logo

కలల వంతెన... జగన్‌ వంచన!

పెన్నానదికి అటు, ఇటు ఉన్న గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు వంతెన లేకపోవడాన్ని అప్పటి తెదేపా ప్రభుత్వం గుర్తించింది.

Published : 02 May 2024 05:22 IST

పది గ్రామాల ప్రజలకు తప్పని నరకయాతన
సాకారమైతే వేలాదిమందికి రవాణా సౌకర్యం

సంకేపల్లె-బొందెలదిన్నె గ్రామాల మధ్యలో నిలిచిపోయిన వంతెన నిర్మాణ పనులు

పెన్నానదికి అటు, ఇటు ఉన్న గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు వంతెన లేకపోవడాన్ని అప్పటి తెదేపా ప్రభుత్వం గుర్తించింది. వారధి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు మొదలుపెట్టింది. కలల వారధి సాకారమైందని ఆయా గ్రామాల ప్రజలు ఆనందపడ్డారు. ఇంతలోనే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడం తదితర కారణాలతో పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. నేటికీ అతీగతీ లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలకు వంతెన కలగానే మిగిలిపోయింది.

న్యూస్‌టుడే, కొండాపురం

కొండాపురం మండలం సంకేపల్లె-అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బొందెలదిన్నె గ్రామాల మధ్య పెన్నానదిపై గతంలో కాజ్‌వేను నిర్మించారు.నదికి వరదలొచ్చే సమయంలో కాజ్‌వేపై నీటి ప్రవాహం కొనసాగేది. దీంతో నది అవతలి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. మండల కేంద్రానికి రావాలంటే అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళ్లి అక్కడ నుంచి రావాల్సి వచ్చేది. దీంతో రానుపోను సుమారు 100 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వచ్చేది. ప్రజల కష్టాలను గుర్తించిన అప్పటి నేతలు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళ్లడంతో స్పందించిన తెదేపా ప్రభుత్వం వంతెన నిర్మాణానికి 2019లో రూ.34 కోట్లు మంజూరు చేస్తూ, అనుమతులిచ్చింది. వెంటనే ఆగమేఘాలపై అదే ఏడాది మార్చి ఏడో తేదీన పనులు ప్రారంభించారు. నదిలో పది శాతం పనులు పూర్తయ్యాయి. పిల్లర్ల నిర్మాణ పనులు జరుగుతుండగా వరదనీరు రావడంతో పనులు నిలిచిపోయాయి. 2023 సెప్టెంబరుకు నీరు తగ్గిపోయినా పనులు మాత్రం చేపట్టలేదు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వంతెన నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదు.

9 వేల మందికి ప్రయోజనం : పెన్నానదిపై వంతెన నిర్మిస్తే పది గ్రామాల్లోని 9 వేలమందికి ప్రయోజనం కలుగుతుంది. సంకేపల్లె, కోడూరు, సిరిగేపల్లె, దొబ్బుడుపల్లె, రాగికుంట, కొత్తపల్లె, మురగంపల్లె, చామలూరు, తిరుమలాయపల్లె, ఎర్రగుడి గ్రామాల ప్రజల రాకపోకలు సులభతరమవుతాయి. వంతెన నిర్మిస్తే దురాభారంతో పాటు ఆర్థికభారం తప్పుతుందని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

వరదలొస్తే రాకపోకలు బంద్‌

పెన్నా నదిలో వరదలొస్తే రాకపోకలు నిలిచిపోతాయి. నీరు ప్రవహించే సమయంలో నది ఇవతల వైపు ఉన్న గ్రామాల్లోని ప్రజలు రాకపోకలు సాగించలేని పరిస్థితి. మండల కేంద్రానికి వెళ్లాలన్నా సుమారు 50 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, రైతులు ఇలా అందరికీ ఇబ్బందే. వైకాపా పాలకులు అయిదేళ్లు కాలయాపన చేశారు. వంతెన పూర్తయితే పది గ్రామాలకు ప్రయోజనం కలుగుతుంది.  

రామమునిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు, టి.కోడూరు


వంతెన పూర్తికాకపోతే ఇబ్బందులే

పెన్నా నదిపై వంతెన పూర్తి చేస్తే పది గ్రామాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. దూరాభారంతో పాటు ఆర్థికభారం తప్పుతుంది. పలుసార్లు అధికారులను వంతెనను పూర్తి చేయాలని కోరాం. వంతెన పనులు పూర్తికాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గడిచిన అయిదేళ్ల వైకాపా పాలనలో వంతెన నిర్మాణంపై పాలకుల చిన్నచూపు చూశారు.  

రామశివారెడ్డి, సంకేపల్లె

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని