icon icon icon
icon icon icon

చేవెళ్ల

Published : 01 Apr 2024 18:47 IST

లోక్‌సభ నియోజకవర్గం

తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో చేవెళ్ల కూడా ఒకటి.  నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో చేవెళ్ల స్థానం ఏర్పాటైంది. అంతకు ముందు పశ్చిమ రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉండేవి. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా పశ్చిమ జిల్లాలోని 7 నియోజకవర్గాలతో చేవెళ్ల లోక్‌సభ స్థానం ఏర్పడింది. పట్టణ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుకొని మల్కాజ్‌గిరి లోక్‌సభ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది జనరల్‌ కేటగిరిలో ఉంది.

లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

2009 లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి జితేందర్‌రెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి సూదిని జైపాల్‌రెడ్డి విజయం సాధించారు.  కేంద్ర మంత్రి వర్గంలో పట్టణాభివృద్ధిశాఖ, పెట్రోలియంశాఖ, సాంకేతికశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కార్తీక్‌రెడ్డిపై తెరాసకు చెందిన విశ్వేశ్వర్‌రెడ్డి 70వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.  ఇక 2019 ఎన్నికల్లో తెరాస అభ్యర్థి రంజిత్‌రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం భాజపా నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రంజిత్‌రెడ్డి, భారాస నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌లు పోటీలో ఉన్నారు.

శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు భారాస..

రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో భారాస కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ లోపే లోక్‌సభ ఎన్నికలు రావడం, ఓటమి భారం నుంచి శ్రేణులు ఇంకా కోలుకోకపోవడంతో వారిలో ఆత్మవిశ్వాసం నింపే దిశగా అధిష్ఠానం చర్యలు చేపట్టింది. మేమున్నామంటూ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి భరోసా నింపింది. ఐదేళ్ల అనంతరం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, అధైర్యపడవద్దని నమ్మకం కలిగిస్తోంది. జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడం వంటి పరిణామాలు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కాసాని జ్ఞానేశ్వర్‌కు భారాస ఎంపీ టికెట్‌ కేటాయించింది.

ఆధిక్యత చాటేందుకు కాంగ్రెస్‌

విజయమే లక్ష్యంగా జిల్లాలోని పరిగి, వికారాబాద్‌, తాండూరు నియోజకవర్గాల్లో ఆధిక్యత చాటేలా కాంగ్రెస్‌ కార్యాచరణ చేపట్టింది. ఈ సందర్భంగా పరపతి, పలుకుబడి ఉన్న నేతలతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో వికారాబాద్‌లో 26,500, పరిగిలో 24,300 కాంగ్రెస్‌కు ఆధిక్యత వచ్చింది. తాండూరులో మాత్రం భారాసకు 1,250 ఓట్ల స్వల్ప ఆధిక్యత వచ్చింది. ఇతర పార్టీల్లోని కీలక నాయకులపై హస్తం పార్టీ దృష్టి సారించింది. శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీని వీడిన వారిని తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌లో చేరేందుకు ఈ ఎన్నికలను అవకాశంగా తీసుకోవాలని పలువురు ప్రతిపక్ష నాయకులు పార్టీ మారేందుకు సమాలోచనలు చేస్తున్నారు. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలను చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీలోకి వచ్చిన రంజిత్‌రెడ్డికి కాంగ్రెస్‌ టికెట్‌ కేటాయించింది. గత ఎన్నికల్లో భారాస నుంచి పోటీ చేసిన గెలిచిన రంజిత్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలిచారు.

భాజపాలో సమరోత్సాహం..

కాషాయ జెండా ఎగురవేయాలన్న సమరోత్సాహంతో అవసరమైన వ్యూహానికి భాజపా రూపకల్పన చేస్తోంది. భారీ సభలతో సంబంధం లేకుండా, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ప్రజల మధ్యే ఉండేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. భారాస ముఖ్యనేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాండూరు నియోజకవర్గంలో భారాసకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రధాని మోదీ చరిష్మాతో పాటు, కేంద్ర ప్రభుత్వ పని తీరును ప్రచారాస్త్రాలుగా సంధిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న అదృశ్య మిత్రుల సహకారం కలిసి వచ్చే అంశంగా భాజపా భావిస్తోంది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి టికెట్‌ కేటాయించింది.

  • గత ఎన్నికల్లో నుంచి గెలుపొందిన అభ్యర్థలు..
  • 2009 - జైపాల్‌రెడ్డి (కాంగ్రెస్‌)
  • 2014 - కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (తెరాస)
  • 2019- జి. రంజిత్‌రెడ్డి (తెరాస)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img

లైవ్‌ టీవీ

తెలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ +

నోటిఫికేషన్‌ 18/04/2024
నామినేషన్లకు చివరి తేదీ 25/04/2024
నామినేషన్ల పరిశీలన 26/04/2024
ఉపసంహరణ 29/04/2024
పోలింగ్‌ తేదీ 13/05/2024
ఓట్ల లెక్కింపు 04/06/2024
పూర్తి షెడ్యూల్
img