logo

కంటి సమస్యలు లేని బాల్యమే లక్ష్యంగా..

విద్యార్థులకు కంటి చూపు సమస్య ఉంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే), వైద్యశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది.

Published : 19 Apr 2024 04:38 IST

గురుకుల పాఠశాలలో నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యాధికారులు

న్యూస్‌టుడే, భూపాలపల్లి కలెక్టరేట్‌ : విద్యార్థులకు కంటి చూపు సమస్య ఉంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే), వైద్యశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది. సమస్య ఉన్న వారికి అవసరమైన చికిత్స అందించేలా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. మొదటి విడతలో గురుకులాల, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ఈనెల 23వ తేదీ వరకు కంటి పరీక్షలు పూర్తి చేసేలా కార్యాచరణ చేపట్టారు.  

నాలుగు బృందాలు..

జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాలు, సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థులకు కంటి పరీక్షలను ఈనెల 8 నుంచి చేపట్టారు. ఆర్బీఎస్‌కే వైద్యులు, సిబ్బందితో కూడిన నాలుగు బృందాలు రోజుకు 250 మంది విద్యార్థులకు తగ్గకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 23వ తేదీ వరకు మొదటి విడత కార్యక్రమం పూర్తి చేసేలా అధికారులు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఒక్కో బృందంలో ఇద్దరు వైద్యులు, ఒకరు ఆఫ్తాల్మజిస్ట్‌, ఒక ఫార్మసిస్ట్‌, ఇద్దరు ఏఎన్‌ఎం, ఇద్దరు ఆశా కార్యకర్తలు ఉన్నారు. కంటి సమస్య ఉన్నవారికి మందులు ఇస్తున్నారు. అద్దాలు, శస్త్రచికిత్సలు అవసరమైన వారి వివరాలను అధికారులకు పంపిస్తున్నారు. అద్దాలు పంపిణీ పూర్తయ్యాక  ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయిస్తామని వైద్యాధికారులు తెలిపారు.

5 వేల మందికి పైగా పూర్తి  

జిల్లాలో కేజీబీవీలు 11, ఎస్సీ సంక్షేమ 2, బీసీ సంక్షేమ 3, గిరిజన సంక్షేమ 15, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు ఒకటి చొప్పున  ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 417 మంది బాలురు, 4672 మంది బాలికలకు పరీక్షలు నిర్వహించారు. అందులో 383 మందికి దగ్గరి, దూరం చూపు సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఇతర కంటి సమస్యలతో బాధపడుతున్న వారు మరో ఇద్దరు ఉన్నట్లు గుర్తించారు.


క్షుణ్నంగా పరీక్షలు..

- డాక్టర్‌ మధుసూదన్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

మొదటి విడతలో గురుకులాల విద్యార్థులకు పరీక్షలు చేయిస్తున్నాం. వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు ప్రారంభం కాగానే  విద్యార్థులకు పరీక్షలు చేపడతాం. అద్దాలు అవసరమైన విద్యార్థులకు నెల రోజుల్లోగా పంపిణీ చేస్తాం. ఇతర కంటి సమస్యలను క్షుణ్నంగా పరీక్షించేలా చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని