China : నది మధ్యలో అద్భుతమైన హైవే.. ఈ చైనా కట్టడం చూస్తే కళ్లు చెదురుతాయి!

నిర్మాణ సమయం, వ్యయం తగ్గించడానికి చైనా ఇంజినీర్లు చేసిన ఓ ప్రయత్నం ‘రివర్‌ హైవే’. పర్యాటకులు దాన్ని చూసి ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. 

Published : 19 Mar 2023 10:01 IST

(Image : Twitter)

నది దాటడానికి అనుకూలంగా వంతెన నిర్మించడం ఎక్కడైనా జరుగుతుంది. అదే నది మధ్యలోనే వంతెనలు కడుతూ హైవే వేస్తే ఎలా ఉంటుందో ఊహించగలరా? కష్టం అనుకుంటున్నారు కదూ! చైనా(China) ఇంజినీర్లు దీన్ని చేసి చూపించారు. గత కొన్నేళ్లుగా ఈ మార్గంలో వేలాది వాహనాలు రయ్‌రయ్‌మంటూ దూసుకుపోతున్నాయి.

వంతెనలతో హైవే!

జింగ్‌షాన్‌ కౌంటీలోని గుఫుచెన్‌ను షాంఘై, చెంగ్డు మధ్యలోని ప్రధాన హైవేతో అనుసంధానం చేయడానికి చైనా ప్రభుత్వం నది పొడవునా 4.4 కిలోమీటర్ల దూరం వంతెనలతో హైవే(River Highway) నిర్మించింది. దీన్ని చూస్తే ఎవరికైనా కళ్లు చెదరాల్సిందే. అలా ఉంటుంది దాని నిర్మాణ శైలి. జియాంగ్జీ నది మధ్యలో వాహనాలు వేగంగా వెళ్తుంటే ఆ దారికి ఇరువైపులా ప్రకృతి సిద్ధంగా ఉన్న కొండలను చూస్తూ వావ్‌ అనకుండా ఉండలేరు. నది మధ్యలో వాహనాలతో దూసుకెళ్తున్నట్లుగా అనుభూతి చెందుతారు.

ఖర్చు తగ్గిద్దామని.. 

ఈ ‘రివర్‌ హైవే’కు సమాంతరంగా ముందే రోడ్డు ఉంది. మరి నది మధ్యలో హైవే వేయాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నారా? ఆ రోడ్డును వెడల్పు చేయాలంటే కొత్తగా చాలా చోట్ల టన్నెళ్లు తవ్వాల్సి ఉంటుంది. కొండలు బద్దలుగొట్టాలి. నివాసాలను ఖాళీ చేయించాలి. ఈ తలనొప్పులతో పోలిస్తే నది మధ్యలో వంతెన నిర్మించడం సులభమని చైనా ఇంజినీర్లు భావించారు. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. అందుకు ఓకే చెప్పింది.

పర్యాటకుల తాకిడి

హుబీ ప్రావిన్స్‌లోని జియాంగ్జీ నది పలు వంపులు తిరుగుతూ పర్వతాల గుండా సాగుతుంది. సాధారణ హైవేతో పోలిస్తే ఈ మార్గంలో ‘రివర్‌ హైవే’ నిర్మించడం వల్ల వ్యయం బాగా తగ్గింది. మొత్తానికి రూ.585 కోట్లలో ఈ ప్రాజెక్టు పూర్తయింది. నిర్మాణ సమయం కూడా కలిసొచ్చింది. ఎలాంటి చెట్లు నరికివేయాల్సి అవసరం రాలేదు. గతంలో ప్రయాణానికి గంట సమయం పడితే అది 20 నిమిషాలకు తగ్గింది. 2015 నుంచి ఈ హైవేపై రాకపోకలు సాగుతున్నాయి. గత ఎనిమిదేళ్లలో ఈ ‘రివర్‌ హైవే’ను సందర్శించడానికి ఎంతో మంది పర్యాటకులు వెళ్లారు. నది మధ్యలో ప్రయాణిస్తూ అద్భుతమైన అనుభూతిని తమ సొంతం చేసుకున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని