logo

‘రాష్ట్రాన్ని జూద కేంద్రంగా మార్చారు’

సంక్రాంతి రోజున రాష్ట్రంలోని రైతులు తమను ఆదుకునేవారు లేక ఆవేదనాభరితులై ఉంటే, పండుగను అడ్డుపెట్టుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని జూద కేంద్రంగా మార్చిన ఘనతను జగన్‌మోహన్‌రెడ్డి

Published : 18 Jan 2022 05:07 IST

పాదయాత్రగా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వస్తున్న నక్కా ఆనందబాబు, ఇతర నాయకులు

తెనాలిటౌన్‌, న్యూస్‌టుడే: సంక్రాంతి రోజున రాష్ట్రంలోని రైతులు తమను ఆదుకునేవారు లేక ఆవేదనాభరితులై ఉంటే, పండుగను అడ్డుపెట్టుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని జూద కేంద్రంగా మార్చిన ఘనతను జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సొంతం చేసుకుందని తెదేపా నాయకుడు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం తెనాలిలో పాదయాత్ర నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కృత్రిమంగా యూరియా కొరతను సృష్టించి వైకాపా వారే వాటిని తిరిగి నల్లబజారులో అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలు, పంటలకు గిట్టుబాటు ధర, యూరియా, ఇతర ఎరువుల లభ్యత మొదలైన ఏ అంశం గురించి రైతు భరోసా కేంద్రాలు, అధికారుల వద్ద కాని రైతులకు ఎటువంటి సమాచారం అందడం లేదని, వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను అన్ని రకాలుగా దగా చేయడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం నడుస్తుందని, రైతులకు ఏం చేశారో ప్రభుత్వం బహిరంగంగా చెప్పగలదా? అంటూ సవాల్‌ చేశారు. రైతుల ఆవేదన ఊరికే పోదని, వారే ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడతారని విశ్లేషించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, యూరియాను సత్వరం అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ఏవో డి.మల్లిఖార్జునరావుకు వినతిపత్రం ఇచ్చారు. సమస్యలు పరిష్కారం కాకుంటే ఉద్యమ బాట తప్పదని స్పష్టం చేశారు. పలువురు నాయకులు ఆయన వెంట ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని