logo

ఆలయ ప్రతిష్ఠను ఇనుమడింపజేయాలి

దాసాంజనేయస్వామి దేవాలయ ప్రతిష్ఠ పెంపొందించేందుకు ధర్మకర్తల మండలి సభ్యులు పనిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ సూచించారు. స్థానిక మాచవరంలోని దాసాంజనేయస్వామి దేవాలయంలో గురువారం

Published : 28 Jan 2022 02:08 IST

సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ఏసీ సత్యనారాయణ, చిత్రంలో మంత్రి వెలంపల్లి,  ఎమ్మెల్యే విష్ణు, డిప్యూటీ మేయర్‌ శ్రీశైలజారెడ్డి

మాచవరం, న్యూస్‌టుడే : దాసాంజనేయస్వామి దేవాలయ ప్రతిష్ఠ పెంపొందించేందుకు ధర్మకర్తల మండలి సభ్యులు పనిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ సూచించారు. స్థానిక మాచవరంలోని దాసాంజనేయస్వామి దేవాలయంలో గురువారం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలకు అనుగుణంగా పని చేయాలన్నారు. నూతన మండలి సభ్యులకు డిప్యూటీ మేయర్‌ అవుతు శ్రీశైలజారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా కనపర్తి కొండలరావు (కొండా)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలుత మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. దాసాంజనేయస్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించారు. కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి నాగినేని భవాని, పలువురు కార్పొరేటర్లు, 26వ డివిజన్‌ వైకాపా ఇన్‌ఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

ధర్మకర్తల మండలి సభ్యులు : గోకవరపు నాగేశ్వరరెడ్డి, యక్కల మల్లికార్జునరావు, కగ్గా పాండురంగారావు, బండి లక్ష్మీమోహన నాగజ్యోతి, కోలా సురాంబ, యక్కల మారుతి, బాడిత సత్యవతి.

ప్రత్యేక ఆహ్వానితులు : పోలుకొండ శ్రీనివాసరావు, చిన్నం మధుబాబు, యర్రంశెట్టి శ్రీనివాసరావు, ప్రభల శ్రీనివాస్‌, ఏలూరు వెంకటేశ్వరరావు.

ప్రమాణ స్వీకారంలో గందరగోళం: దేవస్థానం ధర్మకర్తల మండలిలో తొమ్మిది మంది సభ్యులతో పాటు దేవస్థానం ప్రధాన అర్చకుడు ఎక్స్‌ అఫిషియోగా ఉంటారు. మొత్తం పది మంది ధర్మకర్తల మండలి సభ్యులతో పాటు మరో అయిదుగురి ప్రత్యేక ఆహ్వానితులతో కమిషనర్‌ హరి జవహర్‌లాల్‌ ఈ నెల 13వ తేదీన ఆర్సీ నెంబరు: బి3/12026 (56)3/2021గా ఆర్డరు విడుదల చేశారు. ఎక్స్‌ అఫిషియో సభ్యుడు కాకుండా, మిగిలిన తొమ్మిది మంది సభ్యుల్లో ఒకరు అన్యమతస్తుడు ఉన్నారని భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో కమిషనర్‌ కార్యాలయం విడుదల చేసిన ఆర్డర్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అన్యతస్తుడైన సభ్యుడి స్థానంలో మరొక అర్హతగల సభ్యుడిని పొందుపరిచే ప్రక్రియ చేపట్టింది. ఈ తరుణంలో హుటాహుటిన గురువారం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం, ఛైర్మన్‌ ఎంపిక జరగడం దేవాదాయశాఖ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు ఆలయ అధికారులే సదరు సభ్యుడికి మెడలో కండువాకప్పడం గమనార్హం. దీనిపై ప్రమాణ స్వీకారం చేయించిన అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణను వివరణ కోరగా.. సదరు సభ్యుడైన పారా దుర్గాప్రసాద్‌ (తండ్రి జోసఫ్‌) గైర్హాజరయ్యారని తెలపడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై దేవస్థానం కార్యనిర్వాహణాధికారి నాగినేని భవానిని ఫోన్‌ ద్వారా సంప్రదించగా.. అందుబాటులోకి రాలేదు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని