icon icon icon
icon icon icon

కొడాలి నాని నామినేషన్‌పై ప్రతిష్టంభనే

గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి నాని అభ్యర్థిత్వంపై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్‌ ప్రస్తుతానికి ఆమోదం పొందినా చివరి వరకు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది.

Updated : 28 Apr 2024 08:30 IST

అఫిడవిట్‌లో లోపాలపై ఆధారాల సమర్పణ
లోపాన్ని కప్పిపుచ్చేందుకు మల్లగుల్లాలు

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-గుడివాడ గ్రామీణం: గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి నాని అభ్యర్థిత్వంపై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్‌ ప్రస్తుతానికి ఆమోదం పొందినా చివరి వరకు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. ఈ వ్యవహారంపై కృష్ణా జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి డీకే బాలాజీ... పూర్తి నివేదిక ఇవ్వాలని గుడివాడ ఆర్డీవో పద్మావతిని కోరారు. నామినేషన్ల పరిశీలన సందర్భంగా తలెత్తిన పరిణామాలపై ఆమె కలెక్టర్‌కు నివేదికను సమర్పించారు. ఆధారాలు సమర్పించాలని తెదేపా సభ్యులకు నోటీసులు జారీచేసిన ఆర్వో.. మరోవైపు వైకాపా అభ్యర్థి కొడాలి నానికీ నోటీసులిచ్చారు. దీంతో అద్దె భవనం వ్యవహారాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అద్దె చెల్లింపు పత్రాల సృష్టి?

నోటీసులకు నాని వివరణ ఇచ్చినట్టు సమాచారం. తెదేపా నేతలు ఎత్తిచూపిన లోపాల్లో ప్రధానమైన పాత మున్సిపల్‌ కార్యాలయాన్ని.. తాను లీజుకు తీసుకుని అద్దె చెల్లించినట్టు పత్రాలు సృష్టించారని తెలిసింది. మున్సిపల్‌ కమిషనర్‌ నుంచి ఈ మేరకు పత్రాలను తీసుకున్నట్టు సమాచారం. తాను బకాయి లేకపోవడం వల్లే.. అఫిడవిట్‌లో దాన్ని పొందుపరచలేదని వివరణ ఇచ్చినట్టు తెలిసింది. కానీ.. ప్రభుత్వ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నా ఆ వివరాలనూ కచ్చితంగా అఫిడవిట్‌లో నమోదుచేయాలని తెదేపా నేతలు చెబుతున్నారు. అంతే తప్ప.. నో అని పెట్టడమేంటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఆధారాల సమర్పణ

కొడాలి నాని నామినేషన్‌ పత్రాల్లో అభ్యంతరాలకు తగిన ఆధారాలు సమర్పించాలని ఆర్వో పద్మావతి తెదేపాకు నోటీసులు జారీచేశారు. దాంతో వారు శనివారం ఆధారాలు అందజేశారు. తెదేపా నేతలు ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, తులసిబాబు, హైకోర్టు న్యాయవాది అరవింద్‌ కలిసి గుడివాడ ఆర్వో కార్యాలయానికి వెళ్లి తమ అభ్యంతరాలను ఆధారాలతో ఆర్వోకు సమర్పించారు. పాత మున్సిపల్‌ కార్యాలయాన్ని గత ఐదేళ్లుగా నాని వినియోగించారనేందుకు ఆధారాలను ఇచ్చారు. నాని నామినేషన్‌ అఫిడవిట్‌లోని 17వ పేజీలో ప్రభుత్వ అకామడేషన్‌ను వాడుకోలేదంటూ నో అని పెట్టడం.. నిబంధనల ప్రకారం తప్పని చెప్పారు. ఐదేళ్లు ప్రభుత్వ భవనాన్ని నాని వాడుకున్నారని మున్సిపల్‌ కమిషనర్‌ ధ్రువీకరించిన పత్రాలనూ తెదేపా నేతలు అందజేశారు. దీని ఆధారంగా నానిని అనర్హుడిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై అధికారుల స్పందనను బట్టి.. తాము న్యాయపోరాటం చేస్తామని రావి వెంకటేశ్వరరావు, తులసి వెల్లడించారు.


ఆధారాలతో సహా లోపాలు తెలియజేశాం

- రావి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, గుడివాడ

నామినేషన్‌ పత్రాల పరిశీలన సందర్భంగా మేం లేవనెత్తిన లోపాలకు సంబంధించిన వివరాలు, ఆధారాలను ఆర్వోకు అందజేశాం. మేము శుక్రవారమే ఈ లోపాలను ఆర్వో దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా.. ఆమె కొడాలి నాని ప్రలోభాలకు లొంగిపోయి మేం చెప్పేది వినిపించుకోలేదు. మమ్మల్ని బయటకు పొమ్మని, కేసులు పెడతామని బెదిరించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో.. ఎట్టకేలకు మా అభ్యంతరాలకు ఆధారాలు చూపించాలంటూ నోటీసులు ఇచ్చారు. అలా ఇచ్చారంటేనే తప్పు జరిగినట్టు అర్థమవుతోంది కదా. గత 20 ఏళ్లుగా కొడాలి నాని గుడివాడను సర్వనాశనం చేశాడు. ఈ ఎన్నికల్లో ఆయన్ను వదిలించుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని మాకు రక్షణ కల్పించి, గుడివాడలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి.


హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాం

- తులసిబాబు, తెదేపా నేత

కొడాలి నాని అఫిడవిట్‌లో లోపాలున్నా ఆర్వో వత్తాసు పలకడంపై ఇప్పటికే హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశాం. గుడివాడను మట్టిమాఫియా, ఇసుక దోపిడీ, జూదశాలలు, బెట్టింగ్‌ ముఠాలకు కేంద్రంగా నాని మార్చేశారు. అందుకే ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయింది. ఆర్వో తనకున్న అధికారాన్ని ఉపయోగించుకుని.. నానికి వత్తాసు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img