icon icon icon
icon icon icon

నిజామాబాద్

Updated : 10 Apr 2024 17:28 IST

లోక్‌సభ నియోజకవర్గం

నిజామాబాద్ లోక్‌సభ స్థానం 1952లో ఆవిర్భవించింది. మొదటి నుంచి ఇది జనరల్‌ కేటగిరిలోనే ఉంది.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజవకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి. 

2019 ఎన్నికల్లో భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ విజయం సాధించారు. ప్రస్తుతం భాజపా నుంచి ఆయనే పోటీ చేస్తుండగా, భారాస నుంచి బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డి బరిలో నిలిచారు. భాజపా, కాంగ్రెస్‌, భారాస అభ్యర్థులు శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో మూడు వేర్వేరు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు. కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఇలా ముగ్గురు ఒకే పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయి.. ఒకే లోక్‌సభ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలోకి దిగుతుండటం గమనార్హం.

ఈ సారి ప్రధాన పార్టీల నుంచి బరిలో వీళ్లే..!

మూడు పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ గత నెలలోనే ప్రచారం ప్రారంభించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోదీ ఛరిష్మాను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని, నియోజకవర్గంలో కమలం వికసిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతున్నారు. నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశాలు విస్తృతంగా నిర్వహిస్తూ కార్యకర్తలను ఉత్తేజ పరుస్తున్నారు.

మరోవైపు అభ్యర్థిగా ఖరారు కాకముందే జీవన్‌రెడ్డి.. జగిత్యాల జిల్లాలో పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేశారు. నిజామాబాద్‌లో ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌ రెండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలిచింది. కానీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో.. మునుపటి బలాన్ని తిరిగి తెచ్చుకొనే వ్యూహాల అమలుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే పలువురు సహకార సంఘాల ఛైర్మన్లు, ఇటీవల పదవీకాలం ముగిసిన సర్పంచులు హస్తం గూటికి చేరారు. అధికారంలోకి వచ్చిన కొంతకాలంలోనే ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేశామని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అమలు చేసిన పథకాలు, రానున్న రోజుల్లో ఏయే వర్గాలకు ఎలాంటి ప్రయోజనాలను వర్తింపజేస్తామని చెప్పేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆలోచన చేశారు.

అలాగే భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ కూడా తన ప్రచారాన్ని జగిత్యాల జిల్లా నుంచి మొదలుపెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, కేంద్రంలో భాజపా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.

  • గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల వివరాలు
  • 1952: హెచ్.సి. హెడ (కాంగ్రెస్)
  • 1957 :హెచ్.సి. హెడ (కాంగ్రెస్)
  • 1962 :హెచ్.సి హెడ (కాంగ్రెస్)
  • 1967 :ఎం.నారాయణరెడ్డి (స్వతంత్ర)
  • 1971 :ఎం.రాంగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్)
  • 1977 :ఎం.రాంగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్)
  • 1980 :ఎం.రాంగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్)
  • 1984 :టి.బాలాగౌడ్ (కాంగ్రెస్)
  • 1989 :టి.బాలాగౌడ్ (కాంగ్రెస్)
  • 1991 :గడ్డం గంగారెడ్డి (తెదేపా)
  • 1996 :ఆత్మచరణ్‌రెడ్డి (కాంగ్రెస్)
  • 1998 :గడ్డం గంగారెడ్డి (తెదేపా)
  • 1999 :గడ్డం గంగారెడ్డి (తెదేపా)
  • 2004 :మధుయాష్కిగౌడ్ (కాంగ్రెస్)
  • 2009 :మధుయాష్కిగౌడ్ (కాంగ్రెస్)
  • 2014: కవిత(తెరాస)
  • 2019- ధర్మపురి అర్వింద్‌ (భాజపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img