Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 18 May 2024 13:09 IST

1. ఈఏపీ సెట్‌ ఫలితాలు.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే..

తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్‌ (TG EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 2,40, 618 మంది విద్యార్థులు.. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో 91,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. పూర్తి కథనం

2. మాలీవాల్‌ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్‌ నివాసం నుంచి మరో వీడియో

ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి జరిగిందంటూ ఆ పార్టీ ఎంపీ స్వాతీమాలీవాల్ (Swati Maliwal) ఆరోపణల నేపథ్యంలో.. మరికొన్ని దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. బయటకు తీసుకువెళ్తున్న సిబ్బందిని ఆమె వదిలించుకునే ప్రయత్నం చేశారు.పూర్తి కథనం

3. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

శ్రీవారి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ శనివారం కూడా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు సుమారు 2 కిలోమీటర్ల వరకు క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని తితిదే ప్రకటించింది.పూర్తి కథనం

4. విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్‌ పార్లమెంట్‌లో ఎంపీల కొట్లాట

పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పరస్పర విమర్శలు.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్షాల ఆందోళనలు తరచూ చూస్తునే ఉంటాం. ఇక సభ్యుల మధ్య వాగ్వాదం కూడా సరేసరి. అయితే అదంతా మర్యాదపూర్వకంగా ఉండాలి. అంతేగానీ, చట్టసభల హుందాను పెంచాల్సిన ప్రజాప్రతినిధులే విచక్షణ మరిచి ప్రవర్తిస్తే..! తైవాన్‌ పార్లమెంట్‌ (Taiwan Parliament)లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.పూర్తి కథనం

5. కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి

సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్‌ 82లో భూవివాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, భారాస నేత మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య భూవివాదం నెలకొంది. ఈక్రమంలో తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్‌ వేశారని.. దానిని తొలగించాలని అనుచరులను ఆదేశించారు.పూర్తి కథనం

6. కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్‌

దేశంలోని భారతీయ విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని నగరం బిషెక్‌లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగడంతో.. ఎవరు బయటకు రావొద్దని సూచించింది. ఈ మేరకు అక్కడి మన దేశ రాయబార కార్యాలయం ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టింది.పూర్తి కథనం

7.  నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై భాజపా ఫోకస్‌!

వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉపఎన్నికపై భాజపా (BJP) ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. విజయమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. మండలిలో తమ బలం పెంచుకునేందుకు ఈ ఉపఎన్నికల్లో గెలిచి సత్తాచాటాలని భావిస్తోంది. పట్టభద్రులను తమ వైపునకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఉద్యోగ, నిరుద్యోగ యువతకు.. కాంగ్రెస్, భారాసలు చేసిన మోసాలను వివరిస్తూ మండలిలో పట్టభద్రుల గళం వినిపించేందుకు భాజపాను గెలిపించాలని కమలదళం ఓట్లు అభ్యర్థిస్తోంది.పూర్తి కథనం

8. ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్‌కే మద్దతు: కేఎల్ రాహుల్

ఐపీఎల్‌ 17వ సీజన్‌ ప్రారంభానికి ముందు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సునీల్ శెట్టి ఓ యాడ్ చేసిన విషయం గుర్తుందా.. సునీల్ కుమార్తె అథియా శెట్టిని కేఎల్‌ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో తన లఖ్‌నవూ జట్టుకు బాలీవుడ్‌ స్టార్‌ మద్దతు తెలుపుతాడని కేఎల్ అనుకుంటాడు. కానీ, రోహిత్ ప్రాతినిధ్యం వహించే ముంబయికే తాను సపోర్ట్‌ చేస్తానని చెప్పడంతో కేఎల్ ఉడుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.పూర్తి కథనం

9. కెమెరామన్‌.. ప్లీజ్‌ ఆడియో ఆన్‌ చేయొద్దు: రోహిత్ శర్మ

ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబయి చివరి మ్యాచ్‌ ఆడేసింది. లఖ్‌నవూతో జరిగిన పోరులో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇందులో లఖ్‌నవూ గెలిచినా ఇంటిముఖం పట్టక తప్పలేదు. లఖ్‌నవూ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి 196/6 స్కోరుకే పరిమితమైంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన రోహిత్ శర్మ (Rohit Sharma) 38 బంతుల్లో 68 పరుగులు చేశాడు.పూర్తి కథనం

10. అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి

బాలీవుడ్‌లో ప్రముఖ టీవీ షో ‘తారక్‌ మెహతా కా ఉల్టా చష్మా’ నటుడు గురుచరణ్‌ సింగ్‌ (Gurucharan Singh) 24 రోజుల తర్వాత ఇల్లు చేరారు. ఏప్రిల్‌ 22న అదృశ్యమైన ఆయన శుక్రవారం క్షేమంగా తిరిగి వచ్చారు. ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా గురుచరణ్‌ పలు ప్రదేశాలకు వెళ్లినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని