logo
Updated : 29/11/2021 06:00 IST

ప్ఛ్‌.డబ్బులు రాలడం లేదు...

కత్తి మీద సాములా ఓటీఎస్‌ వసూళ్లు

చెల్లింపునకు లబ్ధిదారుల విముఖత

రోజువారీ లక్ష్యాలతో అధికారులపై ఒత్తిడి

కొత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామంలో

ఓటీఎస్‌పై అవగాహన కల్పిస్తున్న మండల అధికారులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంలో భాగంగా లబ్ధిదారుల నుంచి ఏకకాల పరిష్కారం(ఓటీఎస్‌) పేరుతో రుణ బకాయిలు వసూలు చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ వ్యవహారం క్షేత్రస్థాయిలో అధికారులకు కత్తి మీద సాములా మారింది. వసూళ్ల పర్వం ఉద్యోగులకు కష్టతరంగా మారింది. ఉదయం 7 గంటల నుంచే పల్లెల్లో సచివాలయ ఉద్యోగులు, మండల అధికారులు ఇంటింటా తిరుగుతున్నారు. అయినా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు.

ఆన్‌లైన్‌లో వివరాల నమోదు...: గృహ నిర్మాణ సంస్థ రుణంతో 1983 నుంచి 2011 వరకు నిర్మించుకున్న ఇళ్ల లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించారు. వారు నివాసముండే ఆయా సచివాలయాల పరిధిలో సర్వే చేపట్టి ఆ ఇంట్లో ప్రస్తుతం లబ్ధిదారులు ఉంటున్నారా.. లేకుంటే వారసులా.. కొనుగోలుదారులా అనే వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. గ్రామ, పట్టణ, నగర ప్రాంతాల్లో రుణ వసూళ్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కేటగిరీలుగా విభజించింది. తొలి విడతగా రుణం పొందిన లబ్ధిదారులు లేదా వారి వారసులకు ఓటీఎస్‌ కింద రుణ బకాయిలు వసూలు చేయాలని ఆదేశాలిచ్చింది. నగదు చెల్లిస్తే సర్వహక్కులతో రిజిస్ట్రేషన్‌ చేసి డిసెంబర్‌ 21న అప్పగిస్తారు.

25 ఏళ్ల క్రితం ఇళ్లకు ఇప్పుడా..!: ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ; ఇప్పుడు 25 ఏళ్ల కితం నిర్మించిన ఇళ్లకు డబ్బులు వసూలు చేయడాన్ని కొందరు లబ్ధిదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమకు హక్కులు అక్కర్లేదంటూ అధికారుల ముఖం మీదే చెప్పేస్తున్నారు. 1983లో గృహ నిర్మాణ యూనిట్‌ విలువ రూ.6 వేలుంటే, అందులో ప్రభుత్వ రుణం రూ.3 వేలుండగా, మరో రూ.3 వేలు రాయితీ ఇచ్చారు. గృహ నిర్మాణ సంస్థ రుణంతో అప్పట్లో కట్టిన ఇళ్లు శిథిలం కావడంతో ఓటీఎస్‌ కింద నగదు చెల్లించేందుకు మరికొందరు ముందుకు రావడం లేదు.

అర్హుల ఆచూకీ లభించడం లేదు...: క్షేత్రస్థాయిలో చాలా మంది లబ్ధిదారుల ఆచూకీ లభించడం లేదు. కొన్ని చిరునామాలున్నా.. అక్కడ సంబంధిత యజమానులు లేరు. మరికొందరు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో అయితే అప్పుడు ఇళ్లు ఉచితమని చెప్పారు.. ఇప్పుడు ఎలా డబ్బులడుగుతారంటూ ఉద్యోగులను ప్రశ్నిస్తున్నారు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటే ఎలా కట్టాలని కొందరు.. కొవిడ్‌తో ఉపాధి కోల్పోయి నిన్నటి వరకు కుటుంబ పోషణే కష్టంగా ఉంటే డబ్బులెలా కట్టగలమని మరికొందరు అధికారుల ఎదుటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ దస్తావేజులుండి సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నవారూ ఎక్కువ మందే ఉన్నారు. అటువంటి వారు మీరిచ్చే పట్టా మాకెందుకనే సమాధానమిస్తున్నారు. కొన్ని చోట్ల రెండు, మూడు పేర్ల మీద ఒకే ఇంటిని కట్టుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఒకే ఇల్లు ఉండటం సమస్యగా మారింది.

యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి...: గృహ నిర్మాణ శాఖ ఇచ్చిన లబ్ధిదారుల జాబితాలో గుర్తించిన వారితో ఓటీఎస్‌ చేయించాలని అధికార యంత్రాంగానికి లక్ష్యాలు నిర్దేశించారు. ఏ మండలంలో ఎంత వసూలు చేశారు, తక్కువుంటే కారణాలపై ప్రతి రోజూ కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, సంయుక్త కలెక్టర్‌(గృహ నిర్మాణం) కె.ఎస్‌.విశ్వనాథన్‌ టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. లక్ష్యం మేర వసూలు చేయాలంటూ మండల అధికారులకు ఆదేశాలిస్తున్నారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లపై ఒత్తిడి పెరిగితే.. వాళ్లు పంచాయతీ కార్యదర్శులు, వార్డు కార్యదర్శులకు రోజువారీ లక్ష్యాలు కేటాయిస్తున్నారు. వాళ్లు సచివాలయంలో ఉండే వీఆర్వో, సర్వేయర్‌, ఇంజినీరింగ్‌, సంక్షేమ సహాయకులు, వాలంటీర్లకు లక్ష్యాలు ఇస్తున్నారు. వసూలు లక్ష్యంపై ప్రతి రెండు గంటలకోసారి ఆన్‌లైన్‌ నివేదిక వస్తోంది. దీంతో ఒత్తిడి తట్టుకోలేక అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది.

కేటగిరీల వారీగా వసూళ్లు ఇలా...

కేటగిరీ-ఎ కింద గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకుని ఉంటే.. ప్రస్తుతం వారి వారసుల పేరు మీద పట్టా ఇవ్వనున్నారు. అందుకు గ్రామాల్లో రూ.10 వేలు, మున్సిపాలిటీలో రూ.15 వేలు, నగరపాలక సంస్థ పరిధిలో రూ.20 వేలు చెల్లించాలి.

కేటగిరీ-బి కింద రుణం తీసుకుని, ప్రస్తుతం అందులో ఇతరులున్నట్లైతే.. గ్రామాల్లో రూ.20 వేలు, మున్సిపాలిటీలో రూ.30 వేలు, నగరపాలక సంస్థ పరిధిలో రూ.40 వేలు కట్టాలి.

కేటగిరీ-సి కింద రుణం తీసుకోకుండా ఉండి, వారి వారసుల పేర్ల మీదకు పట్టా మార్చాల్సి వస్తే రూ.10తో రిజిస్ట్రేషన్‌ చేస్తారు.

1983 - 2011 వరకు గృహ నిర్మాణ లబ్ధిదారులు, అందులో ఓటీఎస్‌కు అర్హులు, వసూలైన నగదు వివరాలు..

పక్కా గృహాల లబ్ధిదారులు 3,80,417 మంది

ఓటీఎస్‌కు గుర్తించింది 1,06,935 మంది

ఇప్పటివరకు చెల్లించినది 11,163 మంది

వసూలైన నగదు రూ.10,47,17,916

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని