కమల దళానికి ప్రత్యామ్నాయమేది?

భయాలు, అపోహల మూలంగా భాజపాతో పెంచుకున్న మానసిక దూరాన్ని తెంచుకుని మైనారిటీలు తమకు మద్దతు తెలపాలని 2004లో భాగ్యనగరం వేదికగా సాగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కమలదళం

Published : 04 Jul 2022 00:13 IST

భయాలు, అపోహల మూలంగా భాజపాతో పెంచుకున్న మానసిక దూరాన్ని తెంచుకుని మైనారిటీలు తమకు మద్దతు తెలపాలని 2004లో భాగ్యనగరం వేదికగా సాగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కమలదళం పిలుపిచ్చింది. మతపరమైన వివాదాలు, అవి రాజేస్తున్న ఉద్రిక్తతల వల్ల గతంతో పోలిస్తే ఉభయ పక్షాల నడుమ ఆ ‘దూరం’ నేడు ఇంకా అధికమైంది. భారతీయ సంవిధానం, లౌకికవాద విలువల పట్ల నిజమైన విశ్వాసం చూపుతూ... అంతరాలకు అతీతంగా ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ... వ్యక్తిగత విశ్వాసాలు, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇచ్చే ప్రజాస్వామ్య రాజ్య నిర్మాణమే తన లక్ష్యమని పార్టీ రాజ్యాంగంలో స్వయంగా భాజపాయే రాసుకుంది. ఆ ఆదర్శాలకు భిన్నంగా కాషాయ శిబిరం వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో- తాజాగా హైదరాబాద్‌లో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ భేటీ జరిగింది. రాబోయే మూడు నాలుగు దశాబ్దాల కాలం తనదేనని అది ఘనంగా తీర్మానించింది. కుటుంబ, కుల, బుజ్జగింపు రాజకీయాలను ఛీత్కరించిన కమలదళం- భవిష్యత్తులో తెలంగాణ, పశ్చిమ్‌బెంగాల్‌, ఏపీ, తమిళనాడు, కేరళ, ఒడిశాలలో అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తంచేసింది. పనితీరు, అభివృద్ధి ఆధారిత రాజకీయాల పట్ల దాని చిత్తశుద్ధి ప్రకటన వినసొంపుగా ఉంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని పుణికిపుచ్చుకున్న భారతీయ సంస్కృతికి పట్టంకడుతూ పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ రూపొందించిన ‘ఏకాత్మ మానవతావాదాన్ని’ (ఇంటెగ్రల్‌ హ్యూమనిజం) తన సిద్ధాంతంగా స్వీకరించిన భాజపా- నేడు దానికి ఎంతవరకు విలువిస్తోంది? ‘మాతో ఏకీభవించని వాళ్లను ఏనాడూ మా శత్రువులుగా పరిగణించలేదు... మాతో రాజకీయంగా విభేదించిన వాళ్లకు జాతివ్యతిరేకుల ముద్ర వేయలేదు... మేము నేర్చుకున్న భారతీయ జాతీయవాదం అది కాదు’ అని అతిరథుడు ఆడ్వాణీ హితవు చెప్పాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? నిష్పక్షపాతంగా దాన్ని సమీక్షించుకోవడంతో పాటు తన విలక్షణతను విడనాడి కాంగ్రెస్‌ అవలక్షణాలను అలవరచుకుందన్న అపప్రథను కమలదళం తొలగించుకోవాలి. ప్రధాని మోదీ అభిలషించినట్లుగా భాజపా అందరికీ చేరువ కావాలంటే- సర్వధర్మ సమభావాన్ని పాటిస్తూ విలువలతో కూడిన రాజకీయాలే చేస్తామన్న స్వీయ హామీకి అది కట్టుబడాలి!

‘వరస విజయాలు సాధిస్తున్నాం... మమ్మల్ని అడ్డుకోవడం ఎవరికైనా దుర్లభమే’నని భాజపా నాయకులు గొప్పగా ప్రకటిస్తున్నారు. అది వాళ్ల ఆత్మవిశ్వాసమో, అతిశయమో అయితే కావచ్చు కానీ- ఆ ఏకచ్ఛత్రాధిపత్యం దేశ భవితకు శ్రేయస్కరం కాదు. దీటైన విపక్షం లేనందువల్లే కాంగ్రెస్‌లో నియంతృత్వ ధోరణులు పెచ్చరిల్లినట్లుగా విశ్లేషించిన శ్యామాప్రసాద్‌ ముఖర్జీ- ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనసంఘ్‌కు ప్రాణంపోశారు. 1990ల వరకు కాంగ్రెస్‌ చుట్టూ పరిభ్రమించిన దేశ రాజకీయాలకు ఇప్పుడు భాజపా ప్రధాన కేంద్రమైంది. వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో కాషాయ పతాకాన్ని ఎగరవేయాలన్న అధిష్ఠానం ఆలోచనలకు అనుగుణంగా అది అంతకంతకూ విస్తరిస్తోంది. అధికారపక్షం విధానాలను నిశితంగా గమనిస్తూ, దాని ప్రజావ్యతిరేక ధోరణులను గట్టిగా నిలదీసే ప్రత్యర్థి పక్షాలకు ముఖంవాసిన ఏ దేశంలోనైనా సరే- జనస్వామ్య స్ఫూర్తి కాగితాల్లోనే పరిఢవిల్లుతుంది. ప్రజాతంత్ర ప్రమాణాల పట్ల నిబద్ధత కలిగిన సమర్థ ప్రతిపక్షాలు రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో నేడు చాలా అవసరం. కాంగ్రెస్‌తో పాటు వివిధ పార్టీలన్నీ పదవులకోసమే వెంపర్లాడుతూ ప్రజాసేవకు అర్థం మార్చేస్తున్నాయన్నది వాస్తవం. కనీస ఉమ్మడి ప్రణాళికతో దేశ సమస్యలకు ప్రత్యామ్నాయ పరిష్కారాలు ప్రతిపాదిస్తూ, జనావళి విశ్వాసాన్ని పొందగలిగే బలమైన ప్రతిపక్ష కూటమి పురుడు పోసుకునే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. దేశీయంగా జనస్వామ్య రథ ప్రస్థానం సాఫీగా సాగాలంటే- ప్రజాప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సరికొత్త రాజకీయాలు మొగ్గ తొడగాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.