logo

సంక్షిప్త వార్తలు

ఉస్మానియా ఆసుపత్రిపై నియమించిన చీఫ్‌ ఇంజినీర్ల కమిటీ త్వరగా నివేదిక ఇవ్వాలని మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ..

Updated : 24 May 2022 01:37 IST

‘ఉస్మానియా’పై త్వరగా నివేదిక ఇవ్వాలి

ఇంజినీర్ల కమిటీకి మంత్రుల ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా ఆసుపత్రిపై నియమించిన చీఫ్‌ ఇంజినీర్ల కమిటీ త్వరగా నివేదిక ఇవ్వాలని మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం సోమవారమిక్కడ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీలతో కలిసి మంత్రులు.. చీఫ్‌ ఇంజినీర్ల కమిటీతో భేటీ అయ్యారు. హైకోర్టు సూచనలు, కమిటీ నివేదిక ప్రకారం హెరిటేజ్‌ భవనానికి ఇబ్బందులు కలగకుండా కొత్త నిర్మాణాలు చేపట్టడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామన్నారు. ఈ సందర్భంగా కమిటీకి పలు సూచనలు చేశారు.


ఒరిజినల్‌ డాక్యుమెంట్‌ను అప్పగించండి
 హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-1 తీర్పు

ఈనాడు, హైదరాబాద్‌: బీమా పత్రాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తీరుపై హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. వృద్ధురాలిని ఇబ్బంది పెట్టినందుకు రూ.20వేలు చెల్లించాలని ఆదేశించింది. డాక్యుమెంట్‌ను కమిషన్‌లో అప్పగించాలని తీర్పు వెలువరించింది. సంజీవ్‌రెడ్డినగర్‌కు చెందిన ఫిర్యాదీ పి.వి.మణి(61) ఎల్‌ఐసీ సంస్థలో బీమా కిరణ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకున్నారు. ఈ మేరకు రూ.757 సంవత్సర ప్రీమియం కింద మొత్తం 25 సంవత్సరాలు కడితే చివర్లో రూ.50 వేలు, తదుపరి 10 సంవత్సరాలు ఎలాంటి ప్రీమియం లేకుండానే బీమా పొందే సదుపాయం ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో 1994 ఆగస్టు 1న పాలసీ తీసుకున్నారు. 25 సంవత్సరాల ప్రీమియం డబ్బులు ఫిర్యాదీ చెల్లించారు. 2019 ఆగస్టు 22తో ఆ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఒరిజినల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కాగితాలను సదరు సంస్థకు అప్పగించగా మెచ్యూరిటీ లబ్ధి కింద రూ.30,280 చెల్లించారు. అనంతరం మరో 10 సంవత్సరాల బీమా రావాల్సి ఉందని ఒరిజినల్‌ పాలసీ కాగితాలు ఇవ్వాలని ప్రతివాద సంస్థను కోరగా స్పందించలేదు. దీంతో ఫిర్యాదీ హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. బషీర్‌బాగ్‌లోని ఎల్‌ఐసీ హైదరాబాద్‌ డివిజన్‌ కార్యాలయాన్ని ప్రతివాదిగా చేర్చారు. స్పందించిన ప్రతివాద సంస్థ బీమా కాగితాలను ఫిర్యాదీకి పంపామని.. అయితే తప్పుడు చిరునామా ఇవ్వడంతో అవి తిరిగి కార్యాలయానికే వచ్చాయని తెలిపింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-1 బెంచ్‌ అధ్యక్షురాలు బి.ఉమా వెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మీప్రసన్నతో కూడిన బెంచ్‌ ఎల్‌ఐసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదీ మానసిక వేదనకు పరిహారంగా రూ.15 వేలు, కేసు ఖర్చులు రూ.5వేలు చెల్లించడంతో పాటు ఒరిజినల్‌ పాలసీ డాక్యుమెంట్‌ను కమిషన్‌కు అప్పగించాలని అనంతరం ఫిర్యాదీ దాని సర్టిఫైడ్‌ కాపీని ఇచ్చి తీసుకోవచ్చని సూచించింది. 45 రోజుల్లో తీర్పును అమలు చేయాలని ప్రతివాద సంస్థను ఆదేశించింది.


ద్విచక్రవాహనంపై నుంచి జారిపడి వ్యక్తి మృతి

కొడంగల్‌: రావల్‌పల్లి జంక్షన్‌ వద్ద ద్విచక్ర వాహనంపైనుంచి జారి పడి ఒకరు మృతి చెందారు. ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. గుర్మిటకల్‌ తాలూకా గుండ్లకుంట గ్రామానికి చెందిన బాబుమియా (50), మాడేపల్లి బుగ్గప్ప కలిసి తాండూరు నుంచి సొంత గ్రామానికి వాహనంపై వెళ్తున్నారు. కొడంగల్‌ మండలం రావల్‌పల్లి గ్రామ సమీపానికి చేరుకోగానే.. వారిలో వెనక కుర్చోన్న బాబుమియా జారిపడి కింద పడ్డాడు. సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.


అక్రమ నిర్మాణం కూల్చివేత

శంకర్‌పల్లి, న్యూస్‌టుడే: నాలా, బఫర్‌ జోన్‌లలో అక్రమంగా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శంకర్‌పల్లి ఆర్‌ఐ విక్రమ్‌రెడ్డి అన్నారు. టంగటూర్‌ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నం:300లోని బఫర్‌ జోన్‌లో నిర్మిస్తున్న అక్రమ ప్రహరీని సోమవారం రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలించి కూల్చివేశారు. ఎవరైనా నాలా, బఫర్‌ జోన్‌లలో నిర్మాణాలు చేపడితే తహసీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలన్నారు.


బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌

పూడూరు: బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని మహిళా ఐక్యకార్యాచరణ సమితి సభ్యులు డిమాండ్‌ చేశారు. పూడూరు మండల పరిధిలోని ఓ గ్రామంలో మద్యం తాగించి ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారం జరపగా, మరొకరు అత్యాచార యత్నం జరిపిన విషయం తెలిసిందే. ఆ బాలిక కుటుంబాన్ని మహిళా, మానవ హక్కుల సంఘాల నేతలు సంధ్య, ఖలీదా, పర్వీన్‌, సత్యవతి, సుజాత సూరేపల్లి, దీప్తి, గీతా, మజీద్‌, ఖలీద్‌ తదితరులు పరామర్శించారు. అనంతరం స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని