Sunitha: వివేకా హత్య తర్వాత అవినాష్‌.. జగన్‌కు ఫోన్‌ చేసి ఏం మాట్లాడారు?: సునీత

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆధారాలను చెరిపేసిన ఎంపీ అవినాష్‌రెడ్డి.. జగన్‌కు ఫోన్‌ చేసి ఏం మాట్లాడారని వైఎస్‌ సునీత ప్రశ్నించారు. 

Updated : 30 Apr 2024 19:58 IST

పులివెందుల: వైఎస్సార్‌ వారసుడు జగన్‌ కానే కాదని వివేకా కుమార్తె సునీత అన్నారు. పులివెందుల ప్రజల్లో భయం నెలకొందని, మునుపటి స్వేచ్ఛ రావాలంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. వివేకా హత్య జరిగిన రోజు పరిణామాలు, ఆ తర్వాత దర్యాప్తు తీరును పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సునీత వివరించారు. హత్య జరిగిన రోజు ఉదయం 5గంటల సమయంలో జగన్‌ ఇంట్లో భేటీ జరిగిందని సునీత చెప్పారు. దీనిపై సీబీఐ దర్యాప్తు ఎందుకు పూర్తి చేయట్లేదో తెలియట్లేదన్నారు. హత్య జరిగిన రోజు వివేకా ఇంటి వద్ద నుంచి అవినాష్‌రెడ్డి ఫోన్లో మాట్లాడిన ఫొటోను ఆమె బయట పెట్టారు. ఆరోజు ఆయన ఎవరితో మాట్లాడారో కాల్‌ డేటా వివరాలను వెల్లడించారు.

అవినాష్‌రెడ్డికి అదే రోజు ఉదయం 6.26 గంటలకు ఫోన్‌ వచ్చింది. 6.27కి అవినాష్‌ వివేకా ఇంటి ప్రాంగణంలో ఉన్నారు. ఆయన ఇంటికి వచ్చినప్పుడు 10-15 మంది అక్కడ ఉన్నారు. కానీ, తాను వచ్చేసరికి 50-100 మంది ఉన్నట్లు అవినాష్‌ పోలీసులకు చెప్పారు. ఉదయం 6.32కి భారతి సహాయకుడు నవీన్‌తో 6 నిమిషాలపాటు అవినాష్‌ మాట్లాడారు. ఏం చెప్పారో తెలియట్లేదు. ఓఎస్‌డీ కృష్ణమోహన్‌, శివప్రకాశ్‌రెడ్డితోనూ అవినాష్‌ మాట్లాడారు. అంతసేపు ఫోన్‌లో మాట్లాడిన తర్వాత సాక్షి టీవీలో గుండెపోటు అని ఎలా వచ్చింది?ఫిర్యాదు ఇచ్చిన తర్వాత చేసిన ఫోన్‌కాల్స్‌లో ఏం మాట్లాడారు. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యలో హత్యా స్థలం క్లీన్‌ చేశారు. ఆధారాలు ఉన్నా.. ఇంకా దర్యాప్తు ఎందుకు పూర్తి చేయలేదో తెలియడం లేదు.

ఇప్పుడేమో నేను, మా వాళ్లు హత్య చేశామని చెబుతున్నారు. ఘటన తర్వాత వారిని కాని, మమ్మల్ని కానీ ఎందుకు అరెస్టు చేయలేదు. మేమిద్దరం కాకుండా మరెవరో అయితే ఎందుకు అరెస్టు చేయలేదు. 2019 మార్చి 15న ఏపీ డీజీపీ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేశారు. 2019 జూన్‌ 13న ఎస్పీ అభిషేక్‌ నేతృత్వంలో రెండో సిట్‌ ఏర్పాటు చేశారు. 2019 అక్టోబరు 16న ఎస్పీ అన్బురాజన్‌ నేతృత్వంలో మూడో సిట్‌ వేశారు. తొలి సిట్‌వేళ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేశారు.. ఒకరిని అరెస్టు చేశారు. రెండో సిట్‌ సమయంలో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయలేదు’’ అని సునీత వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని