Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 19 Mar 2023 13:12 IST

1. ఎట్టకేలకు రామగోపాల్‌రెడ్డికి డిక్లరేషన్‌ అందజేత

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ఎట్టకేలకు డిక్లరేషన్‌ ఫారం అందుకున్నారు. ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆయనకు డిక్లరేషన్‌ ఫారం అందజేశారు. ఆయన వెంట కాలవ శ్రీనివాసులు, పార్థసారథి, తెదేపా నేతలు, తదితరులు ఉన్నారు. ఎమ్మెల్సీగా రామగోపాల్‌రెడ్డి గెలిచినట్టు అధికారులు శనివారం రాత్రే ప్రకటించినా ఆయనకు ధ్రువీకరణ పత్రం అందించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. స్వప్నలోక్‌ అగ్నిప్రమాదం.. చాలా దురదృష్టకరం: కిషన్‌రెడ్డి

రద్దీగా ఉండే స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. భవనాల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని తెలిపారు. ఆదివారం స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ను పరిశీలించిన ఆయన.. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సీఎం తిరువూరు పర్యటన.. జగన్‌ ఫొటోతో పోలీసులకూ ప్రత్యేక గుర్తింపు కార్డులు

జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం కాసేపట్లో ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌ ముఖ్యఅతిథిగా హాజరై నిధులను విడుదల చేయనున్నారు. అయితే సీఎం బందోబస్తు విధులకు వచ్చిన పోలీసులకూ ఈసారి ప్రత్యేక గుర్తింపుకార్డులు జారీ చేశారు. జగన్‌ ఫొటోతో ఆ కార్డులు ఇచ్చారు. బందోబస్తు విధులకు వచ్చే పోలీసులు తప్పకుండా ఆ గుర్తింపుకార్డు ధరించాలని అధికారులు ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నవీన్‌ హత్య కేసు.. జైలు నుంచి నిహారిక విడుదల

అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధిలో జరిగిన బీటెక్‌ విద్యార్థి నవీన్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ స్నేహితురాలు నిహారికకు బెయిల్‌ మంజూరైంది. ఈకేసులో ఏ3గా ఉన్న ఆమెకు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో నిహారిక జైలు నుంచి విడుదలైంది. నవీన్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణకు సహకరించినందుకు అతడి స్నేహితుడు హసన్‌, ప్రేమించిన యువతి నిహారికను పోలీసులు నిందితులుగా చేర్చి మార్చి 6వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నివురుగప్పిన ముప్పు..మరో పెను సంక్షోభాన్ని పొదుగుతున్న అమెరికా..!

అమెరికా(USA) మార్కెట్లు తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందన్నది నానుడి. 2008లో ఇక్కడ లేమన్‌ బ్రదర్స్‌ పతనం ప్రపంచాన్నే సంక్షోభంలోకి నెట్టింది. తాజాగా అమెరికా(USA) ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం గంటలు మోగుతున్నాయి. వారం వ్యవధిలో సిలికాన్‌ వ్యాలీ, సిల్వర్‌గేట్‌ బ్యాంక్‌, సిగ్నేచర్‌ బ్యాంక్‌, ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంకులు భారీ కుదుపులకు లోనయ్యాయి. ప్రకంపనలు ఐరోపాను తాకాయి. ఎప్పటి నుంచో ఊసురోమంటూ నెట్టుకొస్తున్న స్విస్‌ దిగ్గజం క్రెడిట్‌ సూయిజ్‌ మరోసారి ఆర్థిక ఐసీయూపైకి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పంజాబ్‌లో హైఅలర్ట్‌.. అమృత్‌పాల్‌ కోసం ముమ్మర గాలింపు

ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థ నేత అమృత్‌పాల్‌ సింగ్‌ పరారీలో ఉన్నట్లు పంజాబ్‌ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అతణ్ని పట్టుకునేందుకు భారీ ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు తెలిపారు. అమృత్‌పాల్‌ను అరెస్ట్‌ చేసే వరకు గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం పంజాబ్‌ వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బ్రిటన్‌ వ్యాఖ్యలపై పార్లమెంటరీ ప్యానెల్‌కు రాహుల్‌ గాంధీ వివరణ!

భారత ప్రజాస్వామ్యంపై లండన్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై ఇంకా దుమారం కొనసాగుతూనే ఉంది. ఆయన క్షమాపణలు చెప్పే వరకు ఊరుకునేది లేదని అధికార భాజపా తేల్చి చెప్పింది. దీనిపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం కొనసాగుతూనే ఉంది. పార్లమెంటు సమావేశాలు సైతం ఎలాంటి చర్చ, కార్యకలాపాలు లేకుండానే వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ తన వ్యాఖ్యలపై శనివారం స్పష్టతనిచ్చినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నది మధ్యలో అద్భుతమైన హైవే.. ఈ చైనా కట్టడం చూస్తే కళ్లు చెదురుతాయి

నది దాటడానికి అనుకూలంగా వంతెన నిర్మించడం ఎక్కడైనా జరుగుతుంది. అదే నది మధ్యలోనే వంతెనలు కడుతూ హైవే వేస్తే ఎలా ఉంటుందో ఊహించగలరా? కష్టం అనుకుంటున్నారు కదూ! చైనా(China) ఇంజినీర్లు దీన్ని చేసి చూపించారు. గత కొన్నేళ్లుగా ఈ మార్గంలో వేలాది వాహనాలు రయ్‌రయ్‌మంటూ దూసుకుపోతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఈక్వెడార్‌, పెరూలో భారీ భూకంపం.. 14 మంది మృతి!

ఈక్వెడార్‌, పెరూలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి ఇప్పటివరకు 14 మంది మృత్యువాతపడ్డారు. మరికొంత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రిక్టర్‌ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. చాలా భవనాలు నేలమట్టం కాగా.. భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. నా కెరీర్‌ ఫెయిల్యూర్‌కు అల్లు అర్జున్‌ని నిందించలేదు: భానుశ్రీ

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun)ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన కో-స్టార్‌ భానుశ్రీ (Bhanushree). ‘వరుడు’ (Varudu)లో ఆయనతో కలిసి పనిచేసినప్పటికీ తనకు అవకాశాలు రాలేదని ఆమె అన్నారు. కెరీర్‌లో ఎన్నో పరాజయాలు చవిచూశానని.. వాటి నుంచే తాను చాలా నేర్చుకుంటున్నానని తెలిపారు. అంతేకాకుండా.. ట్విటర్‌ వేదికగా బన్నీ తనని బ్లాక్‌ చేశాడని మొదట ట్వీట్‌ చేసిన ఆమె.. కొంతసేపటికే ఆయన తనని అన్‌బ్లాక్‌ చేశాడని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని