logo

కాలువలు తవ్వి పదేళ్లు

పొలాలను ఆనుకునే కాలువలు ఉన్నా సాగునీరు రాని దుస్థితి. జలాశయంలో సాగునీరున్నా సేద్యం చేయలేని పరిస్థితి. కాలువలు వస్తే పంటలు పుష్కలంగా పండుతాయనుకున్న రైతులకు చివరకు నిరాశే మిగిలింది.

Updated : 06 Feb 2023 06:43 IST

గుర్రాలపాలెం సమీపంలో పనికిరాని మొక్కలతో నిండిపోయిన మడ్డువలస కాలువ

లావేరు, న్యూస్‌టుడే: పొలాలను ఆనుకునే కాలువలు ఉన్నా సాగునీరు రాని దుస్థితి. జలాశయంలో సాగునీరున్నా సేద్యం చేయలేని పరిస్థితి. కాలువలు వస్తే పంటలు పుష్కలంగా పండుతాయనుకున్న రైతులకు చివరకు నిరాశే మిగిలింది. జిల్లాలోని మడ్డువలస ప్రాజెక్టు కింద లావేరు, ఎచ్చెర్ల, జి.సిగడాం, పొందూరు మండలాల పరిధిలో పరిస్థితి ఇది.

ఇదీ పరిస్థితి..: లావేరు మండల పరిధిలోని కొత్త, పాతకుంకాం, గుర్రాలపాలెం, అదపాక, బుడుమూరు పంచాయతీలతో పాటు ఎచ్చెర్ల మండలం అరిణాంఅక్కివలస, అల్లినగరం, పొందూరు మండలంలోని రాపాక తదితర ప్రాంతాలతో పాటు జి.సిగడాం మండలంలోని 12 పంచాయతీలకు మడ్డువలస ప్రాజెక్టు ద్వారా సాగు నీరందాల్సి ఉంది. ఈ మండలాల పరిధిలో 22 కిలోమీటర్ల పొడవునా కాలువ తవ్వకాలు చేపట్టగా 12,500 ఎకరాలకు సాగు నీరందాల్సింది. కాలువ తవ్వకాలు పూర్తయినప్పటికీ చుక్కనీరు రాలేదని ఆయా గ్రామాలకు చెందిన రైతులు వాపోతున్నారు. పలుమార్లు ప్రాజెక్టు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని వాపోతున్నారు. అప్పట్లో జి.సిగడాం మండల పరిధిలోని దేవరవలస సమీపంలో కాలువకు అడ్డంగా పెద్ద బండరాయి ఉండటంతో దిగువ ప్రాంతానికి నీరు రావడం లేదని అధికారులు తెలిపారు. ఇటీవలే ఈ రాయిని కొంతమేర తొలగించారు. ఈ ఏడాదైనా సాగునీరు వస్తుందాని ఎదురు చూస్తున్నారు.

పూడిపోతున్న వైనం: కాలువలను నిరుపయోగంగా వదిలేయడంతో ప్రస్తుతం పనికిరాని మొక్కలు, ముళ్లపొదలు, ఎక్కడికక్కడ గట్లు మరమ్మతులకు గురై దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతం రైతులు నీరు లేక నీలగిరి, సరుగుడు తోటలు వేసుకుంటున్నారు.


ఏళ్లతరబడి..: మడ్డువలస జలాశయం ద్వారా సాగునీరు వస్తుందని విలువైన భూములను తక్కువ ధరకు ఇచ్చాం. కాలువ తవ్వకాలు చేపట్టడంతో ఎంతో సంతోషపడ్డాం. ఏళ్లు గడుస్తున్నా చుక్కనీరు రాని పరిస్థితి. ఏటా ఎదురుచూపులే మిగులుతున్నాయి.

కె.దామోదరరావు, రైతు, కొత్తకుంకాం, లావేరు మండలం


అధికారులు పట్టించుకోవడం లేదు: పొలాల్లో నుంచి కాలువ తవ్వకాలు చేపట్టి వదిలేశారు. సాగునీరు విడుదల చేయడం మరిచారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కాలువల్లో పనికిరాని మొక్కలు దట్టంగా పెరిగాయి. వచ్చే ఖరీఫ్‌ నాటికైనా సాగునీరు విడుదల చేస్తే ఎంతో ఉపయోగపడుతుంది.

ఎ.కృష్ణ, పెద్దకొత్తపల్లి, లావేరు మండలం


రూ.22 కోట్లతో పనులు: మడ్డువలస ప్రాజెక్టు స్టేజ్‌-2 కింద రూ.22 కోట్లతో కాలువలు అభివృద్ధి చేస్తాం. ప్రస్తుతం టెండరు ప్రక్రియ కూడా పూర్తయింది. త్వరలో పనులు ప్రారంభిస్తాం. కొంతమేర భూసేకరణ చేయాల్సి ఉంది. అదీ పూర్తిచేస్తాం. కాలువల్లో ఉన్న పొదలు తదితర వాటిని తొలగించి వచ్చే ఖరీఫ్‌ నాటికి 4 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు చర్యలు చేపడుతున్నాం.

డీవీ రమణ, డీఈఈ, మడ్డువలస ప్రాజెక్టు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని