logo

కలుషిత నీరు... వ్యాధులతో బేజారు

జీవజలం అంతటా కలుషితమవుతోంది. కనీస వసతుల్లో ప్రధానమైనది తాగు నీరు. పురపాలక సంస్థల్లోని కాలనీల్లో ఎక్కడ చూసినా ఇదే సమస్య కనిపిస్తోంది.

Published : 02 May 2024 05:03 IST

జమ్మలమడుగులోని బీసీ కాలనీలో ప్రభుత్వ  పాఠశాల వద్ద తాగునీటి పైపులైన్‌ లీకేజీ

న్యూస్‌టుడే, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు పట్టణం: జీవజలం అంతటా కలుషితమవుతోంది. కనీస వసతుల్లో ప్రధానమైనది తాగు నీరు. పురపాలక సంస్థల్లోని కాలనీల్లో ఎక్కడ చూసినా ఇదే సమస్య కనిపిస్తోంది. ప్రధానంగా రోజువారీగా ప్రజలకు సరఫరా అవుతున్న గొట్టపు మార్గాలు లీకేజీతో ఉండడం వల్ల కలుషితమవుతోంది. దీంతో ప్రజలు జబ్బుల భయంతో అల్లాడుతున్నారు. సర్కారు పంపిణీ చేసే జలం తాగడానికి ఉపయోగించుకోలేని  పరిస్థితులు ఎదురవడంతో తప్పనిసరిగా కొని తాగాల్సి వస్తోంది. దీనికితోడు రహదారులు కూడా అధ్వానంగా మారాయి. ఈ దుస్థితి జమ్మలమడుగు, ప్రొద్దుటూరు పట్టణం, బద్వేలు మున్సిపాల్టీల్లో నెలకొంది. జమ్మలమడుగు పట్టణంలోని ఎనిమిదో వార్డు ప్రజలకు లీకేజీ సమస్య కలవరపెడుతోంది. సుమారు రెండు నెలలుగా ఇదే సమస్య వేధిస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఈ వార్డులో బీసీ కాలనీ, శబరి కాలనీ, రామిరెడ్డిపల్లె, ఎస్సీ కాలనీ ప్రాంతాలున్నాయి. బీసీ కాలనీలో ప్రభుత్వ పాఠశాల వద్ద పైపులైనుకు లీకేజీ ఏర్పడింది. నగర పంచాయతీ సిబ్బంది మరమ్మతులు చేసినా పూర్తి స్థాయిలో చేయలేదని స్థానికుల ఆరోపణ. దీని కారణంగా నీళ్లు మళ్లీ లీకేజీ అవుతున్నాయని చెబుతున్నారు. 5, 6, 7, 8 వార్డులకు నీటి సరఫరా చేసే పైపులైను కావున ఆ ప్రాంతాలకు కలుషితమైన నీరు సరఫరా అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, శబరి కాలనీల్లో కాలువలు ఉన్నా అస్తవ్యస్తంగా మారాయని చెబుతున్నారు. పూడికతో నిండిపోవడంతో మురుగు వెళ్లేందుకు మార్గంలేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారని వాపోతున్నారు.

కొంటేనే తాగునీరు

డ్రైవర్‌కొట్టాలలో నిరుపయోగంగా బోరింగ్‌

ప్రొద్దుటూరులోని ఆరో వార్డులో తాగునీటి శుద్ధి జలాలపై  ఆ ప్రాంత వాసులకు అనుమానాలు ఉన్నాయి. డ్రైవర్‌ కొట్టాల, ఎర్రన్నకొట్టాల, పాలిటెక్నిక్‌ వీధి, కొర్రపాడురోడ్డు, సరస్వతీవిద్యామందిర్‌ ప్రాంతాలున్నాయి. ఎర్రన్నకొట్టాలు, డ్రైవర్‌కొట్టాలు ప్రాంతాల్లో కూలినాలి చేసుకొని జీవించే వారే అధికం. అమృత్‌ తాగునీటి సరఫరాలో ఒండ్రు వస్తోందనేది ప్రధాన ఆరోపణ. అయిదు నెలలుగా ఈ దుస్థితి ఉండడంతో తప్పనిసిరి పరిస్థితుల్లో స్థానికులు నీటిని కొనాల్సి వస్తోంది. దీనిపై వైకాపా నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. కొర్రపాడు రోడ్డు, త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ కూడలి ప్రాంతాల్లో వర్షాలు వస్తే వంకలా మారుతుంది. కాలువలు ఆధునికీకరించాల్సి ఉంది. డ్రైవర్‌కొట్టాలు ప్రాంతాల్లో ఉన్న  ఒకటి, రెండు తాగునీటి బోరింగులు మరమ్మతులకు గురయ్యాయి. వాసవీ కల్యాణమండపం ఎదురు వీధుల్లో అంధకారంల నెలకొంది. ఖాళీ ప్రాంతం కావడంతో విష పురుగులు వస్తున్నాయని  స్థానికులంటున్నారు.

డ్రైనేజీలను శుభ్రం చేయాలి

బీసీ కాలనీలో ప్రభుత్వ పాఠశాల వీధిలో కాలువలు శుభ్రంగా లేవు. పూడికతో నిండిపోయి ఉన్నాయి. వ్యర్థాలను తొలగించాలని పారిశుద్ధ్య కార్మికులకు చెబుతున్నా స్పందించడంలేదు. పాఠశాల వద్ద సుమారు రెండు నెలలుగా తాగునీటి పైపులైను లీకేజీ ఉన్నా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయడం లేదు.

అబ్దుల్‌ రజాక్‌, ఎనిమిదో వార్డు, జమ్మలమడుగు

మంచినీరిస్తే చాలు

పురపాలక అధికారులు పంపిణీ చేస్తున్న నీరు తాగేందుకు అనువుగా లేవు. ఈ నీటినే గతంలో తాగేవాళ్లం. ప్రస్తుతం మైలవరం నుంచి వస్తున్న నీటిలో మట్టి నిలుస్తోంది. తాగాలంటే ఇబ్బందిగా ఉండడంతో కొనుగోలు చేస్తున్నాం.  

కమాల్‌బీ, ఎర్రన్నకొట్టాలు, స్థానికురాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని