Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 May 2024 09:31 IST

1. నన్ను జైల్లోనే చంపాలని చూశారు

జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న తప్పులను ఎత్తి చూపినందుకు తనను జైల్లోనే చంపాలని చూశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. సాయంత్రం రాజమహేంద్రవరంలో అభిమానులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయికలో మాట్లాడారు.పూర్తి కథనం   

2.అంబానీ ఇంట పెళ్లికి కరీంనగర్‌ ఫిలిగ్రీ ఉత్పత్తులు

వెండి తీగతో కళాకారులు ఆవిష్కరించే అద్భుతమైన కళల్లో కరీంనగర్‌ ఫిలిగ్రీ ఒకటి. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ, నీతా దంపతుల కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం సందర్భంగా దేశ విదేశాలకు చెందిన అతిథులకు బహుమతులుగా ఇచ్చేందుకు దాదాపు 400 వస్తువులకు ఆర్డర్‌ చేసినట్లు కరీంనగర్‌ ఫిలిగ్రీ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు ఎర్రోజు అశోక్, కార్యదర్శి గద్దె అశోక్‌కుమార్‌లు తెలిపారు. జ్యుయలరీ బాక్సులు, పర్సులు, ట్రేలు, ఫ్రూట్‌ బౌల్స్, తదితర వస్తువులకు ఆర్డర్‌ ఇచ్చారు. పూర్తి కథనం   

3.నంబర్లు భళా... కాసులు గలగల!

అంకెలు కాసులు కురిపిస్తున్నాయి. ఏటా ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్‌ పెరుగుతుండడంతో రవాణాశాఖ పంటపండుతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కేవలం ఫ్యాన్సీ నంబర్ల ద్వారానే రూ.119.73 కోట్లు ఆదాయం సమకూరింది. 2014-15లో అది కేవలం రూ.23.24 కోట్లే. పదేళ్లలో దాదాపు అయిదు రెట్లు పెరగడం విశేషం. పూర్తి కథనం   

4.‘స్మోకీ పాన్‌’ తిన్న బాలిక పేగుకు రంధ్రం

ద్రవరూప నైట్రోజన్‌ నింపిన కిళ్లీ (స్మోకీ పాన్‌)ను తిన్న ఓ 12 ఏళ్ల బాలిక పేగుకు రంధ్రం పడినట్లు బెంగళూరులోని నారాయణ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. ఓ వివాహ రిసెప్షన్‌లో స్మోకీ పాన్‌ తినడంతో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చూపించగా బాలిక చిన్నపేగు మొదటి భాగంలో రంధ్రం పడిందని వైద్యులు తేల్చారు. శస్త్రచికిత్స చేసి దెబ్బతిన్న భాగాన్ని తొలగించారు. పూర్తి కథనం   

5.నల్లమలను చూసొద్దాం రండి

ఈసారి వేసవి సెలవులు వచ్చినా.. అధిక ఉష్ణోగ్రతలు, ఎన్నికల వేడి వల్ల చాలామంది విహార యాత్రలకు వెళ్లలేకపోయారు. ఇటీవలే ఎన్నికలు ముగిశాయి.. ప్రస్తుతం వర్షాలతో వాతావరణం చల్లబడింది. దీంతో విహార యాత్రలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నవారు నల్లమలను సందర్శిస్తే గుర్తుండిపోయే అనుభూతులు సొంతమవుతాయి. ఇక్కడున్న జంగిల్‌ సఫారీ, ఎకోటూరిజం, జీవవైవిధ్య కేంద్రాలు పర్యాటకులకు వినోదంతోపాటు విజ్ఞానాన్ని పంచుతాయి. పూర్తి కథనం  

6.అడ్వాన్స్‌డ్‌కు అర్హుల్లో తెలుగువాళ్లే అత్యధికులు

జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందిన వారిలో అత్యధికులు తెలుగు రాష్టాల విద్యార్థులే. ఏకంగా 18.38 శాతం మంది ఏపీ, తెలంగాణ విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్యలో తెలంగాణ మూడో, ఏపీ నాలుగో స్థానంలో నిలవడం విశేషం. పూర్తి కథనం   

7.నేనైతే మొదట కోహ్లినే ఎంపిక చేస్తా

విరాట్‌ కోహ్లిని జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవడానికి భారత్‌లో జనం కారణాలు వెతుకుతారని, తానైతే టీ20 ప్రపంచకప్‌కు మొదట అతణ్నే ఎంచుకుంటానని ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ అన్నాడు. సూపర్‌ ఫామ్‌ను ప్రదర్శిస్తోన్న కోహ్లి ఐపీఎల్‌లో 741 పరుగులతో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. పూర్తి కథనం   

8.అండర్‌ 16... నో సోషల్‌ మీడియా!

తిండి తినటం లేదంటే... ఏడాది పిల్లలకూ సెల్‌ఫోన్‌ చేతిలో పెట్టేసి... ముద్ద నోట్లో పెడుతున్న కాలం! తప్పని తెలిసినా అనివార్యంగా పిల్లలను ఫోన్లకు, సోషల్‌ మీడియాకు అలవాటు చేస్తున్నామనే ఆందోళన పెరుగుతోంది. అందుకే... పదహారేళ్ల వయసు దాటేదాకా పిల్లలను సోషల్‌మీడియాకు దూరంగా ఉంచాలనే డిమాండ్‌ ఊపందుకుంటోంది. తాజాగా ఆస్ట్రేలియా ఆ దిశగా అడుగులు వేస్తోంది. పూర్తి కథనం   

9.టీఎస్‌ ట్రాన్స్‌కోకు రూ.50 లక్షల జరిమానా

మొయినాబాద్‌ సమీపంలోని మృగవని నేషనల్‌ పార్కు భూమిలో అనుమతుల్లేకుండా విద్యుత్‌ టవర్ల నిర్మాణం చేపట్టారన్న అభియోగంపై టీఎస్‌ ట్రాన్స్‌కోకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ రూ.50 లక్షల జరిమానా విధించింది. ఓఆర్‌ఆర్‌ నిర్మాణంతో ఇప్పటికే అటవీ భూమి కుంచించుకుపోయిందని, తాజా పనుల కోసం 1851 చెట్లు నరికేయడంతో మరింత నష్టపోయిందంటూ నగరానికి చెందిన పర్యావరణవేత్తలు దొంతి నర్సింహారెడ్డి, మహేశ్‌ మామిండ్ల ఎన్జీటీని ఆశ్రయించారు. వాదోపవాదాలు విన్న ట్రైబ్యునల్‌ ఈమేరకు తీర్పు వెలువరించింది. పూర్తి కథనం   

10.వరంగల్‌ ఘటనపై నివేదికకు మంత్రి ఆదేశం

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో మంగళవారం విద్యుత్‌ సరఫరాకు సుమారు ఐదు గంటల పాటు అంతరాయం కలిగిన నేపథ్యంలో బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అధికారులతో సమీక్షించారు. ఈ ఘటనలో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురికావడానికి బాధ్యులను గుర్తించి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ను ఆదేశించారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని