logo

జీర్ణావస్థలో జీసీసీ

గిరిజనులకు అండగా నిలిచి.. వారు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన జీసీసీ (గిరిజన సహకార సంస్థ)ని  ప్రభుత్వం ఖూనీ చేసింది.

Published : 19 May 2024 04:23 IST

అయిదేళ్లలో నిర్వీర్యం చేసిన వైకాపా ప్రభుత్వం 

మరమ్మతులకు నోచుకోని లేవిడి జీసీసీ డిపో భవనం

గిరిజనులకు అండగా నిలిచి.. వారు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన జీసీసీ (గిరిజన సహకార సంస్థ)ని  ప్రభుత్వం ఖూనీ చేసింది. 1960లో మార్కెటింగ్‌ సొసైటీగా ఏర్పడి గిరిజన సహకార సంస్థగా మారి దశాబ్దాల పాటు సేవలందించిన జీసీసీ కేవలం అయిదేళ్లలో నామరూపాల్లేకుండా పోయింది. దీంతో అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడంలేదు.

న్యూస్‌టుడే, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పాచిపెంట, మక్కువ 

ఇదీ చేయాల్సింది.. 

విశాఖ కేంద్రంగా జీసీసీ పని చేస్తోంది. పార్వతీపురం మన్యంలో పార్వతీపురం, సీతంపేట డివిజన్లుగా సేవా, వ్యాపార లావాదేవీలు నడుపుతోంది. పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు శాఖల పరిధిలో 102 డిపోలు, సీతంపేట పరిధిలో సీతంపేట, భామిని మండలాల్లో పలు డిపోలు ఉన్నాయి.

  • గిరిజనులు అడవి నుంచి సేకరించిన చిన్న తరహా అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలి.
  • వ్యవసాయ కాలంలో పంట రుణాల కోసం వడ్డీ వ్యాపారులు, దళారుల బారిన పడకుండా గిరిజనులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించాలి.
  • గిరిజనులకు అవసరమైన రోజువారీ సరకులు డీఆర్‌ డిపోల ద్వారా తక్కువ ధరకే చేరువ చేయాలి.

సంతలకు సరకులు తీసుకొస్తున్న గిరిజనులు 

కానరాని కొనుగోళ్లు.. 

గిరిజనుల ప్రధాన పంట ఉత్పత్తి చింతపండును గతంలో వేల టన్నుల్లో కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం వందల్లోనూ కొనడం లేదు. కొండచీపుర్లు, నరమామిడిచెక్క, ఇండుగ పిక్కలు, విప్పపప్పు, విప్పపువ్వు, కరక్కాయలు, కొండతామర జిగురు, ఉసిరిక పప్పు, తానికాయ, నల్ల జీడిపిక్కలు, తేనె మొదలైనవి కొనేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేక గిరిజనులు వారపు సంతలకు తీసుకువచ్చి అమ్ముతున్నారు. 

రుణాలు కల్పించలేని పరిస్థితి.. 

గిరిజనులను వడ్డీ వ్యాపారుల నుంచి రక్షించేందుకు వ్యవసాయ రుణాలను జీసీసీ ఇవ్వాల్సి ఉన్నా లక్ష్యాలను చేరలేకపోతోంది. ఇప్పటికే ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు చేసే యంత్రాంగం లేకపోవడంతో చతికిలపడింది. దీంతో రుణాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది.  జీసీసీలో ఉద్యోగుల విరమణ తప్ప కొత్త నియామకాలు లేవు. ఒకప్పుడు వేలల్లో ఉండే ఉద్యోగుల సంఖ్య నేడు వందల్లోకి చేరింది. మరో ఆరు నెలల్లో వీరి సంఖ్య మరింత తగ్గనుంది. అప్పుడు జీసీసీని నడిపించే వారే కానరారు. 

శిథిల భవనాల్లో విధులు 

పార్వతీపురం డివిజన్‌ పరిధిలో 102 డీఆర్‌ డిపోలున్నాయి. సుమారు 60 శాతం సొంతవి. 30 శాతం వరకు శిథిలావస్థకు చేరాయి. మరమ్మతులకు 2022లో రూ.1.90 కోట్లతో, తర్వాత రూ.2.25 కోట్లతో ప్రతిపాదనలు పంపించినా ఎలాంటి నిధులు విడుదల కాలేదు. గొరడ, దేరువాడ, దుడ్డుఖల్లు, కూనేరు, సారిక ప్రాంతాల్లో కొత్త డిపోల నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. దీంతో శిథిల భవనాల్లోనే ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో నిత్యావసర సరకులు తడుస్తున్నా రక్షణ లేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని