logo

ఎస్‌.కోటను అభివృద్ధి చేస్తా

ప్రశాంతమైన విశాఖ నగరానికి తాము ఐటీ కంపెనీలు తీసుకొస్తే జగన్‌ భూ బకాసురులను దించి కబ్జాలతో కబళించాడని, రాక్షస మూకలను దించి అశాంతి నగరంగా మార్చేశాడని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు.

Published : 23 Apr 2024 03:50 IST

నియోజకవర్గాన్ని విశాఖలో కలుపుతాం
ప్రజాగళం సభలో చంద్రబాబు

మాట్లాడుతున్న తెదేపా అధినేత చంద్రబాబు, చిత్రంలో శ్రీభరత్‌, కోళ్ల లలితకుమారి

శృంగవరపుకోట, గరివిడి, గజపతినగరం, కొత్తవలస, వేపాడ, ఎల్‌.కోట, న్యూస్‌టుడే: ప్రశాంతమైన విశాఖ నగరానికి తాము ఐటీ కంపెనీలు తీసుకొస్తే జగన్‌ భూ బకాసురులను దించి కబ్జాలతో కబళించాడని, రాక్షస మూకలను దించి అశాంతి నగరంగా మార్చేశాడని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. ఎస్‌.కోటలోని ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ‘ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎన్నో కలలుగన్నాం. అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించాం. సుజల స్రవంతిని తీసుకువచ్చి ఎస్‌.కోట నియోజకవర్గంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలనుకున్నాం. గిరిజనుల ఉజ్వల భవిష్యత్తు కోసం గిరిజన విశ్వవిద్యాలయానికి భూమిపూజ చేశాం. కానీ జగన్‌ ప్రభుత్వం అభివృద్ధిని నీరుగార్చింది. విశాఖలో అదానీ డేటా సెంటరు, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ తదితర సంస్థలను తరిమేసింది. దేశంలో ఏ మూలన గంజాయి దొరికినా దాని మూలాలు విశాఖ జిల్లాలో ఉంటున్నాయి. ఉత్తరాంధ్రలో రూ.40 వేల కోట్ల విలువైన ఆస్తులు కొల్లగొట్టారు’ అని నిప్పులు చెరిగారు.

  ప్రజాగళం సభకు తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు

యుద్ధానికి సిద్ధంగా..

‘శృంగవరపుకోట ప్రజలు యుద్ధానికి సిద్ధమని కాలు దువ్వుతున్నారు. ఇక్కడ జనాలను చూస్తుంటే సముద్రాన్ని తలపిస్తోంది. ఊళ్లకు ఊళ్లు కదిలి వచ్చాయి. మే 13న రాజకీయ పెనుతుపాను రాబోతోంది. ఆ తుపానులో వైకాపా బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం’ అని చంద్రబాబు అన్నారు.

అవినీతి కోటగా మార్చేశారు..

‘జిల్లాను నిలువునా దోచేసిన మంత్రి బొత్స సత్యనారాయణ పక్కనున్న విశాఖ జిల్లాపై పడ్డారు. తన భార్యను విశాఖ ఎంపీగా పోటీలో పెట్టారు. అవినీతిపరులకు విశాఖ జిల్లా ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి. ఇక్కడి ఎమ్మెల్యే శృంగవరపుకోటను అవినీతి కోటగా మార్చారు. ముఖ్యమంత్రి జగన్‌ రుషికొండకు బోడిగుండు కొట్టేసి రూ.500 కోట్లతో ప్యాలెస్‌ కడితే.. ఇక్కడ ఎమ్మెల్యే నేనేం తక్కువ కాదని కొండను తొలిచేసి రూ.50 కోట్లతో ప్యాలెస్‌ కట్టారు. అర్ధానపాలెం గ్రామంలో 100 ఎకరాల గిరిజనుల భూములను కొట్టేయడానికి చూస్తున్నారు’ అని ఆరోపించారు.

వరాల జల్లు

బీ శృంగవరపుకోటలో ఐటీ టవర్‌ ఏర్పాటు చేస్తాం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. బీ విశాఖ- అరకు రోడ్డును జాతీయ రహదారిగా మార్చాం. అరకును టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం. విశాఖ- అరకు రోడ్డుకు ఇరువైపులా భూమి, నీరు ఉంది. పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తాం.  బీ భీమసింగి చక్కెర కర్మాగారం పునరుద్ధరణకు ఏం చేయాలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. బీ జామిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కొత్తవలసలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం.

విశాఖను తలదన్నేలా ప్రగతి..

‘శృంగవరపుకోట నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన విశాఖ జిల్లాలో కలుపుతాం. ఇక్కడి ప్రజలు విశాఖపైనే ఆధారపడతారు. విశాఖ పార్లమెంటు పరిధిలోనే ఈ నియోజకవర్గం ఉంది. కానీ ఆ జిల్లాలో కలపకుండా విజయనగరంలో ఉంచారు. మంత్రి బొత్స డ్రామాలాడి ఇదంతా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్‌.కోటను విశాఖ జిల్లాలో కలుపుతాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని