logo

అభ్యర్థిని చూసి ఆశీర్వదించండి..

వరంగల్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భారాస జోరు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి వరంగల్‌కు వచ్చిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపారు.

Published : 24 Apr 2024 03:08 IST

విస్తృత స్థాయి సమావేశాల్లో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌
కాంగ్రెస్‌, భాజపాల తీరుపై మండిపాటు

వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థి డా.సుధీర్‌కుమార్‌ను పరిచయం చేస్తూ మాట్లాడుతున్న భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌. చిత్రంలో ఎడమ నుంచి కుడికి ఎమ్మెల్సీ, లోక్‌సభ ఎన్నికల తూర్పు ఇన్‌ఛార్జి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డా.టి.రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్‌ బొల్లం సంపత్‌కుమార్‌, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్‌ మెట్టు శ్రీనివాస్‌, డాక్టర్‌ హరిరమాదేవి, రాకేష్‌రెడ్డి తదితరులు

ఈనాడు, వరంగల్‌, కరీమాబాద్‌, బాలసముద్రం, న్యూస్‌టుడే: వరంగల్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భారాస జోరు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి వరంగల్‌కు వచ్చిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపారు. వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశాలకు హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్‌, భాజపాలపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఇటీవల పార్టీలు మారిన కడియం శ్రీహరి, అరూరి రమేశ్‌లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారాస అభ్యర్థి మారపల్లి సుధీర్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. మంగళవారం సాయంత్రం హెలికాప్టర్‌లో హనుమకొండకు చేరుకున్న ఆయన ముందుగా హనుమకొండ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ట్రోఫీ ప్రదానోత్సవంలో పాల్గొన్నారు తర్వాత వరంగల్‌ ఉర్సు ప్రాంతంలోని నానిగార్డెన్‌లో జరిగిన తూర్పు, అక్కడి నుంచి హంటర్‌రోడ్డులోని డీ కన్వెన్షన్‌లో జరిగిన వర్ధన్నపేట విస్తృత స్థాయి సమావేశాలకు హాజరై ప్రసంగించారు. ప్రజలు మరోసారి కాంగ్రెస్‌ చేతిలో మోసపోకూడదంటే భారాస అభ్యర్థిని గెలిపించాలన్నారు. కేటీఆర్‌ తన ప్రసంగంలో పలుమార్లు భారాసకు బదులు తెరాస అని ప్రస్తావించారు.

వరంగల్‌ తూర్పు సమావేశానికి హాజరైన పార్టీ  శ్రేణులు..

వరంగల్‌ అభివృద్ధి కోసం భారాసకు ఓటేయాలి..

కాంగ్రెస్‌ పాలనలో వరంగల్‌ విధ్వంసానికి గురైందని భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్‌ ఆరోపించారు. 1930లోనే వరంగల్‌లో ఏర్పాటు చేసిన విమానాశ్రయం అజంజాహిమిల్లు, దేశాయిపేట తోళ్లపరిశ్రమలు కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే మూతపడ్డాయని అన్నారు. పరిశ్రమలు రావాలన్నా, వరంగల్‌ అభివృద్ధి చెందాలన్నా భారాసకు ఓటేయాలని ప్రజలను కోరారు.

ఎవరు ఏమన్నారంటే..

  • మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ నాయకుల మధ్య చిచ్చుపెడుతున్నారని.. ఎక్కువ రోజులు ప్రభుత్వం కొనసాగదని అన్నారు. కడియం, అరూరి, మార్నేని పదవులు అనుభవించి పార్టీని మోసం చేశారని మండిపడ్డారు. భారాస అభ్యర్థి 50 వేల ఆధిక్యంతో గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు.
  • అసెంబ్లీ ఎన్నికల్లో తెలిసో తెలియకో తప్పుచేశామని.. మరోసారి తప్పు జరగకుండా భారాస ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కోరారు.
  • మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. కడియం శ్రీహరి, కాంగ్రెస్‌ అభ్యర్థి కావ్యపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కడియం అవకాశవాది అని, నకిలీ దళితుడు, అవినీతి పరుడు, పదేళ్లు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన అవినీతిపై ఖల్‌నాయక్‌ అనే పుస్తకమే వచ్చిందని ధ్వజమెత్తారు. కడియం శ్రీహరి, అతని కూతురు కావ్యది ఏ కులమో చెప్పాలని సవాలు విసిరారు. రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో ఒక్క మాదిగకు కూడా మంత్రిగా అవకాశం కల్పించలేదని ఆరోపించారు.  
  • మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ మాట్లాడుతూ.. వరంగల్‌ తూర్పు ప్రజలకు దూరంగా ఉంటున్న మంత్రి సురేఖ భారాస హయాంలో తాను చేసిన రూ.4 వేల కోట్ల అభివృద్ధి పనులను ఆమె చేసినట్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • భారాస హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ మచ్చలేని నాయకుడు సుధీర్‌కుమార్‌ను ఉద్యమస్ఫూర్తితో గెలిపించాలని కోరారు.

సమావేశానికి దూరంగా మేయర్‌

భారాస సమావేశానికి నగర మేయర్‌ గుండు సుధారాణి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. తూర్పు నియోజకవర్గ సమావేశ వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్‌పై సైతం ఆమె ఫొటోను ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.ఆమె ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలవడంతో కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు