Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 18 Jul 2023 13:08 IST

1. తక్కువ ధరకు కిలో టమాటా.. 2 కి.మీ మేర ప్రజల క్యూ

టమాటా ధరలు చుక్కలనంటుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయితీ ధరకు టమాటాను దక్కించుకునేందుకు కడపలో ప్రజలు బారులు తీరారు. స్థానిక రైతు బజారు వద్ద కిలో రూ.50కే విక్రయిస్తుండటంతో ఉదయం నుంచే క్యూలైన్‌లో నిల్చొని టమాటాలు కొనుగోలు చేశారు. ఉదయం 5 గంటల నుంచే వినియోగదారులు సుమారు 2 కిలోమీటర్ల మేర బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటలు పూర్తయినప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘‘పచ్చి అవినీతిపరుల సదస్సు’’.. విపక్షాల భేటీపై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ దేశ రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా ప్రధాని మోదీ(PM Modi) విపక్ష పార్టీల సదస్సుపై విమర్శలను ఎక్కుపెట్టారు. పోర్టుబ్లెయర్‌లోని వీర్‌ సావర్కర్‌ అంతర్జాతీ విమానాశ్రయ టర్మినల్‌ భవనాన్ని ఆయన  ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే రెండింతల నిధులను అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవుల కోసం వెచ్చించిందని పేర్కొన్నారు. పనిలో పనిగా విపక్షాలనుద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ కుటుంబం కోసం, కుటుంబం చేత, కుటుంబం కొరకు అనేది వారి మంత్రం. పచ్చి అవినీతిపరులు సదస్సు జరుగుతోంది’’ అని విరుచుకుపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సైకిల్‌పై వెళ్తుండగా ఫిట్స్‌.. చెరువులో పడి విద్యార్థిని మృతి

సైకిల్‌పై వెళ్తుండగా మూర్ఛ (ఫిట్స్‌) రావడంతో చెరువులో పడి విద్యార్థిని మృతిచెందింది. ఈ విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతానగరం మండలంలోని ఆవాలవలస గ్రామానికి చెందిన ఆవాల శ్రావణి(14) అనే విద్యార్థిని గాదెలవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇది హత్య కేసు.. బెయిల్‌ కోసం వేచి చూడాల్సిందే: సుప్రీంకోర్టు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని, ఎర్ర గంగిరెడ్డికి బెయిల్‌ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. గంగిరెడ్డి పిటిషన్‌నూ అవినాష్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌కు జత చేస్తూ.. సెప్టెంబర్‌ రెండో వారంలో విచారణ చేపడతామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. అవినాష్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుతోపాటు వివేకా హత్య కేసు వివరాలు, డైరీ సీల్డ్‌ కవర్‌లో అందించాలని సీబీఐని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఒక్క అక్షరం ఎంత పనిచేసింది.. అమెరికా రహస్యాలు రష్యా మిత్రదేశం చేతికి..!

అమెరికా(USA)కు చెందిన సైనిక రహస్యాలు, మ్యాప్‌లు, పాస్‌వర్డ్‌లు ఉన్న లక్షల కొద్దీ ఈమెయిల్స్‌ రష్యా(Russia) మిత్రదేశమైన మాలి చేతికి దక్కాయి. దీనంతటికీ ఒక టైపింగ్‌ తప్పు కారణమైంది. సాధారణంగా అమెరికా సైన్యం తమ బృందాలతో కమ్యూనికేషన్ల కోసం .MIL  అనే ఎక్స్‌టెన్షన్‌ ఉన్న డొమైన్‌ వాడుతుంది. కానీ, చాలా సందర్భాల్లో అమెరికా సైన్యంలోని వారు మెయిల్‌ చేసే సమయంలో పొరబాటున .ML అని టైపు చేసేవారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మాంసం తినని.. మద్యం తాగని వారికే ఉద్యోగం: చైనా కంపెనీ వింత ప్రకటన

చైనా (china)కు చెందిన ఓ కంపెనీ అభ్యర్థుల కోసం ప్రకటన జారీ చేసింది. తమ సంస్థలో పనిచేయాలంటే పాటించాల్సిన నిబంధనల గురించి అందులో పేర్కొంది. మాంసం తినని, మద్యం తాగని, స్మోకింగ్‌ చేయని వారి కోసం వెతుకుతున్నట్లు తెలిపింది. కంపెనీ వెల్లడించిన ఈ కండీషన్లను కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. ప్రస్తుతం ఇది చైనాలో వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. హిండెన్‌బర్గ్‌ నివేదిక పూర్తిగా దురుద్దేశపూరితం: అదానీ

అదానీ గ్రూప్‌ (Adani group) సంస్థలపై అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ (Hindenburg) ఇచ్చిన నివేదిక సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ మరోసారి స్పందించారు. అది పూర్తిగా దురుద్దేశపూరిత నివేదిక అని, తమ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే నిరాధార ఆరోపణలు చేశారని పునరుద్ఘాటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రెండేళ్ల నష్టం రూ.6 లక్షల కోట్లు.. వెల్లడించిన ఎవర్‌గ్రాండే..!

చైనా (China) రియల్‌ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే (Evergrande) గత రెండేళ్లలో భారీ నష్టాలను చవిచూసింది. ఈ కాలంలో దాదాపు 81 బిలియన్‌ డాలర్ల (రూ.6 లక్షల కోట్లు) నష్టం వచ్చింది. మార్కెట్లో ట్రేడింగ్‌కు దరఖాస్తు చేసుకొనేందుకు వీలుగా ఈ కంపెనీ విడుదల చేసిన ఫలితాల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే ఈ కంపెనీ చైనా చరిత్రలోనే అతిపెద్ద రుణ పునర్‌వ్యవస్థీకరణ పూర్తి చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. విపక్ష కూటమి పగ్గాలు.. సోనియా గాంధీకేనా?

వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. బెంగళూరు వేదికగా సోమవారం మొదలైన విపక్షాల భేటీ (Opposition Meet) మంగళవారం కూడా కొనసాగనుంది. నిన్న రాత్రి జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ (Congress) మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్‌ గాంధీ సహా 26 పార్టీల నేతలు పాల్గొన్నారు. కాగా.. విపక్షాల కూటమిలో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ (Sonia Gandhi)కి కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చైనా విదేశాంగ మంత్రి ఎక్కడ..? నెల రోజులుగా కనిపించని కిన్ గాంగ్‌

చైనా (China) ప్రభుత్వాన్ని ధిక్కరించిన వ్యాపార, టెక్‌ వర్గాలపై డ్రాగన్‌ అణచివేత కారణంగా గతంలో పలువురు ప్రముఖులు నెలల తరబడి అదృశ్యం కావడం తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. అలాంటిది ఇప్పుడు సొంత ప్రభుత్వంలోని మంత్రే కన్పించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. చైనా విదేశాంగ మంత్రి కిన్‌ గాంగ్‌ (Foreign Minister Qin Gang) గత మూడు వారాలకు పైగా ప్రజా జీవితంలో కన్పించట్లేదు. ఆయన అదృశ్యంపై బీజింగ్‌ సర్కారు కూడా సరైన కారణాలు వెల్లడించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని