icon icon icon
icon icon icon

ఖమ్మం

ఖమ్మం లోక్‌సభ స్థానం ఆది నుంచి ఇది జనరల్‌ కేటగిరిలోనే ఉంది.

Updated : 26 Apr 2024 16:21 IST

తెలంగాణలోని 17 లోక్‌సభా స్థానాల్లో ఖమ్మం ఒకటి. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడింది.

లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు: ఖమ్మం, వైరా(ఎస్టీ), మధిర(ఎస్సీ), కొత్తగూడెం, అశ్వారావుపేట(ఎస్టీ),  సత్తుపల్లి(ఎస్సీ), పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో అత్యధిక సార్లు కాంగ్రెస్‌ విజయం సాధించగా, పీడీఎఫ్‌, సీపీఐ, తెదేపా, వైకాపా అభ్యర్థులు ఒక్కోసారి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తెరాస తరపున పోటీ చేసిన నామా నాగేశ్వరరావు గెలుపొందారు.

ప్రస్తుతం భాజపా నుంచి తాండ్ర వినోద్‌.. భారాస నుంచి నామా నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చివరి నిమిషంలో తమ అభ్యర్థి రఘురాంరెడ్డిని ప్రకటించింది. భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు (Tandra Vinod Rao) స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట. ఇంటర్‌ వరకూ పాల్వంచలో చదివిన వినోద్‌రావు, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ చేశారు. 20ఏళ్ల నుంచి హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో స్థిరపడి పలు వ్యాపార సంస్థల్లో భాగస్వామిగా ఉన్నారు. ఏకలవ్య ఫౌండేషన్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక భారాస నుంచి పోటీ చేస్తున్న నామా నాగేశ్వ‌రరావు (Nama Nageswara Rao) రాజకీయంగా సుపరిచితులే. ఇప్పటికే రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక ఆయన మరోసారి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. రాజకీయాల్లోకి రాకముందే వ్యాపారావేత్తగానూ రాణించారు.

అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని (Ramasahayam Raghuram Reddy) నిలిపింది. రాజకీయ దిగ్గజం సురేందర్‌రెడ్డి కుమారుడు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడైన రఘురాంరెడ్డిని చివరి నిమిషంలో కాంగ్రెస్‌ టికెట్‌ వరించింది. వీరి స్వస్థలం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ. 1985 నుంచి రఘురాంరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. డోర్నకల్‌ శాసనసభ, వరంగల్‌ లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ బోర్డు ఆఫ్‌ గవర్నెన్స్‌ వైస్‌ ఛైర్మన్‌గా, హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.

 • గెలుపొందిన అభ్యర్థులు వీరే!
 • 1952- టి.బి.విఠల్ రావు(పి.డి.ఎఫ్)
 • 1957- టి.బి.విఠల్ రావు(పి.డి.ఎఫ్)
 • 1962- తేళ్ల లక్ష్మీకాంతమ్మ(కాంగ్రెస్‌)
 • 1967- తేళ్ల లక్ష్మీకాంతమ్మ(కాంగ్రెస్‌)
 • 1971- తేళ్ల లక్ష్మీకాంతమ్మ(కాంగ్రెస్‌)
 • 1977- జలగం కొండలరావు(కాంగ్రెస్‌)
 • 1980- జలగం కొండలరావుకాంగ్రెస్ (ఐ)
 • 1984- జలగం వెంగళరావు(కాంగ్రెస్‌)
 • 1989- జలగం వెంగళరావు(కాంగ్రెస్‌)
 • 1991- పి.వి.రంగయ్య నాయుడు(కాంగ్రెస్‌)
 • 1996- తమ్మినేని వీరభద్రం  భారత కమ్యూనిష్టు పార్టీ (మార్క్సిస్ట్)
 • 1998- నాదెండ్ల భాస్కరరావు(కాంగ్రెస్‌)
 • 1999- రేణుకా చౌదరి(కాంగ్రెస్‌)
 • 2004 రేణుకా చౌదరి(కాంగ్రెస్‌)
 • 2009 నామా నాగేశ్వరరావు(తెదేపా)
 • 2014-పొంగులేటి శ్రీనివాసరెడ్డి(వైకాపా)
 • 2019 - నామా నాగేశ్వరరావు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img