logo

ప్రలోభాల బటన్‌ నొక్కేశారు!

ప్రతి కుటుంబానికి పథకాల లబ్ధిని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో  జమ చేశాం.. ఇంటింటికీ సంక్షేమాన్ని చేరువ చేశాం.. ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయంటూ నిన్నమొన్నటి వరకు బీరాలు పలికిన అధికార వైకాపా నాయకులు..

Updated : 29 Apr 2024 04:43 IST

రెండు వారాల ముందే పంపకాల పందేరం

 

ప్రతి కుటుంబానికి పథకాల లబ్ధిని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో  జమ చేశాం.. ఇంటింటికీ సంక్షేమాన్ని చేరువ చేశాం.. ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయంటూ నిన్నమొన్నటి వరకు బీరాలు పలికిన అధికార వైకాపా నాయకులు.. ఆ ఎత్తు పారేలా కనిపించకపోవడంతో ప్లేటు తిప్పేశారు. సంక్షేమ మంత్రాన్ని పక్కన పెట్టి పోలింగ్‌కు రెండు వారాల ముందే ప్రలోభాల బటన్‌ నొక్కేశారు. పంపకాల కోసం కమిటీలు కూడా ఏర్పాటు చేశారు.

భీమవరం పట్టణం, ఉండి, న్యూస్‌టుడే

  • వైకాపా సర్కారుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులను ప్రసన్నం చేసుకోవడంపై ఆ పార్టీ అభ్యర్థులు దృష్టిసారించారు. తపాలా బ్యాలెట్‌ ఓట్లు తమకు వేయిస్తే తగిన ప్రతిఫలం చూపుతామంటూ ఎర వేస్తున్నారు. కుల సంఘాల పెద్దలను కలిసి ఆ వర్గం ఓట్లను తమ పార్టీకే వేయించాలని కోరుతున్నారు. ఆయా వర్గాల సమస్యల పరిష్కారం, ఇతరత్రా అంశాలపై నోటికొచ్చిన హామీలు గుప్పిస్తున్నారు.
  • మహిళల ఓట్లు కొల్లగొట్టేద్దామంటూ ఆచంట, పాలకొల్లు, తణుకు, ఉండి నియోజకవర్గాల్లో ఇప్పటికే చీరలు పంచారు. భీమవరం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో డ్వాక్రా, మెప్మా సంఘాల్లో సభ్యులకు, సీఆర్పీలకు రెండు రోజులుగా నగదు పంపిణీ చేస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఈ తరహా పంపకాలు మొదలైనట్లు సమాచారం.
  • వివిధ కారణాలతో అసంతృప్తిగా ఉన్న నాయకులు, కార్యకర్తలను బుజ్జగించే యత్నాలతో పాటు ప్రత్యర్థి పార్టీలో ఓటర్లను ప్రభావితం చేయగలిగే ద్వితీయ శ్రేణి నాయకులను తమవైపు తిప్పుకొనేలా ఎత్తుగడలు వేస్తున్నారు. పార్టీలోకి వస్తే తక్షణ ప్యాకేజీతో పాటు భవిష్యత్తులోనూ సముచిత స్థానం కల్పిస్తామంటూ ఆశ కల్పిస్తున్నారు.

కుటుంబ సమేతంగా ప్రచారంలోకి..

కొద్దిరోజులుగా అభ్యర్థుల ప్రచార జోరుతో పాటు ఎండ తీవ్రత పెరిగింది. దీంతో ఉదయం 6 గంటలకే ప్రచారం మొదలుపెట్టి 10 గంటలకల్లా ముగిస్తున్నారు. మళ్లీ సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగిస్తున్నారు. పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో అభ్యర్థుల కుటుంబ సభ్యులను కూడా రంగంలోకి దింపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని