Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 20 Mar 2024 13:00 IST

1. జగన్‌ ఐదేళ్ల పాలనలో ప్రజలకు నరకం: నారా లోకేశ్‌

ఏ సీఎం అయినా తమ పరిపాలనను అభివృద్ధి కార్యక్రమంతో ప్రారంభిస్తారని.. కానీ జగన్ మాత్రం విధ్వంసంతో మొదలుపెట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. తాడేపల్లిలోని అపర్ణ అపార్టుమెంట్‌ వాసులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్‌ పాలనలో ప్రజలు ఐదేళ్లు నరకం అనుభవించారన్నారు. పూర్తి కథనం

2. ‘నన్ను క్షమించండి..నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా’: కేంద్రమంత్రి పోస్టు

రామేశ్వరం కెఫే బాంబు పేలుడు(Rameshwaram Cafe Blast) కేసులో నిందితుడికి సంబంధించిన ప్రాంతం గురించి కేంద్రమంత్రి శోభా కరంద్లాజే (Shobha Karandlaje) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దాంతో మంత్రి క్షమాణలు చెప్పాల్సివచ్చింది. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు పోస్టు పెట్టారు.పూర్తి కథనం

3. తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం

తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఝార్ఖండ్‌ గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్‌.. అదనంగా తెలంగాణ బాధ్యతలు స్వీకరించారు. తమిళిసై రాజీనామా నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయన్ను నియమించిన విషయం తెలిసిందే.పూర్తి కథనం

4. సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్‌ విడుదల

సార్వత్రిక ఎన్నికలకు (Lok sabha Elections 2024) తొలి నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజక వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చింది. అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించేందుకు మార్చి 27 గడువు. 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.పూర్తి కథనం

5. కాకినాడ జిల్లాలో జంట హత్యల కలకలం

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురం పంట పొలాల్లో బుధవారం ఉదయం జంట హత్యలు కలకలం రేపాయి. పోలీసుల కథనం ప్రకారం.. చేబ్రోలుకు చెందిన పోసిన శ్రీను(45), పెండ్యాల లోవమ్మ(35)ను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు కత్తితో నరికి విచక్షణారహితంగా హత్య చేశాడు.పూర్తి కథనం

6. పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంట నష్టంపై ఏదీ?: కేటీఆర్‌

హైదరాబాద్‌: రైతులంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని.. వడగళ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు.పూర్తి కథనం

7. తూత్తుకుడి స్థానంలో కనిమొళి, నీలగిరి నుంచి రాజా: అభ్యర్థులను ప్రకటించిన డీఎంకే 

సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడంతో ఓటర్లపై పార్టీలు వరాలు జల్లు కురిపిస్తున్నాయి. అదే సమయంలో లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తమిళనాడు(Tamil Nadu)లో అధికార, ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే(DMK), అన్నాడీఎంకే(AIADMK) తమ అభ్యర్థులను ప్రకటించాయి. డీఎంకే నేతల సమక్షంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మేనిఫెస్టో విడుదల చేశారు.పూర్తి కథనం

8. తప్పుడు ధ్రువీకరణలతో 21లక్షల సిమ్‌కార్డులు.. రద్దుకు డీవోటీ చర్యలు..!

దేశ వ్యాప్తంగా తప్పుడు ప్రూఫ్‌ల ఆధారంగా సుమారు 21 లక్షల సిమ్‌కార్డులు జారీ అయినట్లు తమ విశ్లేషణలో తేలిందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ తెలిపింది. ఈ మేరకు ఎయిర్‌టెల్‌, ఎంటీఎన్‌ఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో, వొడాఫోన్‌ సంస్థలకు అలర్ట్‌ జారీ చేసినట్లు వెల్లడించింది. కొన్ని అనుమానాస్పద నంబర్ల జాబితాను విడుదల చేసి చేసి వాటి పత్రాలను తక్షణమే రీవెరిఫికేషన్‌ చేయాలని ఆదేశించినట్లు చెబుతోంది.పూర్తి కథనం

9. జొమాటో కీలక ప్రకటన.. వెజ్‌ ఆర్డర్లూ ఎర్ర రంగు యూనిఫామ్‌లోనే..!

శాకాహారం మాత్రమే కోరుకునే వారికోసం ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’ (Pure Veg Fleet)ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన కొన్ని గంటల్లోనే జొమాటో (Zomato) మరో కీలక ప్రకటన చేసింది. ఈ కొత్త సేవలను అందించే తమ డెలివరీ బాయ్స్‌ గ్రీన్‌ రంగు యూనిఫామ్‌ ధరిస్తారని తెలిపిన కంపెనీ తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై అందరూ ఎర్ర రంగు యూనిఫామ్‌లోనే కనిపిస్తారని తెలిపింది.పూర్తి కథనం

10. చంద్రుడి ఆవలి పక్కకు చైనా కమ్యూనికేషన్ ఉపగ్రహం..!

చంద్రుడిలోని చీకటి భాగంలోకి చైనా (China) ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీనికి సంబంధించి లాంగ్‌ మార్చ్‌ 8 రాకెట్‌పై క్యూకియావ్‌-2 అనే 1.2 టన్నుల శాటిలైట్‌ను హైనాన్‌ ప్రావిన్స్‌ నుంచి బుధవారం ఉదయం లాంచ్‌ చేసింది. భవిష్యత్తులో చైనా చంద్రుడిపై చేసే ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని భూమిపైకి పంపేందుకు దీనిని వాడనున్నారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని