వయంగా రంగంలోకి దిగాలని ఆయన భావించారు.

నవీన్‌కు ఓటమి ఖాయం

కంటాబంజి సిటింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంతోష్‌ సింగ్‌ సలూజా గురువారం కంటాబంజిలో విలేకరులతో మాట్లాడుతూ... నవీన్‌కు ఇక్కడ ఓటమి ఖాయన్నారు. ఒకసారి వంచనకు గురైన పశ్చిమ వాసులు మరో పొరపాటు చేయరని, విజ్ఞత కల ఓటర్లు బూటకం హామీలు విశ్వసించబోరని, కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపిస్తారన్నారు.

సీఎం అబద్ధాల కోరు

దీనిపై మాజీ మంత్రి, భాజపా అగ్రనేత కనకవర్ధన్‌ సింగ్‌దేవ్‌ బుధవారం రాత్రి పాట్నాగఢ్‌లో విలేకరులతో మాట్లాడుతూ... సీఎంను అబద్ధాల కోరుగా అభివర్ణించారు. గతసారి బిజెపూర్‌ వాసులకు ఎన్నో హామీలిచ్చి విస్మరించిన నవీన్‌, ఈసారి కంటాబంజి (బొలంగీర్‌ జిల్లా) వాసులను మభ్యపెట్టడానికి సన్నద్ధమయ్యారన్నారు. పశ్చిమంలో భాజపా బలం ముందు బిజద నిలవదని గ్రహించి స్వయంగా పోటీకి సన్నద్ధమయ్యారన్నారు. ఈ ఎత్తుగడ ఫలితమివ్వదన్నారు.

మరో ఉపఎన్నిక అనివార్యం

సీఎల్పీ నేత నర్సింగ మిశ్ర గురువారం బొలంగీర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... పశ్చిమ ఒడిశా ప్రాంతాల పట్ల విపక్ష చూపుతున్న నవీన్‌ మరోసారి ఓటర్లను మభ్యపెట్టడానికి కంటాబంజిని ఎంచుకున్నారన్నారు. ఒకవేళ ఇక్కడ ఆయన గెలిస్తే ఈ సీటు వదులుకోవడం ఖాయమని, తమ అంచనా ప్రకారం సార్వత్రిక ఎన్నికల తర్వాత కంటాబంజి స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమవుతుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని