icon icon icon
icon icon icon

Pawan Kalyan: జూదం క్లబ్బులు కావాలా...? డీఎస్సీ నోటిఫికేషన్‌ కావాలా?: పవన్‌

వైకాపా ఓటమి తథ్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జూదం ఆడుకునే క్లబ్బులు కావాలా? డీఎస్సీ నోటిఫికేషన్‌ కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. 

Updated : 29 Apr 2024 20:32 IST

గణపవరం: వైకాపా ఓటమి తథ్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జూదం ఆడుకునే క్లబ్బులు కావాలా? డీఎస్సీ నోటిఫికేషన్‌ కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందకపోయినా.. జూదం, మద్యం, ఇసుక దోపిడీలో బాగా అభివృద్ధి చెందిందని ఎద్దేవా చేశారు. జగన్‌ హయాంలో 3.80 లక్షల మంది విద్యార్థులు పాఠశాల మానేశారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లా గణపవరంలో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్‌ ప్రసంగించారు. 

ఒక్క ఛాన్స్‌ అని.. నట్టేట ముంచేశారు

‘‘ఒక్క ఛాన్స్‌ అంటే.. నమ్మి అందరూ ఓట్లేశారు. అలాంటి ప్రజలను జగన్‌ నట్టేట ముంచేశారు. రాష్ట్రం మాఫియా మయమైపోయింది. ఎక్కడ చూసినా గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో ఐదేళ్లలో 62వేల మంది విద్యార్థులు చనిపోయారు. వారికిచ్చే చిక్కి ప్యాకెట్ల మీద కూడా రూ. 67 కోట్లు దోచేశారు. పిల్లలకు ఇచ్చే పుస్తకాల మీద కూడా జగన్‌ ఫొటో ముద్రిస్తున్నారు. ఐదేళ్ల నుంచి బెయిల్‌పై ఉన్న వ్యక్తి జగన్‌.. ఇలాంటి వ్యక్తి ఇవాళ పోలీసులపై పెత్తనం చేస్తున్నారు. సీఎం స్థానంలోని వ్యక్తి సరైనవారా కాదా అని ప్రజలు ఆలోచించాలి. దోపీడీ చేసే రాజకీయ నాయకులకు ఏం పని? ఎంత ఆదర్శవాదం ఉన్నా క్రిమినల్స్‌ను భూజాన పెట్టుకోవద్దు

సీపీఎస్‌కు పరిష్కారం చూపిస్తా

మన సమాజంలో గురువులకు ఎంతో ఉన్నత స్థానం ఉంది. అలాంటి గురువులతో మరుగుదొడ్లు శుభ్రం చేయించారు.. మద్యం షాపుల వద్ద కాపలా కాయించారు. ఒక ఉద్యోగిగా చెబుతున్నా.. అసెంబ్లీలోకి అడుగుపెట్టగానే సీపీఎస్‌కు పరిష్కారం చూపిస్తా. వైకాపా గూండాలకు చెబుతున్నా.. మా కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకోను. తెగించి కూర్చున్నా.. తాటాకు చప్పుళ్లకు భయపడను. అప్పటికి వినకపోతే ప్రభుత్వం వచ్చాక వారి తాట తీసి రోడ్లపై తిప్పిస్తా. జగన్‌ ఫ్యాన్‌కి సౌండ్‌ ఎక్కువ.. గాలి తక్కువ.

వైకాపా నేతలకు భూముల పిచ్చి

ఉంగుటూరులో మట్టి అమ్ముకునే వారు కాదు.. ధర్మరాజులాంటి బలమైన నాయకుడు కావాలి. దేవుడు భూములు లాక్కొని కనీసం లీజు కూడా చెల్లించట్లేదు. వైకాపా నాయకులకు భూముల పిచ్చి ఎక్కువైంది. కానీ, ఎవరైనా ఈ మట్టిలో కలిసిపోవాల్సిందే. కొల్లేరులో కాంటూరు సమస్య కారణంగా చేపల చెరువుల వాళ్లు ఇబ్బంది పడుతుతున్నారు. కాంటూరు లెక్కలు తేల్చే బాధ్యత మాది. కొల్లేరు సరస్సు కలుషితం కాకుండా మేం బాధ్యత తీసుకుంటాం. పేరుకే ఇది డెల్టా ప్రాంతం.. కానీ, తాగడానికి నీళ్లు ఉండవు. వైకాపా ఊరూరా మద్యం అమ్మిస్తోంది.. కానీ, ఇంటికి మంచి నీళ్లు ఇవ్వట్లేదు. ఆక్వా రైతాంగానికి తీవ్ర అన్యాయం జరిగింది. నాణ్యమైన రొయ్య పిల్లలు రైతులకు అందట్లేవు. రొయ్యల ధరలు కూడా దారుణంగా పడిపోయాయి. ప్రస్తుత ఎమ్మెల్యే వాసుబాబు మళ్లీ కావాలా వద్దా మీరే ఆలోచించుకోండి. ఒక ఎమ్మెల్యే అయి ఉండి తన ఇంటికే రోడ్లు వేయించుకోలేని వ్యక్తి మనకు రోడ్లు ఏం వేయిస్తాడు?’’అని పవన్‌ ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img