logo

తెదేపా రాజంపేట నియోజకవర్గ పరిశీలకుడిగా దుర్గాప్రసాద్‌

రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంపై తెదేపా అధిష్ఠానం ప్రత్యేక దృష్టిసారించింది. కడపకు చెందిన కీలక నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుధా దుర్గాప్రసాద్‌ను పరిశీలకుడిగా నియమించింది.

Published : 20 Apr 2024 04:40 IST

ఈనాడు, కడప : రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంపై తెదేపా అధిష్ఠానం ప్రత్యేక దృష్టిసారించింది. కడపకు చెందిన కీలక నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుధా దుర్గాప్రసాద్‌ను పరిశీలకుడిగా నియమించింది. వెంటనే నియోజకవర్గానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పార్టీ టిక్కెట్‌ను జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్‌రాజు, ముఖ్య నేత బత్యాల చెంగల్రాయుడు ఆశించారు. అనూహ్య పరిస్థితిలో రాజంపేట పార్లమెంటు స్థానాన్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన భాజపాకు కేటాయించడంతో ప్రధాన సామాజిక వర్గానికి ప్రాధాన్యమివ్వాలనే సంకల్పంతో సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు టిక్కెట్‌ ఇచ్చారు. చమర్తికి పార్టీ అధిష్ఠానం నచ్చజెప్పి పార్టీ అధికారంలోకి రాగానే కీలక స్థానం కల్పిస్తామనే హామీ ఇచ్చింది. దీంతో ఆయన సుగవాసి గెలుపు బాధ్యతలు భుజాన వేసుకుని పనిచేస్తున్నారు. ఈ ఇద్దరితోపాటు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వేమన సతీష్‌ను అటు రాజంపేట, ఇటు రైల్వేకోడూరుపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించింది. రాజంపేటలో తెదేపా అనూహ్యంగా పుంజుకుని వైకాపా నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వర్గమంతా పోలి సుబ్బారెడ్డి నాయకత్వంలో తెదేపాలో చేరింది. మరోవైపు పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్న వారిపై నిఘా పెట్టి వారిపై చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో ప్రధాని నరేంద్రమోదీ రాజంపేట పార్లమెంటు పరిధిలో జరిగే బహిరంగసభకు హాజరుకానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని