icon icon icon
icon icon icon

Harish rao: అభివృద్ధి, సంక్షేమమే భారాస బలం

‘ఉమ్మడి జిల్లాలో కేసీఆర్‌ అంటే నమ్మకం ఎక్కువ. ఈ ప్రాంత బిడ్డ కావడంతో సానుకూల ఫలితాలు తప్పక రానున్నాయి. మా పార్టీకి రైతులు బ్రాండ్‌ అంబాసిడర్లు. దేశంలో కాంగ్రెస్‌, భాజపాలు ఇవ్వని విధంగా బీడీ కార్మికులకు పింఛన్ల మొత్తాన్ని రూ.2 వేల నుంచి రానున్న రోజుల్లో రూ.5 వేలకు పెంచుతాం.

Updated : 21 Nov 2023 09:28 IST
కాంగ్రెస్‌ వస్తే కరవు తాండవమే..
‘న్యూస్‌టుడే’తో మంత్రి హరీశ్‌రావు
న్యూస్‌టుడే, సిద్దిపేట
‘ఉమ్మడి జిల్లాలో కేసీఆర్‌ అంటే నమ్మకం ఎక్కువ. ఈ ప్రాంత బిడ్డ కావడంతో సానుకూల ఫలితాలు తప్పక రానున్నాయి. మా పార్టీకి రైతులు బ్రాండ్‌ అంబాసిడర్లు. దేశంలో కాంగ్రెస్‌, భాజపాలు ఇవ్వని విధంగా బీడీ కార్మికులకు పింఛన్ల మొత్తాన్ని రూ.2 వేల నుంచి రానున్న రోజుల్లో రూ.5 వేలకు పెంచుతాం. ప్రజలు ఏబుల్‌ లీడరు - స్టేబుల్‌ గవర్నమెంట్‌ను (సమర్థవంతమైన నాయకుడు - స్థిరమైన ప్రభుత్వాన్ని) కోరుతున్నారు. కాంగ్రెస్‌ది శృతిలేని సంసారం లాంటిది. గ్రూపులు, ముఠా తగాదాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుంది. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ చేతుల్లో ఉండటం ఎంతో సురక్షితమని ప్రజలు భావిస్తున్నారు’ అని మంత్రి హరీశ్‌రావు వివరించారు. రైతుబంధు పథకాన్ని, ధరణి పోర్టల్‌ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నారు. ఆయా అంశాలపై ప్రజల్లో చర్చ పెడుతున్నామన్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆయనతో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది.
మ్మడి జిల్లాలో పలువురు భారాస అభ్యర్థులు వరుసగా రెండుసార్లు గెలిచిన వారే. మరికొందరు రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎలాంటి ప్రచార వ్యూహాలతో ముందుకెళుతున్నారు?
అభ్యర్థుల ప్రకటనలో భారాస పార్టీ చాలా ముందంజలో నిలిచింది. అన్ని రాజకీయ పార్టీల్లో గ్రూపుల కుమ్ములాటలున్నాయి. పటాన్‌చెరు, నర్సాపూర్‌ నియోకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ ఆశించిన గాలి అనిల్‌కుమార్‌, పటాన్‌చెరు, సంగారెడ్డిలో భాజపా నుంచి టికెట్‌ ఆశించిన శ్రీకాంత్‌గౌడ్‌, రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, నర్సాపూర్‌లో భాజపా నుంచి టిక్కెట్‌ ఆశించిన గోపి, నారాయణఖేడ్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి, బాబూమోహన్‌ కుమారుడు ఉదయభాస్కర్‌ భారాసలో చేరడం మా బలాన్ని మరింత పెంచింది. మా పార్టీలో కలిసికట్టుగా పని చేస్తున్నాం.
భారాస మ్యానిఫెస్టో ప్రజల్లోకి ఏ మేరకు వెళ్లింది? ఎలాంటి స్పందన వస్తోంది?
ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యవసాయ ఆధారితమైంది. కాంగ్రెస్‌ ఒక వేళ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు తప్పవని రైతులు భావిస్తున్నారు. మ్యానిఫెస్టోలో రూ.5 వేలకు ఆసరా పింఛను పెంపు, సౌభాగ్యలక్ష్మి కింద పేద మహిళలకు రూ.3 వేలు, రూ.400కే గ్యాస్‌ సిలిండరు, రూ.16 వేలకు రైతుబంధు సాయం పెంపు, అగ్రకులాల్లోని పేదలకు గురుకులాలు, అసైన్డ్‌ భూములను పట్టా భూములుగా మార్చడం తదితర అంశాలను పొందుపర్చాం. ప్రజల్లో ఎక్కడ చూసినా వీటిపైనే చర్చ జరుగుతోంది. మా అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారు.
కొన్ని నియోజకవర్గాలపై ఉన్న కర్ణాటక ప్రభావాన్ని ఎలా ఎదుర్కొంటారు?
ఆ రాష్ట్రంతో అనుసంధానమైన ప్రాంతాలు ఉండటం మాకు కలిసొచ్చే అంశం. అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్యారంటీల అమల్లో విఫలమైంది. ఇక్కడ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటే నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌ వస్తే కరవు తాండవిస్తుందని ప్రజలు భయపడుతున్నారు.
పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా విస్తృతంగా పర్యటిస్తున్నారు. సిద్దిపేటలో ప్రచారాన్ని ఎలా సమన్వయం చేసుకుంటున్నారు?
ప్రజలకు ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటాను. ఓట్ల కోసమే కాకుండా మరునాడే ఎన్నికలు అన్నట్టుగా నియోజకవర్గంలో పనిచేస్తాను.సిద్దిపేట కార్యకర్తలు, ప్రజలు గొప్పవారు. ప్రస్తుతం రాష్ట్రంలో బిజీగా మారిన నేపథ్యంలో వారే అభ్యర్థులుగా మారి నా కోసం పని చేస్తున్నారు. అంతమంచి కార్యకర్తలు, ప్రజలు లభించడం నా పూర్వజన్మ సుకృతం. సమయోచితంగా శ్రేణులను దిశానిర్దేశం చేస్తూ చురుగ్గా ప్రచారం సాగేలా సమన్వయం చేసుకుంటున్నా. ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చి మద్దతు చెబుతున్నారు.
మీ పార్టీ అభ్యర్థుల గెలుపునకు ఏయే అంశాలు దోహదపడతాయి?
రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులకు 11 విడతల్లో రూ.73 వేల కోట్లు రైతుబంధు సాయం అందించాం. సకాలంలో ఎరువులు, నాణ్యమైన విద్యుత్తు, ప్రతి గ్రామానికి కాంటాలు పెట్టి తంటాలు లేకుండా వడ్ల సేకరణ చేస్తున్నాం. రెండు పంటలు పక్కాగా పండుతున్నాయి. వారంతా మా వైపే. 47 లక్షల మంది ఆసరా పింఛను లబ్ధిదారులు ఏకపక్షంగా కేసీఆర్‌ను పెద్దకొడుకుగా భావిస్తున్నారు. 13.50 లక్షల కల్యాణలక్ష్మి లబ్ధిదారుల కుటుంబాలు కేసీఆర్‌ వైపు చూస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా నాణ్యమైన వైద్యం లభిస్తోంది. శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నాం. పొగాకు ఉత్పత్తులపై గతంలో పుర్రె గుర్తు పెట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఐదు శాతం జీఎస్టీ వేసి బీడీ కార్మికుల పొట్ట కొట్టింది భాజపా ప్రభుత్వం. మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాల్లో రాష్ట్రంలో 6 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు. విదేశీ విద్యా నిధి పథకం కింద విద్యార్థులకు రూ.20 లక్షలు అందిస్తున్నాం. ఇప్పటికి 6 వేల మందికి అందించాం.
యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల సాధికారతకు ప్రణాళికలు?
కల్యాణలక్ష్మి ద్వారా అండగా ఉంటున్నాం. కేసీఆర్‌, న్యూట్రిషన్‌ కిట్లు పంపిణీ చేస్తున్నాం. బాలికలు, యువతులకు 50 శాతం గురుకులాలు, వివిధ రకాల కళాశాలలు కొనసాగుతున్నాయి. మహిళలకు పింఛన్లు అమలు చేస్తున్నాం. సౌభాగ్యలక్ష్మితో జీవనభృతి అందజేస్తాం. సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడంతో మహిళలకు ఉపాధి లభిస్తోంది. న్యాక్‌, సెట్విన్‌, తదితర శిక్షణ కేంద్రాల ద్వారా తర్ఫీదు ఇప్పిస్తున్నాం. జహీరాబాద్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్‌, మెదక్‌, తూప్రాన్‌, మనోహరాబాద్‌ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఐటీ టవర్లను తీసుకొస్తాం.
ఉమ్మడి మెదక్‌ జిల్లా బాధ్యులుగా ఎలాంటి కార్యాచరణ రూపొందించుకున్నారు?
నియోజకవర్గాలను సమదృష్టితో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేకతను బట్టి కార్యాచరణ ఉంటుంది. భారాస ప్రభుత్వ పథకాలు ప్రజలకు పక్కాగా ఎలా అందించ గలుగుతున్నామో ప్రచారంలో వివరిస్తున్నాం. ఇతర పార్టీల్లోనూ మా కార్యక్రమాలను ఇష్టపడేవారున్నారు. వారిని గుర్తించి చేర్చుకొని ప్రాధాన్యం ఇవ్వనున్నాం. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. జనం అవసరాన్ని గుర్తించి ఎలా పరిష్కరించ నున్నామో చెబుతున్నాం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img