logo

నన్ను జైల్లోనే చంపాలని చూశారు

జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న తప్పులను ఎత్తి చూపినందుకు తనను జైల్లోనే చంపాలని చూశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 23 May 2024 12:31 IST

ఎంపీ రఘురామ కృష్ణరాజు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న తప్పులను ఎత్తి చూపినందుకు తనను జైల్లోనే చంపాలని చూశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. సాయంత్రం రాజమహేంద్రవరంలో అభిమానులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయికలో మాట్లాడారు. ‘‘నా పుట్టిన రోజే అరెస్టు చేసి తీసుకెళ్లారు. అదే చనిపోయిన రోజుగా భావించాను. పోలీసు కస్టడీలో ముగ్గురు వ్యక్తులు మాస్కులు ధరించి చిత్రహింసలకు గురిచేశారు. తెల్లకాగితంపై సంతకం చేయాలని వాదనకు దిగారు. తహసీల్దారు, రెవెన్యూ అధికారులు పేపరుపై సంతకాలు చేయాలని హింసించారు. సంతకం పెడితేనే పంపిస్తామని, లేదంటే ఇక్కడే చంపేస్తామని బెదిరించారు. కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో నోరువిప్పితే ఇక అంతే సంగతులని భయపెట్టారు. కోర్టుకు తీసుకొచ్చే సమయంలో మీడియాను కూడా అనుమతించలేదు. కొంతమంది చొరవ తీసుకొని నా కాళ్లను ఫొటోలు తీసి పత్రికల్లో వేశారు. దాంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడ్డారు. అది తప్పని వాదించాను. దాంతో నాపై కక్ష పెట్టుకొని హింసించారు. ప్రభుత్వ పనుల్లో కమీషన్ల కోసం కక్కుర్తి పడుతుంటే సరికాదని చెప్పాను. అమరావతి రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లామని.. ఇప్పుడు మార్చడం తగదని చెప్పినా జగన్‌ మనస్తత్వం మారలేదు. అలాంటి వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదు’ అని రఘురామ వ్యాఖ్యానించారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని