logo

ఈ కుట్ర లోతు.. బంగాళా‘ఖాత’మంత!!

ప్రభుత్వ యంత్రాంగం తగినంత ఉంది. పేదల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేయొచ్చు. అయినా లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెట్టే యోచనపై సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతోంది.

Updated : 01 May 2024 08:55 IST

బ్యాంకుల్లో పింఛను సొమ్ములేస్తారా?
అభాగ్యుల ఇంటికొచ్చి ఇవ్వలేరా?
నడవలేని మా బాధలు ప్రభుత్వానికి తెలియవా?
వైకాపా పాలకులపై అవ్వాతాతల మండిపాటు
ఈనాడు, విశాఖపట్నం

వృద్ధులు, దివ్యాంగులకు ఏమైనా ఫర్వాలేదు..
అంతిమంగా అధికార పార్టీకి మేలు జరిగితే చాలు!
మండుటెండలకు పండుటాకులు మలమలమాడిపోవాలి..
మనకు మాత్రం మంచి పేరు రావాలి!!
అభాగ్యులు బ్యాంకుల చుట్టూ తిరిగి మంచానపడాలి
అందుకు ప్రతిపక్షాలు కారణమని చెప్పాలి!
నడవలేని వారిని ఆటోల్లో తరలించి అవస్థలపాల్జేయాలి.. మనమే మంచి చేశామని చెప్పుకోవాలి..

- ‘ఇదీ పింఛన్ల పంపిణీపై వైకాపా నేతల కుతంత్రం’ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి!!

ప్రభుత్వ యంత్రాంగం తగినంత ఉంది. పేదల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేయొచ్చు. అయినా లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెట్టే యోచనపై సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతోంది. మండే ఎండల్లో కావాలనే ఇబ్బందులకు గురిచేసి ఆ నెపాన్ని ప్రతిపక్షాల మీద నెట్టే వ్యూహాన్ని అధికార పార్టీ అమలు చేస్తుందనే ఆరోపణలొస్తున్నాయి. గత నెలలో సచివాలయాలకు బలవంతంగా రప్పించి అష్టకష్టాలు పెట్టారు. ఈసారి అంతకు రెండింతలు కష్టాలపాలయ్యే నిర్ణయం కలకలం రేపుతోంది. లబ్ధిదారులు సచివాలయాలు.. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది.

పింఛనుదారుల తమ నివాస ప్రాంతానికి సమీపంలోని సచివాలయాలకు వెళ్లి తీసుకోవడం సౌకర్యవంతం. కానీ మే నెల సొమ్ములు తీసుకోవాలంటే బ్యాంకులకు వెళ్లాలి. రానుపోను 5 కి.మీ. నుంచి 20 కి.మీ. దూరం వ్యయప్రయాసలు తప్పేలా లేవు. మొదట సచివాలయానికి వెళ్లి ఏ బ్యాంకు ఖాతాకు అనుసంధానమైందో తెలుసుకోవాలి. ఆ తర్వాత బ్యాంకులకు వెళ్లి నగదు తీసుకోవాలి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్న సమయంలో ఇలా తిరగడం ఇబ్బందికరమే.

ఎంత కష్టమో..: జిల్లాలో ఆనందపురం, పద్మనాభం, భీమిలి, పెందుర్తి మండలాల్లో పలువురు లబ్ధిదారులు బ్యాంకులకు వెళ్లాలంటే రానుపోను అష్టకష్టాలు తప్పవు. కొన్ని గ్రామాలకు చెందిన పింఛనుదారులు తక్కువలో తక్కువగా 5 నుంచి 20 కి.మీ. వరకు ప్రయాణం చేయాలి.

  • ఆనందపురం మండలంలో చాలా గ్రామాలకు బ్యాంకులు, సేవా కేంద్రాలు అయిదు కి.మీ. దూరంలో ఉన్నాయి. పొడుగుపాలెం పంచాయతీకి బ్యాంకు మూడు కి.మీ. దూరంలో ఉంది. గుడిలోవలోని లబ్ధిదారులు  8 కి.మీ. దూరంలోని వెల్లంకి వెళ్లాలి. భీమన్నదొరపాలెంలోని పింఛనుదారులు బ్యాంకుకు రానుపోను 25 కి.మీ. ప్రయాణించాలి.
  • ఆనందపురం మండలంలో బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు నీలకుండీలు సెంటరు, గిడిజాలలో సర్వీసు సెంటర్లు ఉన్నాయి. ఎస్‌బీఐకి రామవరం, కణమాం. శొంఠ్యాంలో శాఖకి వెల్లంకి, వేములవలసలో ఉన్నాయి. ఏపీజీవీబీకి బంటుపల్లివారికళ్లాలు, వేములవలసలో ఉండగా యూనియన్‌ బ్యాంకుకి గొట్టిపల్లి, చందకలో ఉన్నాయి. లబ్ధిదారులు అక్కడికి వెళ్లి పింఛన్లు తీసుకోవాలి.
  • పద్మనాభం మండలంలో కొన్ని గ్రామాలకు చెందిన లబ్ధిదారులు బ్యాంకులకు వెళ్లాలంటే రాను పోను పది కి.మీ. వరకు ప్రయాణించాలి. భీమిలిలోనూ ఇదే పరిస్థితి. ఎండల వేడిమి ఎక్కువగా ఉండడంతో పలుమార్లు తిరగడం కష్టంగా మారనుంది.
  • నగరంలోని అనేక వార్డుల్లోని లబ్ధిదారులకు బ్యాంకులు రెండు నుంచి మూడు కి.మీ. దూరంలో ఉన్నాయి. ఒకసారి సచివాలయానికి వెళ్లి మళ్లీ బ్యాంకులకు వెళ్లాలనే విషయం తెలసిన వారంతా నేతల తీరుపై మండిపడుతున్నారు.

జిల్లాలో 1,64,899 మంది పింఛనుదారులు ఉన్నారు. బ్యాంకు ఖాతాలు ఉన్న వారి సంఖ్య 1,22,278. వీరిలో 25 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో వారే. దీంతో చాలామందికి ఇక్కట్లు తప్పేలా లేవు.


ఆరోగ్యం సహకరించడం లేదు..

-కె.లక్ష్మణరావు, మాధవధార

నేను సరిగ్గా నడవలేను. సచివాలయానికి వెళ్లి పింఛను తీసుకోవాలంటేనే ఇబ్బంది. ఇప్పుడు పింఛను డబ్బులు బ్యాంకుల్లో వేస్తామంటే వాటిని ఎలా తీసుకోవాలో తెలియటం లేదు. ఒక వేళ సొమ్ములు పడ్డా అక్కడ ఎంత సమయం కూర్చోవాలో అని భయమేస్తుంది. మరో వైపు ఎండలు మండిపోతున్నాయి. వేడిగాలులు తీవ్రంగా ఉన్నాయి. ఇంత ఎండలో బ్యాంకుల దాకా వెళ్లాలంటే ఇబ్బంది. గత నెలలో సచివాలయానికి వెళ్లాడానికి చాలా ఇబ్బంది పడ్డాను. మాలాంటోళ్లకు ఇంటికొచ్చి ఇస్తే బాగుంటుంది.


బ్యాంకులో ఎవరు పట్టించుకుంటారు..

-బి.తవిటమ్మ, తెన్నేటినగర్‌

ఎవరో ఒకర్ని తోడు తీసుకొని బ్యాంకుకు వెళ్తేనే పింఛను డబ్బులు తీసుకోగలను. గత నెలలో పింఛన్‌ కోసం రెండు రోజులు తిరగాల్సి వచ్చింది. ఇప్పుడు బ్యాంకులో డబ్బులు వేస్తారట. మా ఖాతా మనుగడలో ఉందో లేదో తెలియదు. మాలాంటి పింఛనుదారులు బ్యాంకుకు వెళ్తే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు. ప్రభుత్వ పెద్దలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని ఇంటికే వచ్చి పింఛను ఇచ్చే ఏర్పాటు చేయాలి.


ఎండలో వెళ్లాలి..

-ఎర్రమ్మ

మాది తంగుడుబిల్లి. పింఛను డబ్బుల కోసం గిడిజాలలోని బ్యాంకుకు ఆటో ఛార్జీ పెట్టుకొని వెళ్లాలి. నాలుగు కి.మీ. ఎండలో వెళ్లి రావాలంటే ఎంత కష్టమో. ఇంటి వద్దకు తెచ్చి ఇస్తేనే మేలు.

న్యూస్‌టుడే, ఆనందపురం, మాధవధార

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని