Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Mar 2024 13:08 IST

1. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు

రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్‌ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేడ్కర్‌, జ్యోతిబా ఫులే వంటి మహనీయుల స్ఫూర్తితో 1982లో ఇదే రోజున ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారని గుర్తుచేశారు. పూర్తి కథనం

2. కేజ్రీవాల్ ఫోన్‌లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై దిల్లీ మంత్రి, ఆప్‌ నాయకురాలు ఆతిశీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ సంస్థ భాజపా రాజకీయ ఆయుధంగా పనిచేస్తోందని దుయ్యబట్టారు. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఫోన్‌ నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) లోక్‌సభ ఎన్నికల వ్యూహాలను తెలుసుకోవాలని ఈడీ (ED) ప్రయత్నిస్తోందని ఆరోపించారు.పూర్తి కథనం

3. సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ

సీఎం రేవంత్‌రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరతానని గురువారం ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మర్యాదపూర్వకంగా సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ తదితరులు పాల్గొన్నారు.పూర్తి కథనం

4. ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్‌.. గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ మృతిపై కుటుంబం అనుమానాలు!

ఉత్తర్‌ప్రదేశ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్‌, రాజకీయవేత్త ముఖ్తార్‌ అన్సారీ (Mukhtar Ansari) మరణంతో ఆ రాష్ట్రంలో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు. ప్రజలు ఎక్కడా గుమికూడదని ప్రకటించారు. బందా, మౌ, గాజీపూర్‌, వారణాసి జిల్లాలో అదనపు బలగాలను మోహరించారు.పూర్తి కథనం

5. ‘ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. ఆయన పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు ఆదేశాలతో పనిచేసినట్లు గట్టుమల్లు చెప్పినట్లు సమాచారం.పూర్తి కథనం

6. కాంగ్రెస్‌కు మళ్లీ షాక్‌.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదాయపు పన్ను (Income Tax) అంశంలో కాంగ్రెస్‌ (Congress)కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ పార్టీకి ఐటీ విభాగం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేత వివేక్‌ తంఖా శుక్రవారం వెల్లడించారు. 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1700 కోట్ల డిమాండ్‌ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.పూర్తి కథనం

7. నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!

భారత్‌ సహా ఎన్నికలు జరగనున్న అన్ని దేశాల్లో ప్రజల రాజకీయ, పౌర హక్కులకు రక్షణ ఉంటుందని భావిస్తున్నామని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ అన్నారు. ప్రతిఒక్కరికీ స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు, కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయటంతో భారత్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఓ విలేకరి ప్రస్తావించగా.. డుజారిక్‌ పైవిధంగా స్పందించారు.పూర్తి కథనం

8. ఒకప్పటి క్రిప్టో కింగ్‌ శామ్‌ బ్యాంక్‌మన్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష

దివాలా తీసిన క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ ఎఫ్‌టీఎక్స్‌ సహ వ్యవస్థాపకుడు శామ్‌ బ్యాంక్‌మన్‌ ఫ్రీడ్‌కు (Sam Bankman Fried) న్యూయార్క్‌ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం తీర్పు వెలువరించింది. శిక్ష ఖరారుకు ముందు బ్యాంక్‌మన్‌ వ్యవహార శైలిపై న్యాయమూర్తి లెవిస్‌ కప్లన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.పూర్తి కథనం

9. ‘మిలిటరీ తరహా కోచ్‌’ అంటూ వీజ్‌ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్

కోల్‌కతా కోచ్‌ చంద్రకాంత్‌ పండిత్‌ కోచింగ్‌ విధానాలపై నమీబియా ఆటగాడు డేవిడ్‌ వీజ్‌ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో వైరల్‌గా మారాయి. చంద్రకాంత్‌కు దేశవాళీ క్రికెట్‌లో ఎంతోమందికి శిక్షణ ఇచ్చిన అనుభవం ఉంది. అతడివి మిలిటరీ తరహా కోచింగ్ పద్ధతులంటూ వీజ్‌ చేసిన వ్యాఖ్యలపై కోల్‌కతా స్టార్‌ ఆల్‌రౌండర్ ఆండ్రి రస్సెల్ స్పందించాడు. ఒక్కో కోచ్‌ శైలి భిన్నంగా ఉంటుందని.. చంద్రకాంత్‌కు రస్సెల్‌ మద్దతుగా నిలిచాడు.పూర్తి కథనం

10. ప్రధాని మోదీ, బిల్‌గేట్స్‌.. ‘చాయ్‌ పే చర్చ’ 

విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. అయితే, కృత్రిమ మేధతో కొత్త సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ, టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ (Bill Gates) శుక్రవారం ‘చాయ్‌ పే చర్చ’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిటల్‌ టెక్నాలజీ సహా పలు రంగాలపై వీరిద్దరూ చర్చించారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని