logo
Published : 04/12/2021 05:51 IST

3రోజులు ఆగని లీకులు

మోపాడు జలాశయం వద్ద ప్రమాదకరంగానే పరిస్థితి


జేసీబీతో అలుగు పగుల కొడుతున్న దృశ్యం

కనిగిరి, పామూరు న్యూస్‌టుడే: ఇప్పటికి మూడు రోజులైంది. అయినా పామూరు మండలంలోని మోపాడు జలాశయం లీకేజీలకు అడ్డుకట్ట పడటంలేదు. నిరంతరంగా పనులు చేస్తున్నా నీరు పోతూనే ఉంది. దీంతో కట్టతో ఏ సమస్య వస్తుందోనని మోపాడు, కొత్తకాలనీ, ఎస్సీకాలనీ, బొట్లగూడూరు, రేగిచెట్లపల్లి, లక్ష్మీనర్సాపురం, కంభాల దిన్నె తదితర గ్రామాల ప్రజలు బితుకు బితుకుమంటూనే ఉన్నారు. ప్రస్తుతం వర్షాలు కురవకపోయినా కాల్వలు, వాగుల ద్వారా ఈ జలాశయంలోకి నీరు వస్తూనే ఉంది. 30 అడుగుల నీరుండటంతో కనీసం అయిదడుగులు తగ్గిస్తే ప్రమాదం తప్పుతుందన్న నిపుణుల సూచనలను అధికారులు పాటిస్తున్నారు. గురువారం నాటికి 29 అడుగులు ఉండగా శుక్రవారం రాత్రి వరకు జేసీబీ, పొక్లెయిన్‌ ఇతర యంత్రాలతో కొండల నడుమ ఉన్న అలుగును పగలగొడుతూనే ఉన్నారు. కాల్వలు తవ్వి ఆ నీటిని మన్నేరు, ఇతర వాగుల్లోకి మరలించారు. అయినా ఉద్ధృతి తగ్గడంలేదు. 
తూతూ మంత్రంగా పనులు
లీకేజీలు వచ్చేచోట వందలాది ఇసుక బస్తాలు వేసినా యథావిధిగా కట్ట రంధ్రాల ద్వారా నీరు ఉబుకుతూనే ఉంది. కట్ట లోపల బలహీనంగా ఉన్నచోట ఎడమవైపు పది అడుగులు, కుడివైపు పది అడుగులు మట్టి, సిమెంట్, ఇసుక బస్తాలు వేస్తే ఫలితముండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కట్ట చదును చేస్తూ నీరు లీకేజీ చోట బస్తాలు వేస్తే ప్రయోజనం ఉండదని, కనీసం 5 అడుగుల నీరు బయటకు పోయేలా చేస్తే తప్ప గండం గడవదని మోపాడు, లక్ష్మీనర్సాపురం, బొట్లగూడూరు, కంభాలదిన్నె, ఇనిమెర్ల తదితర రిజర్వాయర్‌ పరివాహక రైతులు చెబుతున్నారు. ఇలా ఎన్ని రోజులు వెలుపల బస్తాలు వేసినా లీకేజీలు ఆగవని వారు అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రస్తుతం కట్ట చాలావరకు నాని ఉంది. కాలు వేస్తే కిందకు దిగుతోంది. 


తగ్గని లీకేజీలు  

వేగవంతంగా పూర్తిచేయాలి
రిజర్వాయర్‌ కట్ట లీకులు నివారించేందుకు అధికార యంత్రాంగం వేగవంతంగా పనులు పూర్తిచేయాలని సంయుక్త కలెక్టర్‌ జె.వెంకటరమురళి ఆదేశించారు. శుక్రవారం ఆయన పనులు పరిశీలించారు. రిజర్వాయర్‌ మరమ్మతులకుతక్షణమే రూ.20 లక్షలు నిధులు అవసరమని ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ కోరగా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలుగు పగలగొట్టి దాని ద్వారా నీటిమట్టం తగ్గించేలా చూడాలని, తూముల ద్వారా కూడా నీటిని వదిలి రిజర్వాయర్‌ కట్టకు ఒత్తిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌ఈ లక్ష్మారెడ్డి, డీఎస్పీ కండె శ్రీనివాసులు, డీఈఈ బి.రవి, తహసీల్దార్‌ సీహెచ్‌.ఉష, పామూరు, కనిగిరి సీఐలు కె.శ్రీనివాసరావు, పాపారావు పాల్గొన్నారు.

ప్రమాదం ఏమీ లేదు
గత రెండు రోజుల కంటే శుక్రవారం లీకేజీలు తగ్గాయి. అలుగు పగలగొట్టి నీటిని బయటకు పంపుతున్నాం. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.20 లక్షలతో కట్ట పనులు చేపడతాం. రిజర్వాయర్‌కు ఎలాంటి ప్రమాదం లేదు. ప్రజలు భయాందోళన చెందాల్సిన పని లేదు.  
- లక్ష్మీరెడ్డి, నీరుపారుదలశాఖ ఎస్‌ఈ 


పరిశీలిస్తున్న జేసీ  వెంకటమురళి, ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌ 

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని