logo

ఓటరుతో మాట...నేతల కొత్త బాట

ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకం.  ఒకవైపు మోదీ కోసం భాజపా ఉద్యమిస్తుంటే...   ఆరోసారి ముఖ్యమంత్రిగా నవీన్‌ను చూడాలని బిజద ప్రయత్నిస్తోంది.

Published : 23 Apr 2024 02:57 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే : ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకం.  ఒకవైపు మోదీ కోసం భాజపా ఉద్యమిస్తుంటే...   ఆరోసారి ముఖ్యమంత్రిగా నవీన్‌ను చూడాలని బిజద ప్రయత్నిస్తోంది. ఈ రెండింటినీ కాదని తమకు ఓటు వేయాలని కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు తమకు తెలిసిన గిమ్మిక్కులన్నీ ప్రదర్శిస్తున్నారు. ఎండ మండిస్తున్నా, అలసట ఆవహించినా పాదయాత్రలు, రోడ్‌షోలు చేస్తున్నారు. టీ దుకాణాల వద్ద, పానీపూరీ తోపుడు బళ్ల వద్ద స్థానికులతో కలిసిపోయి తమకే ఎందుకు ఓటేయాలో చెబుతూ దూసుకుపోతున్నారు.

వారిని చూసి వీరు...

బాలేశ్వర్‌లో పానీ పూరీలు తింటున్న లేఖశ్రీ

బిజద నేతలు భాజపా విధానాన్ని అనుసరిస్తున్నారు. పార్కులు, క్లబ్బులు, జాతర్లకు వెళుతూ అక్కడివారి యోగక్షేమాలు తెలుసుకొని ఓట్లు అడుగుతున్నారు. పిలవని పేరంటంగా వివాహాలు, గృహ ప్రవేశాలు, శ్రాద్ధకర్మల్లో పాల్గొంటున్నారు. మహిళా అభ్యర్థులు సాయంత్రం వేళ్లలో పానీపూరీ తోపుడు బళ్ల వద్ద సందడి చేస్తున్నారు. అమ్మాయిలతో కలసి తినుబండారాలు తింటూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

పేదల ఇళ్లల్లో గంజికూడు

కాషాయం పెద్దలు దళితులు, పేదల ఇళ్లల్లో గంజికూడు తింటున్నారు. పూరీ లోక్‌సభ స్థానంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆ పార్టీ అగ్రనేత సంబిత్‌ పాత్ర్‌ పాదయాత్రలకు ప్రాధాన్యమిచ్చారు. గ్రామాల్లో పర్యటిస్తూ పూరిళ్లకు వెళుతూ వారి ఇబ్బందులు అడిగి తెలుసుకుంటున్నారు. మీ ఇంట్లో ఉన్నది పెట్టండమ్మా అని అడిగి మరీ ఆరగిస్తున్నారు.

పది గ్యారంటీలు తథ్యం

నువాపడలో శరత్‌ పట్నాయక్‌ పాదయాత్ర

కాంగ్రెస్‌ అగ్రనేతలు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సి ఉంది. ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. సీనియర్లు రంగంలో ఉన్నారు. వారు పోటీ చేస్తున్న చోట్ల బిజద, భాజపా నాయకత్వాలు ప్రముఖులను నిలబెట్టాయి. దీంతో తమ స్థానాలు నిలబెట్టుకోవడానికి అగ్రనేతలు తమ నియోజకవర్గాల్లో చెమటోడుస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌ నువాపడలో, కేంద్రమాజీ మంత్రి భక్త చరణదాస్‌ నర్లాలో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఆయన రూటేవేరు

భాజపాలో సర్వసంగ పరిత్యాగి అయిన బాలేశ్వర్‌ సిటింగ్‌ ఎంపీ ప్రతాప్‌చంద్ర షడంగి మళ్లీ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇతర నేతల మాదిరి ఆయనకు డాబు, దర్పం లేదు. కొందరు ఆయనను ‘భయినా’ (అన్నయ్య) అంటారు. మరి కొందరు ‘గురు’ అంటూ సంబోధిస్తారు. ఆయన ప్రచారం సాదాసీదాగా ఉంటోంది. పాత కాలం నాటి సైకిల్‌పై గ్రామాల్లో తిరుగుతున్నారు. ఇంటింటికి వెళ్లి వినయంగా వారితో మాట్లాడి తనకు మరోసారి దిల్లీకి పంపించాలని, మీకు అండగా ఉంటానని చెబుతున్నారు.

‘చాయ్‌’ తాగుదాం రండి

భాజపా నేతలు ఇదివరకు చేపట్టిన ‘చాయ్‌ పే చర్చా’ కార్యక్రమం పునఃప్రారంభించారు. తెల్లారిన వెంటనే నేతలు వివిధ ప్రాంతాల్లో ఉన్న చాయ్‌ దుకాణాల వద్దకొస్తున్నారు. వెంట కార్యకర్తలుంటున్నారు. నేతలను చూస్తున్న జనం అక్కడికొచ్చాక చర్చ మొదలవుతోంది. ప్రధాని నరేంద్రమోదీ హయాంలో జరిగిన ప్రగతి, ఆయన సంకల్పం గురించి వివరిస్తున్నారు. సంబల్‌పూర్‌లో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌, భువనేశ్వర్‌లో సిటింగ్‌ ఎంపీ అపరాజిత షడంగిలు ఈ తరహా ప్రచారం ముమ్మరం చేశారు. ఆయాచోట్ల విభిన్న సంఘాల ప్రతినిధులతో సమావేశాలు, గోప్య మంతనాలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని